రక్తనాళాల్లో బ్లాక్స్? ఇవీ జాగ్రత్తలు...
హోమియో కౌన్సెలింగ్
నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాణ్ణి ఈమధ్య రాత్రి నిద్రపట్టడం లేదు. చెమటలు పట్టడం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఆదుర్దాపడటం లాంటి లక్షణాలు ఉన్నాయి. ఈమధ్యనే తీవ్రమైన ఒత్తిడి వల్ల నా ఉద్యోగం కూడా వదులుకున్నాను. అయినా నా మనసు, శరీరం నా అదుపులో ఉండటం లేదు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - రవి, హైదరాబాద్
ఈ ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గి, ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. స్ట్రెస్ కలిగించే సందర్భాన్ని, సమయాన్నీ, శారీరక, మానసిక పరిస్థితిని బట్టి... ఒత్తిడి (స్ట్రెస్) తాలూకు తీవ్రత ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆకస్మికంగా అధిక ఒత్తిడి లేదా దీర్ఘకాలిక ఒత్తిడి కలుగుతూ పోతూ ఉండే అది ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇటీవల చూస్తున్న చాలా ప్రధాన వ్యాధుల్లో 80 శాతంపైగా ఒత్తిడి కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు వెల్లడించిన అధ్యయన ఫలితాల వల్ల తెలుస్తోంది.
ఒత్తిడికి కారణాలు: ఆర్థిక సమస్యలు ఉద్యోగాల్లో, పనుల్లో ఒత్తిడి దీర్ఘకాలిక ఆందోళన తీవ్రమైన నిరాశ నిస్పృహలు
పరిణామాలు: ఒత్తిడి వల్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశ వ్యాధులు పెరుగుతాయి.
లక్షణాలు : ఆవేశంగా ఉండటం లేదా చిన్న చిన్న విషయాలకు కోపం రావడం వికారం, తలతిరగడం ఛాతీనొప్పి, గుండె స్పందనల వేగం పెరగడం చిరాకు, ఒంటరితనం విరేచనాలు లేదా మలబద్దకం నిద్రలేకపోవడం.
చికిత్స: ఒత్తిడిని, దాని వల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించడానికి హోమియోలో మంచి చికిత్స ఉంది. ఒత్తిడి తగ్గించడానికి హోమియోలో యాసిడ్ ఫాస్, ఇగ్నీషియా, కాక్యులస్ ఇండికస్, నేట్రమ్ మ్యూర్... మొదలైన మందులు బాగా పనిచేస్తాయి. అయితే ఒక వ్యక్తి ఎంత ఒత్తిడితో ఉన్నాడు అన్న అంశంతో పాటు వారి కుటుంబ, సామాజిక పరిస్థితులతో పాటు అతడు పనిచేసే వాతావరణాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని చికిత్సను సూచిస్తారు. వాటిని అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 50 ఏళ్లు. ‘హెపటైటిస్-బి’తో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు. కానీ అప్పుడప్పుడూ కడుపులో నొప్పి, కొద్దిరోజులుగా బరువు తగ్గడం, మనిషి కూడా నీరసం అయిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మా నాన్నగారి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - చైతన్య, నెల్లూరు
మీరు తెలిపిన విషయాలను పరిశీలిస్తే మీ నాన్నగారికి జీర్ణాశయంలో క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. హెపటైటిస్-బితో బాధపడుతున్న చాలామందిలో ఇలా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వల్ల విషయం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి మీ నాన్నగారికి ఈ కింద పేర్కొన్న స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం మంచిది.
ఫుల్ బ్లడ్ కౌంట్ టెస్ట్ మూడు రోజులు వరసగా మలపరీక్ష సిగ్మాయిడోస్కోపీ సీటీస్కాన్ పెట్ స్కాన్, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాన్‌జియో పాంక్రియాటోగ్రఫీ... వంటి పరీక్షలు చేయించడం వల్ల విషయం తెలుస్తుంది. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిసి ఈ పరీక్షలు చేయించడం మంచిది.
నా వయసు 45 ఏళ్లు. నేను గృహిణిని. మా నాన్నగారు పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలా వచ్చే అవకాశం ఉంటే ముందుగా గుర్తించడం ఎలా? - సాయిలక్ష్మి, అమలాపురం
పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలావరకు వంశపారంపర్యంగానే స్తుంటాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎలాంటి లక్షణాలూ లేకపోయినా ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోండి. నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పదేళ్ల తర్వాత ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది.
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. బరువు 120 కేజీలు. నాకు డయాబెటిస్ ఉంది. ఈ మధ్య గుండెపోటు వచ్చింది. దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. ఈ బ్లాక్స్ ఎవరిలో ఎక్కువగా వస్తాయి? వాటి చికిత్సలు, జాగ్రత్తలు తెలుపగలరు. - సంతోష్‌మోహన్, మెదక్
మొదట మీరు బరువు తగ్గించుకోవడం చాలా అవసరం. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారిలో, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నవారిలో, పొగతాగేవారిలో, స్థూలకాయులు, తగినంత శారీరక శ్రమ చేయనివారిలో రక్తనాళాలు పూడుకుపోవడం ఎక్కువ. ఇవేకాకుండా రక్తంలో లైపోప్రొటీన్-ఏ, హోమోసిస్టిన్, కార్డియోలిపిన్, ఫైబ్రినోజెన్ వంటివి ఉన్నవారికి సైతం రక్తనాళాల్లో పూడికలు పేరుకుపోయే ముప్పు ఎక్కువ. పైన పేర్కొన్న అంశాలలో రెండు కంటే ఎక్కువగా ఉన్నవారు గుండె పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. వాళ్లతో పాటు... కాస్త శ్రమ చేస్తే గుండెనొప్పి/ఆయాసం వస్తున్నవారు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు, శారీరకంగా అధికంగా శ్రమించే క్రీడాకారులు, పోలీసు వంటి ఉద్యోగాల కోసం ఫిట్‌నెస్ పరీక్షలకు వెళ్తున్నవారు, తరచు ఫిట్‌నెస్ పరీక్షలు అవసరమయ్యే పైలట్ల వంటి ఉద్యోగులు సైతం గుండెలో పూడికలు ఉన్నాయేమో అని పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అందరికీ గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలూ అవసరం ఉండదు.
కానీ శారీరక వ్యాయామంతో కూడుకున్న ‘ట్రెడ్‌మిల్’ పరీక్షతో మంచి ప్రయోజనం ఉంటుంది. దీని ఫలితాల ఆధారంగా చాలావరకు పెద్ద, ప్రమాదకరమైన పూడికలు లేవని మాత్రం నిర్ధారణ అవుతుంది. కొలెస్ట్రాల్, హైబీపీ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు, 40 ఏళ్లు పైబడిన వాళ్లు ప్రతి రెండేళ్లకోసారి, 50 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఏడాదీ ట్రెడ్‌మిల్, ఎకో, ఈసీజీ... ఈ మూడు పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇతరత్రా సాధారణ పరీక్షలలో పూడికలు ఉన్నాయని అనుమానం వ్యక్తమైనప్పుడు కచ్చితంగా గుర్తించి నిర్ధారణ చేసేందుకు యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. పూడికలు ఉన్నట్లు ఈ పరీక్ష సమయంలోనే గుర్తిస్తే అప్పటికప్పుడు ‘స్టెంట్స్’ అమర్చుతారు.
చికిత్స : సాధారణంగా 40-60 ఏళ్ల మధ్య వయసువారిలో ఒకటిగానీ, రెండు గానీ పూడికలు ఉంటే స్టెంట్‌లు అమర్చి రక్తప్రసారాన్ని చక్కదిద్దుతారు. రెండుకంటే ఎక్కువ రక్తనాళాల్లో పూడికలు ఉంటే, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ‘బైపాస్’ ఆపరేషన్ ఉత్తమం. జాగ్రత్తలు: పీచు ఎక్కువగా ఉండే శాకాహారం తీసుకోవడం యోగా, ధ్యానం చేయడం నిత్యం వ్యాయామం చేయడం డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, ట్లైగ్లిజరైడ్స్ వంటి కొవ్వులను కచ్చితంగా అదుపులో ఉంచుకోవడం కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెపోటు ఉంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.