నా వయసు 46 ఏళ్లు. కొద్దిరోజులుగా కాలి బొటనవేలు వాచి, సలపరంతో కూడిన నొప్పి వస్తోంది. కాలిలో చిన్నపాటి కదలిక కూడా కష్టంగా అనిపించింది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్ అని చెప్పారు. మందులు వాడినప్పటికీ సమస్య తగ్గలేదు. రక్తపరీక్ష చేయిస్తే రక్తంలో ఇంకా ‘యూరిక్ యాసిడ్’ స్థాయులు అధికంగానే ఉన్నాయని రిపోర్టు వచ్చింది. దయచేసి నా సమస్యకు హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉదా? - ఎమ్. జీవన్‌రెడ్డి, హైదరాబాద్
మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఇదే ‘గౌట్’ వ్యాధి.
కారణాలు: ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు కొన్ని కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల యూరిక్ యాసిడ్ విసర్జన లోపాలు ఏర్పడి గౌట్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యకు సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లు దెబ్బతింటాయి. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి.
చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్