
సూదంటు చిత్రాలు
ఆ చిన్ని కళాకృతులను చూడడానికే కళ్లింత చేసుకుంటాం. మరి తయారు చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందో కదా! అదే మాట విలార్డ్ విగన్(బ్రిటన్)ను అడిగి చూస్తే ఇలా అంటాడు...‘‘కష్టం అనిపించదు. సవాలుగా అనిపిస్తుంది. సవాలును స్వీకరించడం నాకు ఇష్టంగా ఉంటుంది’’. బర్మింగ్‌హామ్‌కు చెందిన 57 సంవత్సరాల విలార్డ్ సూది బెజ్జంలో కళాకృతులను సృష్టించడంలో చేయి తిరిగినవాడు.
అయిదు సంవత్సరాల వయసు నుంచే చిన్ని చిన్ని కళాకృతులను తయారు చేయడంలో ప్రతిభ చూపాడు విలార్డ్. మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలిగే విలార్డ్ చిన్ని కళాప్రపంచాన్ని చూసి కళాభిమానులు రెండు పనులు చేస్తున్నారు. ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవడం ఒకటి, ఆనందంతో విలార్డ్‌ను ప్రశంసించడం ఒకటి. త్వరలో విలార్డ్ మినీ కళాకృతుల ప్రదర్శన ప్రారంభం కానుంది.