
గుండెజబ్బులతో బాధపడేవారికి నానో స్థాయి కణాలతో సరికొత్త మందును అభివృద్ధి చేశారు ఇటలీ, జర్మనీ శాస్త్రవేత్తలు. సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఈ మందును ట్యాబ్లెట్ల రూపంలో కాకుండా ఉబ్బస వ్యాధి మందుల్లా పీల్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మందు చాలా వేగంగా గుండెను చేరుకుని కార్డియోమయసైట్ కణాల ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎముకలు, పళ్లలో ఉండే కాల్షియం ఫాస్పేట్ నానో కణాలను ఉపయోగించుకుని మందును గుండెకు చేర్చడం ఇందులో కీలకమని వివరించారు.
ఎలుకలపై ఈ మందును ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని, గుండె నుంచి రక్తం బయటకు పంప్ అయ్యే మోతాదు 17 శాతం వరకూ పెరిగిందని వివరించారు. మనుషుల మాదిరి ఊపిరితిత్తుల వ్యవస్థ ఉన్న పందులపై కొన్ని ప్రయోగాలు చేశామని, సంప్రదాయ పద్ధతుల కంటే చాలా వేగంగా మందు గుండెకు చేరడాన్ని గుర్తించామని చెప్పారు. నానో స్థాయి కణాలను పీల్చుకున్నప్పటికీ ఎలుకలు, పందుల గుండె కణజాలాల్లో ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత ఈ మందును మానవుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.