
ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండీలుక్‌నే ఇస్తాయి. మరీ ముఖ్యంగా చెవుల నుంచి భుజాల వరకు వేలాడే హ్యాంగింగ్స్‌ను చూస్తే ఎవరికైనా ఒకసారి పెట్టుకోవాలని మనసు పోతుంది. ఎవరైనా పెట్టుకున్నప్పుడు
అవి బాగున్నాయని అలాంటివే కొంటే... అవి మన ముఖానికి నప్పకపోతే ఎలా? అందుకే మన ముఖాకృతిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి.
►ఓవల్ షేప్ ముఖానికి ఏ మోడల్ అయినా చక్కగా నప్పుతుంది. చెవులకు అంటినట్లుండే దిద్దుల నుంచి మీడియం సైజు లోలకుల వరకు అన్నీ బాగుంటాయి. ఇక భుజాలను తాకే హ్యాంగింగ్స్ అయితే చెప్పక్కరలేదు. ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరి దృష్టి వాటి మీద, వాటిని అలంకరించుకున్న వాళ్ల మీద కొన్ని సెకన్లపాటు కేంద్రీకృతమవుతుంది. ఈ ఫేస్‌కట్‌కి మెటల్, బీడ్స్, స్టోన్స్ ఏవైనా నప్పుతాయి.
►స్క్వేర్ ముఖాకృతి ఉన్న వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ముఖం ఆకారానికి పూర్తి విరుద్ధంగా ఉండాలి చెవి ఆభరణాలు. కొట్టొచ్చినట్లు కనిపించేవిగా కాకుండా పొందికగా ఉన్నట్లనించే మోడల్స్ తీసుకోవాలి. అందులో వాడిన బీడ్స్ రంగులు కూడా హుందాగా ఉండాలి.
►హార్ట్ షేప్ ముఖానికి చెవుల దగ్గర తక్కువగా ఉండి కింద వేళ్లాడే భాగం వెడల్పుగా ఉంటే ముఖం అందంగా కనిపిస్తుంది. దీనినే ట్రయాంగిల్ ఫేస్ అని కూడా అంటారు. నుదురు వెడల్పుగా ఉండి చెంపలు పలుచగా, కింది దవడలోపలికి, గడ్డం కొనదేలి ఉంటుంది. చెవుల నుంచి గడ్డం మధ్యలో ఉన్న గ్యాప్‌ని హ్యాంగింగ్స్ ద్వారా కవర్ చేయగలిగితే ఆ ఇయర్ రింగ్స్ వాళ్ల కోసమే డిజైన్ చేశారా అన్నట్లుంటుంది.
►రౌండ్ ముఖానికి ఇయర్ రింగ్స్ సైజు, పొడవు మీద దృష్టి కేంద్రీకరించాలి. మెడ పొడవును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పొడవు హ్యాంగింగ్స్ కాని మీడియం సైజు లేదా చెవిని అంటిపెట్టుకుని ఉంటే దిద్దులు ఏవైనా బావుంటాయి. వాటి డిజైన్‌లో రౌండ్ ఉండకూడదు, ఓవల్ షేప్ కాని, నలుచదరం లేదా ఒకదాని కింద మరొకటిగా వేలాడదీసినట్లు ఉండాలి. ఈ ముఖానికి బీడ్స్ కూడా అందం తెస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment