చేతులకు  పాకే మెడనొప్పి...  తగ్గేదెలా?  | Eating habits Health problems appear to be high | Sakshi
Sakshi News home page

చేతులకు  పాకే మెడనొప్పి...  తగ్గేదెలా? 

Published Fri, Dec 28 2018 2:03 AM | Last Updated on Fri, Dec 28 2018 2:03 AM

Eating habits Health problems appear to be high - Sakshi

నా వయసు 53 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? 
 
మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్‌ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. గతంలో పెద్దవారిలో కనిపించినా,  జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇప్పుడిది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. 

కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం  వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్‌లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. 

లక్షణాలు : ∙సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం ∙నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలుగమనించవచ్చు. 

హోమియో చికిత్స : జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. 
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, 
హైదరాబాద్‌

గ్యాస్ట్రిక్‌ అల్సర్‌కుపరిష్కారం ఉందా?
నా వయసు 35 ఏళ్లు. ఇటీవల కండుపులో మంట, వికారంతో డాక్టర్‌ దగ్గరికి వెళ్తే అబ్డామిన్‌ స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయించి, అల్సర్‌ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? 
ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా ఈమధ్యకాలంలో కనిపిస్తున్న ఆరోగ్య సమస్యలను మనం వ్యాధులుగా పరిగణించడం కంటే జీవనశైలి లోపాలుగా పరిగణిస్తే సబబుగా ఉంటుంది. మన జీవనశైలిలో లోపాలు, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్‌) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌ అంటారు. హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. 

కారణాలు : ∙80 శాతం మందిలో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల అల్సర్లు వస్తాయి ∙చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది ∙మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ∙మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం ∙కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. 

లక్షణాలు : ∙కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ∙ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ’ తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ∙కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ∙నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. 

నివారణ జాగ్రత్తలు : ∙పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ∙మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ∙కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ∙కంటినిండా నిద్రపోవాలి ∙మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం చేయాలి ∙ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. 

చికిత్స : గ్యాస్ట్రిక్‌ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్‌ ఆల్బ్, యాసిడ్‌ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్‌ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 


తిన్న వెంటనే టాయ్‌లెట్‌కు... ఎందుకిలా?
నా వయసు 38 ఏళ్లు. ఒక్కోసారి తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి.  తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి.దయచేసి నా సమస్య ఏమిటి? నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్‌ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్‌ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.

 దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్‌ బ్రీత్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. 

వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. 

చికిత్స: ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, 
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement