ఫ్రాన్స్ పేరెత్తగానే ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ కనిపిస్తుంది. ఓస్ అంతేనా!! అంటే.... ఈ టవర్ స్థాయిలోనే ఇక్కడ పన్నులూ ఎక్కువే. పొదుపు కూడా ఎక్కువే. అదే ఈ కంట్రీ స్పెషల్.
ఏడాదికి ఒక మిలియన్ యూరోల ఆదాయం ఉన్నవారిపై ఏకంగా 75 శాతం మేర ఆదాయపు పన్ను వేయాలని ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండ్ ప్రతిపాదించారు. ఈ దెబ్బకి గెరార్డ్ డెపార్డూ వంటి యాక్టర్ ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డారు. చివరకు ఫ్రాంకోయిస్ వెనక్కి తగ్గారనుకోండి. అది వేరే విషయం. అలాంటి హిస్టరీ ఫ్రాన్స్‌ది. ఫ్రాన్స్‌లో పన్నులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఆదాయ పన్ను 45 శాతంగా ఉంది. దీంతో పాటు సోషల్ సర్వీస్ ట్యాక్స్ 12 శాతం ఎటూ చెల్లించాల్సిందే. చాలా ఉత్పత్తులపై 19 శాతం వేల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) కూడా ఉంటోంది. ఇంత భారీగా పన్నులు విధిస్తున్న ప్రభుత్వం... ఆ సొమ్మును పింఛను, వైద్యంతో పాటు సంక్షేమ పథకాలపై వెచ్చిస్తుండటం వల్ల జనానికి ఆ మేరకు ఊరట దొరుకుతోంది.
పొదుపు చేసేదెలా...?
యూరోజోన్ దేశాలన్నిట్లోనూ అత్యధికంగా పొదుపు చేసేది ఫ్రెంచి వారే. దీనికోసం వారు ఆశ్రయించేది బ్యాంక్ డిపాజిట్లనే. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో బ్యాంకు డిపాజిట్ల విలువ 85,700 కోట్ల డాలర్లపైనే. దీంతోపాటు వీరు పోస్టాఫీస్ పథకాల్లోనూ దాచిపెడుతుంటారు. వీటిపై వచ్చే వడ్డీకి పన్ను భారం లేకపోవటం అసలు కారణం. ఇక పొదుపు పథకాలపై వడ్డీ రేటు మనతో పోలిస్తే చాలా తక్కువ. కేవలం 1.75 శాతం. పిల్లల కోసం, ఇల్లు కొనుక్కోవాలనుకునే వారి కోసం ఇలా.. ఒక్కొక్క అవసరం కోసం ఒక్కో తరహా పొదుపు పథకాలున్నాయి. ఇన్వెస్ట్ చేయడం కన్నా వీటిలో పొదుపు చేయడంవైపే ఫ్రాన్స్ వాసులు మొగ్గు చూపుతుంటారు. అయితే, ఇటీవలి ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తోటి యూరోజోన్ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తే.. ఫ్రాన్స్ తమ సంక్షేమ పథకాల్లో కోత పెడుతుందని అంచనా. అదే జరిగితే.. తప్పనిసరిగా ఫ్రాన్స్ ప్రజలు బ్యాంక్ డిపాజిట్లే కాకుండా ఇతర ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలవైపు మళ్లే అవకాశం ఉంది.
మరి ఖర్చులో...?
విలాస వస్తువులపై ఫ్రెంచివారు పెట్టే ఖర్చు ఎక్కువే. అయితే వీరి ఖర్చుల అలవాట్లను నిరుద్యోగం, తాత్కాలిక ఉద్యోగాలు ప్రభావం చేస్తుంటాయి. నిరుద్యోగం ఎక్కువగా ఉండి, తాత్కాలిక ఉద్యోగాలు తగ్గటం వంటివి జరిగితే వీరు వెంటనే ఖర్చులు తగ్గించేసుకుంటారు. ఒకవేళ ధరలు భారీగా పెరిగిపోతే... చాలా మంది ఖరీదైన వాటి జోలికెళ్లకుండా చౌకైన హైపర్ మార్కెట్లకు క్యూ కడతారు. ఆర్థికాంశాల్లో సహకారం కోసం 34 దేశాలు ఏర్పాటు చేసుకున్న ఓఈసీడీ కూటమిలో ఫ్రాన్స్ కూడా ఉంది. కాకపోతే ఈ దేశాలన్నిట్లోనూ అత్యధిక సమయం తింటూ, తాగుతూ గడిపేసేది ఫ్రెంచివారేనట.!!
ఈఫిల్ టవరు ఇక్కడే అంతెత్తు పన్నులూ ఇక్కడే
Published Fri, Feb 7 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement