రెప్పలకు ఆలివ్... ముఖానికి ఆరంజ్...
మగువ కళ్లకు మరింత అందాన్ని చేకూర్చేవి ఆమె ఐ లాషెస్ (కనురెప్ప వెంట్రుకలు). అవి పొడవుగా ఉంటే వచ్చే అందం అంతా ఇంతా కాదు. అలాంటి ఐ లాషెస్ మీ సొంతం కావాలంటే ప్రతిరోజూ పడుకునే ముందు కనురెప్ప వెంట్రుకలకు ఆలివ్ ఆయిల్ కానీ ఆముద నూనెను కానీ తేలిగ్గా రాసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే ఐ లాషెస్ ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి.
నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని పొడిగా చేసుకొని ముఖారవిందం మెరుపుకోసం ఉపయోగించడం అందరికీ తెలుసు. కానీ ఎంతమందికి అలా చేసే సమయం ఉంటుంది చెప్పండి? కాబట్టి సులువైన చిట్కాతో మీ ముఖానికి తేజస్సును ఇవ్వండి. తాజా నారింజ తొక్కలను నీళ్లలో ఉడక పెట్టండి. తర్వాత ఆ తొక్కలను తీసేసి ఆ రసంతో ముఖంపై మృదువుగా మర్దనా చేస్తుండండి. బయట తిరిగి రావడం వల్ల కందిపోయిన ముఖం కూడా తాజాగా నిగనిగలాడేందుకు ఈ టిప్ పనిచేస్తుంది.