ప్రతిసారీ ‘యుగాంతం వస్తుంది.. యుగాంతం వస్తుంది..’ అంటారు. భయపెడుతూ టీవీ ప్రోగ్రామ్స్ వస్తాయి. కథలు రాస్తారు. సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు ఎలా ఉంటాయంటే, ‘అమ్మో! ప్రపంచం అంతమైతే ఇదంతా జరుగుతుందా?’ అనేలా. మనకూ చావన్నా, ఇలాంటి అంతమయ్యే విషయాలన్నా ఇష్టమే! నిజమే కదూ!? చచ్చుకుంటూ చూస్తాం, చదువుతాం. యుగాంతం అని ప్రచారం చేసిన రోజు రానే వస్తుంది. ఎప్పట్లానే తెల్లారిందని అలారం చెబుతూనే ఉంటుంది. లేచి చూస్తే అంతా నార్మల్‌గానే ఉంటుంది. ‘ఇక అంతా అయిపోతుంది!’ అని బాధపడినవాళ్లూ, ‘అబ్బా! ఇంక అంతా అయిపోతుంది!’ అని సంబరపడినవాళ్లూ ఇంకేం అయిపోలేదని తెలుసుకుంటారు. ఇదీ యుగాంతం పేరుతో జరిగే సైకిల్. క్రీ.శ. ఒకటో శతాబ్దంలోనే భూగ్రహం అంతమైపోతుంది అన్నారు. యుగాంతం అన్నారు. ఆ తర్వాత ప్రతి పదేళ్లకో, యాభై ఏళ్లకో అంటూనే ఉన్నారు.
1996 అన్నారు. కాదు కాదు 97 అన్నారు. ఇది మాత్రం పక్కా.. 99 అన్నారు. తూచ్.. 2001 అన్నారు. ఇంతవరకైతే వచ్చాం కానీ 2003లో మాత్రం ఇంక ఉండం అన్నారు. ఇది ఫైనల్ ఇంక.. 2012 తర్వాత భూగ్రహం అంతమైపోతుంది.. యుగాంతమిదే అన్నారు. 2012ను మాత్రం గట్టిగానే గుద్ది చెప్పుకున్నారు అంతా. ఆ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. చూసి సంబరపడ్డాం కూడా! అది జరగదని మనకెంత నమ్మకమో!! 2012 కూడా వచ్చింది, పోయింది. యుగాంతం ఉత్తదే అని తేలిపోయింది.
డేవిడ్ మీడ్ అనే ఓ క్రిస్టియన్ న్యూమరాలజిస్ట్ అయితే సెప్టెంబర్‡ 23, 2017న యుగాంతం వస్తుందని, నిబిరు అనే ఓ గ్రహం భూమిని ఢీకొనడంతో మొత్తం నాశనం అయిపోతుందని చెప్పుకొచ్చాడు. నాసా అలాంటి ఒక గ్రహమే లేదని కొట్టిపడేసినా ఆయన మాత్రం దీన్నే ప్రచారం చేస్తూ వచ్చాడు. చివరకు ఏమైంది? మళ్లీ తూచ్ యుగాంతం ఉత్తదే అని తేలిపోయింది. సరే, ‘మీ లెక్కలు తారుమారు అయ్యాయేంటీ?’ అని డేవిడ్‌ను కొందరు అడిగితే ఆయన ఏమన్నాడో తెల్సా? ‘అయ్యో! లెక్కల్లో ఎక్కడో తేడా కొట్టిందీ, అక్టోబర్ నెలాఖర్లో యుగాంతం ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇన్నిసార్లు ‘తూచ్.. యుగాంతం’ అనుకుంటూ ఉంటే ఆ భూగోళమే నవ్వుకుంటుందేమో కదా!!
Comments
Please login to add a commentAdd a comment