అమ్మాయికి నెలసరి సరిగా రావడంలేదు | Family health counciling | Sakshi
Sakshi News home page

అమ్మాయికి నెలసరి సరిగా రావడంలేదు

Published Thu, Aug 23 2018 12:35 AM | Last Updated on Thu, Aug 23 2018 12:35 AM

Family health counciling - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్‌ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి.  – పి. అనసూయ, కావలి 
మనలోని హార్మోన్లు అనేక కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్‌ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్‌ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్‌ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్‌ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత  ఉన్న మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేశాక ఆమె సమస్యను నయం చేసేందుకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్‌ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్‌ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. మీరొకసారి మీ అమ్మాయిని అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమె సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,  ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

సెబోరిక్‌ డర్మటైటిస్‌కు చికిత్స  ఉందా?
నా వయసు 46 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్‌ డర్మటైటిస్‌ అని చెప్పారు. మందులు వాడితే సమస్య తగ్గుతోంది, కానీ మళ్లీ కొంతకాలానికే తిరగబెడుతోంది. అసలు సమస్య ఎందుకు వస్తోంది? హోమియోలో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – ఎన్‌. గోపాలరావు, చీరాల 
చర్మంలో సెబేషియస్‌ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడంతో పాటు,  దురదతో ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. సాధారణంగా ఇది దీర్ఘకాలిక సమస్య. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్‌ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. 

కారణాలు : ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్‌ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్‌ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. 
►రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్‌సన్‌ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. 
►మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. 
►వాతావరణం, హార్మోన్‌ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. 

లక్షణాలు : 
►సెబోరిక్‌ డర్మటైటిస్‌ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి.  చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది. 
నిర్ధారణ : వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్‌ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. 
మీరు ఆందోళన చెందకండి. ఆధునిక జెనెటిక్‌ కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందింపజేయడం ద్వారా సెబోరిక్‌ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

స్పాండిలోసిస్‌ తగ్గుతుందా?
నా వయసు 42 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్‌ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?  – ఆర్‌. లక్ష్మణరావు, కరీంనగర్‌ 
ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్‌ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అని, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అని పేర్కొంటారు. 

కారణాలు : 
►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్‌ ఉంటాయి. ఈ జాయింట్స్‌ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు.  జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్‌ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. 

లక్షణాలు : 
►సర్వైకల్‌ స్పాండిలోసిస్‌: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. 
►లంబార్‌ స్పాండిలోసిస్‌: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. 

నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. 

చికిత్స: రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్‌స్టిట్యూషనల్‌ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. 
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement