
బ్రహ్మానందం
తెలుగువారు హాస్యప్రియులు. కాని ప్రస్తుతం భయం భయంగా నవ్వుతున్నారు. జాగ్రత్తగా నవ్వుతున్నారు. తుమ్ము, దగ్గు రాకుండా చూసుకొని మరీ నవ్వుతున్నారు. కరోనా అలా చేసి పెట్టింది. రోజూ తన వార్తలతో తెలియకుండానే వొత్తిడి తెచ్చి పెడుతోంది. ఆ వొత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత కళాకారులది. ధైర్యం చెప్పాల్సిన సందర్భం కళాకారులది. దేశీయంగా, ప్రాంతీయంగా చాలా రంగాలలోని కళాకారులు తమ ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు కమెడియన్లు ఏదైనా కొత్త ఆలోచన చేయాల్సిన సమయం ఇది.భారతదేశంలోని అమితాబ్, చిరంజీవి, రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్లు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశారు
కరోనా ప్రచారం కోసం. ‘ఇంట్లోనే ఉండండి’ అని మెసేజ్ ఇచ్చిన షార్ట్‌ఫిల్మ్ అది. ఆ తర్వాత సంగీతకారులందరూ ‘సంగీత్‌సేతు’ అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేశారు. అందరూ ఇళ్లల్లోనే ఉండి తాము పాడదగ్గ పాటలను ట్రాక్‌లు ప్లే చేస్తూ పాడారు. బాలూ, ఏసుదాస్ దగ్గరి నుంచి కుమార్‌షాను, ఆశా భోంస్లే వరకూ అందరూ ఇందులో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ దీనికి యాంకర్‌గా పని చేశారు. కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో మన బాహుబలిలోని ‘దండాలయ్యా దండాలయ్య’ హిందీ వెర్షన్ పాడారు. బాలూ ‘రోజా’లోని ‘నా చెలి రోజావే’ పాడారు. సురేష్ వాడ్‌కర్ ‘సద్మా’లోని ఇళయరాజా కంపొజిషన్ ‘ఏ జిందగీ గలే లగాలే’ పాడారు. ఏసుదాస్ అదే ‘సద్మా’లోని ‘సుర్‌మయి అఖియోంమే’ పాడారు. కవితా కృష్ణమూర్తి ‘ప్యార్ హువా చుప్‌కేసే’ ఆలపించారు. ఇదంతా వారు చేసింది ఇళ్ల పట్టున ఉండి రకరకాల ఆలోచనలు చుట్టుముట్టిన ప్రజలను ఊరడింప చేయడానికే.ఇదే సందర్భంలో తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులు కూడా కలిసి ఒక షార్ట్‌ఫిల్మ్ చేశారు. ‘స్టేహోమ్’ అనే ఈ షార్ట్‌ఫిల్మ్‌లో ఎస్.పి.బాలుతో సహా సుజిత, జయలలిత, యమున, జాకీ వీరంతా కలిసి నటించారు. ‘పుట్టడానికి తొమ్మిని నెలలు ఓపిక పట్టావ్.. బతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా’ అని ఇంట్లో ఉండమని ఈ షార్ట్‌ఫిల్మ్ మెసేజ్ ఇస్తుంది.
ఇక ర్యాప్‌సాంగ్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నవారు, మిమిక్రీలు చేసి సందేశాలు ఇస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో కామెడీ స్టార్లు కూడా తమ వంతుగా జనం కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని హాస్యప్రియులు ఆశిస్తున్నారు. ఒకరినొకరు కలవకుండా ఇళ్లల్లోనే ఉంటూ ఏదైనా షూట్ చేసి పోస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. నిజానికి అన్ని భాషలలోనే కంటే తెలుగులో హాస్యనటులు ఎక్కువని అందరూ ఆనందపడుతుంటారు. బ్రహ్మానందం, అలీ, రమా ప్రభ, వెన్నెల కిశోర్, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, హేమ, పృథ్వి, సప్తగిరి, రాజేష్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, ధన్‌రాజ్, సత్య, షకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, మహేశ్ విట్టా... ఇలా ఎందరో ఇప్పుడు అందరికి మల్లే లాక్‌డౌన్‌లో ఇళ్లకు పరిమితమయ్యారు. వీరు లాక్ అయినా వీరి ద్వారా కొన్ని నవ్వులు ఔట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, అల్లరి నరేష్, సునీల్ వంటి కామెడీ హీరోస్ కూడా ఏదైనా ఆలోచన చేయవచ్చు. విషాదం కమ్ముకున్న వేళ హాస్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు నవ్వులు ఎన్ని వీలైతే అన్ని పకపకలాడాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment