బుట్ట చేతులు... పొడవు చేతులు... పొట్టి చేతులు...అందమైన పట్టు చీరకు కుచ్చు చేతులు ఇప్పుడు సరిజోడి.
పాశ్చాత్య కుచ్చులు
చీరలో ఉండే అదనపు క్లాత్‌తో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడం అందరూ చేసే పనే. అయితే, ఆ బ్లౌజ్‌కి చేతుల చివరలో కుచ్చులు జత చేస్తే.. అసలైన ఆకర్షణ. ఈ వెస్ట్రన్ స్టైల్ మన సంప్రదాయ వస్త్రధారణలో అందంగా మెరుస్తున్నాయి.
ప్లెయిన్ బ్లౌజ్‌కి కుచ్చుల హంగామా!
చీరకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించుకొని, చీర అంచును జాకెట్ చేతుల చివరలో కుచ్చులుగా అమర్చితే మరింత అకర్షణీయంగా మారడమే కాదు ఆధునికంగానూ కితాబులు అందుకుంటుంది.
పొడవాటి ఇండొ వెస్ట్రన్
సంప్రదాయ జరీ జిలుగుల పట్టు చీరకు ఇండో వెస్ట్రన్ లుక్ తీసుకురావడానికి, అమ్మాయిల మది గెలుచుకోవడానికి అంతటా పోటీ ఉంటోంది. అందుకు బ్లౌజ్ స్లీవ్స్‌కి మోచేతుల వద్ద కుచ్చులు ప్రధాన ఆకర్షణగా మారి ట్రెండ్‌లో నిలిచాయి.
ఫ్యాషన్‌గా ఉండాలంటే ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానించాలి. దాంట్లో పాత కాలం నాటి పోకడలూ తరచూ రిపీట్ అవుతుంటాయి. వాటిలో రఫెల్ అంటే కుచ్చుల డిజైన్ ఒకటి. 18, 19వ శతాబ్దిలో బుట్ట చేతుల జాకెట్లు ఆకట్టుకునేవి. ఆ తర్వాత లెహంగాలు, డ్రెస్సులు కుచ్చులతో మెరిసాయి. చీరలు సైతం అంచుల్లో కుచ్చులతో వెలిగిపోయాయి. ఇప్పుడు ఈ రాయల్ డిజైన్ చీరకట్టు బ్లౌజ్‌లకూ స్టైలిష్‌గా అమరింది. ఇది చాలా సింపుల్ ట్రెండ్‌గా చెప్పుకోవచ్చు. పట్టు చీర అంటే గ్రాండ్‌గా ఉంటుంది. అందుకని ఇంకా గ్రాండ్‌గా ఉండే డిజైన్స్ అక్కర్లేదని చాలా మంది భావన. కానీ, ఇతర అలంకరణలు పెద్దగా అవసరం లేని స్టైల్ కావాలంటే మాత్రం ఇలా కుచ్చుల చేతులున్న బ్లౌజ్‌ను ధరిస్తే చాలు.
Comments
Please login to add a commentAdd a comment