నాన్న
మాధవ్ శింగరాజు
ఇంట్లోకి పాము దూరింది! ‘‘నాన్నా’’ అని భయంతో అరిచారు పిల్లలు. వణికిపోతూ నాన్న మీదికి ఎగబాకారు. పాము పడగెత్తింది. బుసలు కొడుతోంది. నాన్న పాముని చూశాడు. భుజానికి అటొకళ్లు ఇటొకళ్లుగా ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా మంచం మీదికి దింపాడు. కర్ర పట్టుకుని వెళ్లబోయిన భార్యని వారించాడు. ‘‘వద్దొద్దు, అటు వెళ్లకు’’ అన్నాడు. ఇంటికి కష్టం వచ్చినప్పుడు నాన్నకు మిగతా బిడ్డల్లా అమ్మ కూడా ఒక బిడ్డ అవుతుంది. ‘‘ఆ కర్ర ఇటివ్వు’’ అన్నాడు. పాము ఎటువైపు వెళ్లాలా అని చూస్తున్నట్లుగా ఉంది. ‘‘నాన్నా... మా మీదికి వస్తుందా?’’ అన్నారు పిల్లలు మంచం మీదే నిలబడి. ‘‘రానివ్వను’’ అనలేదు నాన్న. ‘‘నాన్నా... అమ్మ మీదికి వెళుతుందా?’’ అన్నారు పిల్లలు. ‘‘వెళ్లనివ్వను’’ అనలేదు నాన్న. నిశ్శబ్దపు ఉరుములా, మెరుపులా వెళ్లి పాముని కొట్టి చంపేశాడు! నాన్నంటే అంతే. తన బిడ్డల జోలికి ఎవర్నీ రానివ్వడు.
ఇంట్లోకి పాము దూరింది. ‘‘నాన్నా’’ అని ఆక్రందన చేస్తున్నట్లుగా అరిచింది ఆ ఇంట్లోని అమ్మాయి. పాము ప్రేమోన్మాద సర్పంలా బుసలు కొడుతోంది. దాని చేతిలో వేట కొడవలి ఉంది. ఆ కొడవలితో అది తన ప్రేమను నిరాకరిస్తున్న ఆ అమ్మాయి మీద దాడి చేసింది. నాన్న ఆ అరుపులు విన్నాడు. ఆ పాముకి ఎదురెళ్లాడు. కొడవలితో బుసకొట్టిందా పాము. ఆ కొడవలి లాక్కుని అక్కడిక్కడే పాముని తెగ నరికి చంపేశాడు నాన్న.
ఆ పాము.. ఎప్పుడో ఏడాది క్రితం నాన్న చూసిన పామే! ‘‘మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యండి’’ అని అడిగిన పామే. ‘‘మేం ఇక్కడివాళ్లం కాదు బాబు. మాకిక్కడ బంధుత్వాలేమీ లేవు. ఎప్పటికీ మేమిక్కడే ఉండిపోము. దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు’’ అని బ్రతిమాలితే అప్పటికి వెళ్లిపోయిన పామే. ‘‘ఇంకా వేధిస్తూనే ఉన్నాడు నాన్నా’’ అని తన బిడ్డ నిత్యం కన్నీళ్లు పెట్టుకుని ఎవరి గురించైతే చెబుతుంటుందో ఆ పామే.
పోలీసులొచ్చారు. ‘‘నేనే చంపాను’’ అన్నాడు నాన్న. బిడ్డను రక్షించుకోడానికి చంపిన నాన్న... ‘‘ఆత్మరక్షణ కోసం చంపాను’’ అని చెప్పాడు. నాన్న నిజమే చెప్పాడు. నాన్న ఆత్మ... బిడ్డే కదా! నాన్న ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేశాడు. మూడో బిడ్డకు పెళ్లి కుదుర్చుకుని వచ్చాడు. అంతలోనే నేరస్థుడయ్యాడు. ఆడపిల్లను కనడమే నేరమైతే నేను నేరస్థుడినే. ఆడపిల్లను కాపాడుకోవడమే నేరమైతే నేను నేరస్థుడినే అంటున్నాడు.
తర్వాతేంటి? ఏం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. నాన్న ఆల్రెడీ తన పని తను చేసుకుపోయాడు. నాన్నంటే అంతే. తన బిడ్డల జోలికి ఎవర్నీ రానివ్వడు. ఎవరైనా వస్తే ఊరుకోడు.