Protector
-
బీచ్‌లకు రక్షకురాలిగా 96 ఏళ్ల బామ్మ!
చెన్నైలోని బీచ్‌లను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయాలంటే అందరికీ భయం. దానికి కారణం కామాక్షి సుబ్రమణియన్. బీచ్‌లకు రక్షకురాలిగా ‘అమ్మమ్మ’గా అందరూ పిలుచుకునే కామాక్షి గత 40 ఏళ్లుగా చెన్నైలోని బీచ్‌లను కాపాడుతోంది. ఈ పనికి అందరూ పెట్టిన పేరు ‘మిషన్ కామాక్షి’. 1930లో మద్రాసులో ఒక ఘటన జరిగింది. అక్కడి బెసెంట్ నగర్ బీచ్ (ఎలియెట్స్ బీచ్)లో ఒక బ్రిటిష్ అమ్మాయి స్నానం చేస్తూ మునిగిపోబోయింది. ఒడ్డున ఉన్న కాజ్ ష్మిడ్ అనే డెన్మార్క్ నావికుడు అది గమనించాడు. వెంటనే సముద్రంలోకి పరిగెత్తి ఆ అమ్మాయిని కాపాడబోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండింది. అమ్మాయిని ఒడ్డుకు తోసేశాడు. తాను మాత్రం సముద్రంలో మునిగిపోయాడు. అమ్మాయి ఆ సంగతి గురించి కిక్కురుమనకుండా సాయంత్రం జరిగిన పార్టీకి హాజరైంది. కాని నాటి గవర్నర్‌కు ఎలాగో సంగతి తెలిసింది. ఆయన ఆగ్రహంతో ఆ అమ్మాయి మీద కేకలేసి కాజ్ ష్మిడ్ సాహసానికి గుర్తుగా ష్మిడ్ మెమోరియల్ కట్టించాడు. చాలా తమిళ సినిమాల్లో ఈ మెమోరియల్ కనిపిస్తుంది. అయితే ఇది అనేక ఏళ్లపాటు శిథిలావస్థలో ఉండింది. కార్పొరేషన్ వారిని వేధించి, వెంటబడి దానిని పునరుద్ధరించిన వ్యక్తి కామాక్షి సుబ్రమణియన్. ఇవాళ ష్మిడ్ మెమోరియల్ ఎంతో చక్కగా పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఏ సాయంత్రం బీచ్‌కు వెళ్లినా ఆ చుట్టుపక్కల నవ్వుతూ కామాక్షి సుబ్రమణియన్ కనిపిస్తుంది. బీచ్ ఒడ్డు మనిషి కామాక్షి సుబ్రమణియన్ బెసెంట్ నగర్లో పుట్టి పెరిగింది. బెసెంట్ నగర్ అడయార్ పక్కనే ఉంటుంది. పెళ్లయ్యాక భర్తతో 1980 వరకూ ఢిల్లీలో ఉండిపోయింది కామాక్షి. భర్త రాష్ట్రపతి భవన్లో కార్యదర్శిగా పని చేసేవాడు. ‘ఆ సమయంలో నా భర్త వల్ల బ్యూరోక్రసిలో ఎలాంటి అలక్ష్యం జరుగుతుందో, తెలిసీ తెలియక ఎన్ని మతలబులు చోటు చేసుకుంటాయో తెలుసుకున్నాను’ అంటుంది కామాక్షి. భర్త రిటైర్ అయ్యాక చక్కా వచ్చి బెసెంట్ నగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్న కామాక్షి ఆ రోజుల్లో దట్టంగా ఉన్న చెట్లను కొందరు వంట చెరుకు కోసం కొట్టడం బాల్కనీలో నుంచి గమనించేది. ఆ చెట్లు కొట్టేస్తే నీడ ఏం కాను? అందుకని వారు రావడంతోటే పెద్దగా అరుస్తూ తరిమి కొట్టేది. ‘అలా నా పౌర సేవ మొదలైంది’ అని గుర్తు చేసుకుంది కామాక్షి. ఆమెకు రోజూ బీచ్‌కు వెళ్లడం అలవాటు అలా బీచ్ మీద ప్రేమ ఏర్పడింది. 96 ఏళ్ల వయసులో ‘నగర పౌరులకు హక్కులుంటాయి. పబ్లిక్ స్థలాలు వారి ఆహ్లాదం కోసం. పార్కులు వారికి కావాలి. పేవ్మెంట్లు కావాలి. బీచ్ శుభ్రంగా ఉండాలి. వాటి కోసం నేను పోరాటం చేస్తాను’ అంటుంది కామాక్షి. ఆ మధ్య జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 174 వ వార్డులో ఇండిపెండెంట్‌గా నిలుచుంది కామాక్షి. పత్రికలు ఆమె గురించి విస్తృతంగా రాశాయి. ‘పార్టీ జెండా కింద నిలబడితే పార్టీ పనులన్నీ సమర్థించాలి. నేను అలా చేయలేను’ అందామె. అందుకే ఓడిపోయింది కూడా. కాని నేటికీ ఆమె పౌరుల హక్కుల కోసం పని చేస్తూనే ఉంది. ‘బెసెంట్ నగర్ బీచ్ దగ్గర వాకింగ్ ట్రాక్‌ను అడ్డుకుంటూ పబ్లిక్ టాయిలెట్లు కడుతున్నారు. దానిని అడ్డుకోవడానికి ధర్నా చేస్తున్నాను’ అని ధర్నాకు కూచుందామె. కార్పొరేషన్ అధికారులకు ఆమెను చూస్తే భయం. ఎవరో ఒకరు భయపెట్టకపోతే పనులెలా జరుగుతాయి? 96 ఏళ్లలో కామాక్షి అన్ని పనులు చేస్తుంటే మనం ఎన్ని పనులు చేయాలి? (చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!) -
మంత్రి మాటలు.. ‘నీటి’మూటలు
బోర్లలో నీరు రాక ఎండుతున్న ఉద్యాన పంటలు రూ.వందల కోట్ల నష్టం అన్ని పంటలను కాపాడతామని మంత్రి సోమిరెడ్డి హామీ చీనీ, మామిడికి మాత్రమే మొక్కుబడిగా రక్షకతడులు మిగతా వాటిని పట్టించుకోని వైనం అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా అన్ని రకాల పండ్లతోటలను కాపాడతామని మంత్రి హామీ ఇవ్వగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న జిల్లా పర్యటనకు వచ్చిన సోమిరెడ్డి అనంతపురం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, బుక్కపట్నం తదితర మండలాల్లో బోరుబావుల్లో నీళ్లు రాక ఎండుముఖం పట్టిన చీనీ, మామిడి, ద్రాక్ష తదితర పండ్లతోటలను పరిశీలించారు. ఎంత ఖర్చయినా వెనకాడేది లేదు.. రక్షకతడులు ఇచ్చి తోటలన్నీ కాపాడతామని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లా పర్యటన ముగించుకుని అమరావతి వెళ్లగానే ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. చీనీ, మామిడి తోటలకు మాత్రమే రక్షకతడి ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. అవి కూడా మండు వేసవి ముగిసే సమయంలో ఇవ్వడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎత్తిపెట్టిన బోర్లు.. ఎండిన తోటలు జూలై, 2016 తర్వాత జిల్లాలో సరైన వర్షం పడకపోవడంతో భూగర్భజలాలు సగటున 26 మీటర్ల లోతుకు పడిపోయాయి. బోర్ల నుంచి గుక్కెడు నీరు రావడం గగనంగా మారింది. జిల్లాలో దాదాపు 2.50 లక్షల బోరుబావులు ఉండగా, 90 వేల వరకు ఎత్తిపోయినట్లు అంచనా. రూ.లక్షలు వెచ్చించి పెంచిన పండ్లతోటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. భగీరథ ప్రయత్నమే చేస్తున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పది ఎకరాల తోటలున్న రైతులు ఐదు ఎకరాలు వదిలేసి..మిగిలిన తోటను కాపాడుకునే యత్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు ట్యాంకర్లను కొనుగోలు చేసి అరకొరగా నీటిని సరఫరా చేసుకుంటున్నారు. విపత్తు సంభవిస్తుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో దారుణంగా విఫలమయ్యాయి. ఫలితంగా రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఒక అంచనా ప్రకారం నీటి ఎద్దడితో పాటు ధరలు లేక ఈ సీజన్లో చీనీ, మామిడి, దానిమ్మ, అరటి, బొప్పాయి, కర్బూజా, కళింగర తదితర రైతులకు రూ.800 కోట్ల వరకు నష్టం జరిగింది. ఎటు చూసినా క్షామమే.. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో 1.71 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పండ్లతోటలు ఉన్నాయి. అత్యధికంగా చీనీ 45 వేల హెక్టార్లు, మామిడి 44 వేల హెక్టార్లు, అరటి 12 వేల హెక్టార్లు, దానిమ్మ 7 వేల హెక్టార్లు, సపోటా 5 వేల హెక్టార్లు, కర్భూజా, కళింగర పంటలు 10 వేల హెక్టార్లు, ఇవి కాకుండా ద్రాక్ష, జామ, అంజూర, బొప్పాయి, కూరగాయలు, పూలు, ఔషధ పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. భూగర్భజలాలు అటుగంటిపోవడంతో తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, కూడేరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ముదిగుబ్బ, అనంతపురం, పుట్లూరు, యల్లనూరు, గార్లదిన్నె, నార్పల, కనగానపల్లి, బత్తలపల్లి, తాడిమర్రి, బుక్కపట్నం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, రాయదుర్గం, పామిడి, పెద్దపప్పూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లతోటలు ఎండిపోయాయి. ఏళ్ల తరబడి పెంచిన దానిమ్మ, ద్రాక్ష, అంజూర లాంటి తోటలు ఎండిపోవడంతో రైతుల ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. మొక్కుబడిగా రక్షకతడి 15 వేల ఎకరాల చీనీ, 5 వేల ఎకరాల మామిడికి రక్షకతడి ఇవ్వడానికి రూ.32 కోట్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కూడా అస్తవ్యస్తంగా తయారు కావడంతో రాయితీ సొమ్ము వస్తుందా, రాదా అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యానశాఖ అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో రక్షకతడి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటివరకు 1,600 హెక్టార్ల చీనీ, 1,200 హెక్టార్ల మామిడి తోటలకు మాత్రమే ఒక రక్షకతడి ఇచ్చినట్లు సమాచారం. రైతులే స్వయంగా నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలని మెలికపెట్టడంతో అందుబాటులో ట్యాంకర్లు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల పండ్లతోటలకు రక్షకతడి ఇవ్వాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాము కూడా ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. -
నాన్న
మాధవ్ శింగరాజు ఇంట్లోకి పాము దూరింది! ‘‘నాన్నా’’ అని భయంతో అరిచారు పిల్లలు. వణికిపోతూ నాన్న మీదికి ఎగబాకారు. పాము పడగెత్తింది. బుసలు కొడుతోంది. నాన్న పాముని చూశాడు. భుజానికి అటొకళ్లు ఇటొకళ్లుగా ఉన్న పిల్లల్ని జాగ్రత్తగా మంచం మీదికి దింపాడు. కర్ర పట్టుకుని వెళ్లబోయిన భార్యని వారించాడు. ‘‘వద్దొద్దు, అటు వెళ్లకు’’ అన్నాడు. ఇంటికి కష్టం వచ్చినప్పుడు నాన్నకు మిగతా బిడ్డల్లా అమ్మ కూడా ఒక బిడ్డ అవుతుంది. ‘‘ఆ కర్ర ఇటివ్వు’’ అన్నాడు. పాము ఎటువైపు వెళ్లాలా అని చూస్తున్నట్లుగా ఉంది. ‘‘నాన్నా... మా మీదికి వస్తుందా?’’ అన్నారు పిల్లలు మంచం మీదే నిలబడి. ‘‘రానివ్వను’’ అనలేదు నాన్న. ‘‘నాన్నా... అమ్మ మీదికి వెళుతుందా?’’ అన్నారు పిల్లలు. ‘‘వెళ్లనివ్వను’’ అనలేదు నాన్న. నిశ్శబ్దపు ఉరుములా, మెరుపులా వెళ్లి పాముని కొట్టి చంపేశాడు! నాన్నంటే అంతే. తన బిడ్డల జోలికి ఎవర్నీ రానివ్వడు. ఇంట్లోకి పాము దూరింది. ‘‘నాన్నా’’ అని ఆక్రందన చేస్తున్నట్లుగా అరిచింది ఆ ఇంట్లోని అమ్మాయి. పాము ప్రేమోన్మాద సర్పంలా బుసలు కొడుతోంది. దాని చేతిలో వేట కొడవలి ఉంది. ఆ కొడవలితో అది తన ప్రేమను నిరాకరిస్తున్న ఆ అమ్మాయి మీద దాడి చేసింది. నాన్న ఆ అరుపులు విన్నాడు. ఆ పాముకి ఎదురెళ్లాడు. కొడవలితో బుసకొట్టిందా పాము. ఆ కొడవలి లాక్కుని అక్కడిక్కడే పాముని తెగ నరికి చంపేశాడు నాన్న. ఆ పాము.. ఎప్పుడో ఏడాది క్రితం నాన్న చూసిన పామే! ‘‘మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యండి’’ అని అడిగిన పామే. ‘‘మేం ఇక్కడివాళ్లం కాదు బాబు. మాకిక్కడ బంధుత్వాలేమీ లేవు. ఎప్పటికీ మేమిక్కడే ఉండిపోము. దయచేసి మమ్మల్ని వదిలేయండి బాబు’’ అని బ్రతిమాలితే అప్పటికి వెళ్లిపోయిన పామే. ‘‘ఇంకా వేధిస్తూనే ఉన్నాడు నాన్నా’’ అని తన బిడ్డ నిత్యం కన్నీళ్లు పెట్టుకుని ఎవరి గురించైతే చెబుతుంటుందో ఆ పామే. పోలీసులొచ్చారు. ‘‘నేనే చంపాను’’ అన్నాడు నాన్న. బిడ్డను రక్షించుకోడానికి చంపిన నాన్న... ‘‘ఆత్మరక్షణ కోసం చంపాను’’ అని చెప్పాడు. నాన్న నిజమే చెప్పాడు. నాన్న ఆత్మ... బిడ్డే కదా! నాన్న ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేశాడు. మూడో బిడ్డకు పెళ్లి కుదుర్చుకుని వచ్చాడు. అంతలోనే నేరస్థుడయ్యాడు. ఆడపిల్లను కనడమే నేరమైతే నేను నేరస్థుడినే. ఆడపిల్లను కాపాడుకోవడమే నేరమైతే నేను నేరస్థుడినే అంటున్నాడు. తర్వాతేంటి? ఏం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. నాన్న ఆల్రెడీ తన పని తను చేసుకుపోయాడు. నాన్నంటే అంతే. తన బిడ్డల జోలికి ఎవర్నీ రానివ్వడు. ఎవరైనా వస్తే ఊరుకోడు.