చెన్నైలోని బీచ్‌లను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయాలంటే అందరికీ భయం. దానికి కారణం కామాక్షి సుబ్రమణియన్. బీచ్‌లకు రక్షకురాలిగా ‘అమ్మమ్మ’గా అందరూ పిలుచుకునే కామాక్షి గత 40 ఏళ్లుగా చెన్నైలోని బీచ్‌లను కాపాడుతోంది. ఈ పనికి అందరూ పెట్టిన పేరు ‘మిషన్ కామాక్షి’.
1930లో మద్రాసులో ఒక ఘటన జరిగింది.
అక్కడి బెసెంట్ నగర్ బీచ్ (ఎలియెట్స్ బీచ్)లో ఒక బ్రిటిష్ అమ్మాయి స్నానం చేస్తూ మునిగిపోబోయింది. ఒడ్డున ఉన్న కాజ్ ష్మిడ్ అనే డెన్మార్క్ నావికుడు అది గమనించాడు. వెంటనే సముద్రంలోకి పరిగెత్తి ఆ అమ్మాయిని కాపాడబోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండింది. అమ్మాయిని ఒడ్డుకు తోసేశాడు. తాను మాత్రం సముద్రంలో మునిగిపోయాడు. అమ్మాయి ఆ సంగతి గురించి కిక్కురుమనకుండా సాయంత్రం జరిగిన పార్టీకి హాజరైంది. కాని నాటి గవర్నర్‌కు ఎలాగో సంగతి తెలిసింది. ఆయన ఆగ్రహంతో ఆ అమ్మాయి మీద కేకలేసి కాజ్ ష్మిడ్ సాహసానికి గుర్తుగా ష్మిడ్ మెమోరియల్ కట్టించాడు. చాలా తమిళ సినిమాల్లో ఈ మెమోరియల్ కనిపిస్తుంది. అయితే ఇది అనేక ఏళ్లపాటు శిథిలావస్థలో ఉండింది. కార్పొరేషన్ వారిని వేధించి, వెంటబడి దానిని పునరుద్ధరించిన వ్యక్తి కామాక్షి సుబ్రమణియన్. ఇవాళ ష్మిడ్ మెమోరియల్ ఎంతో చక్కగా పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంది. ఏ సాయంత్రం బీచ్‌కు వెళ్లినా ఆ చుట్టుపక్కల నవ్వుతూ కామాక్షి సుబ్రమణియన్ కనిపిస్తుంది.
బీచ్ ఒడ్డు మనిషి
కామాక్షి సుబ్రమణియన్ బెసెంట్ నగర్‌లో పుట్టి పెరిగింది. బెసెంట్ నగర్ అడయార్ పక్కనే ఉంటుంది. పెళ్లయ్యాక భర్తతో 1980 వరకూ ఢిల్లీలో ఉండిపోయింది కామాక్షి. భర్త రాష్ట్రపతి భవన్‌లో కార్యదర్శిగా పని చేసేవాడు. ‘ఆ సమయంలో నా భర్త వల్ల బ్యూరోక్రసిలో ఎలాంటి అలక్ష్యం జరుగుతుందో, తెలిసీ తెలియక ఎన్ని మతలబులు చోటు చేసుకుంటాయో తెలుసుకున్నాను’ అంటుంది కామాక్షి. భర్త రిటైర్ అయ్యాక చక్కా వచ్చి బెసెంట్ నగర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్న కామాక్షి ఆ రోజుల్లో దట్టంగా ఉన్న చెట్లను కొందరు వంట చెరుకు కోసం కొట్టడం బాల్కనీలో నుంచి గమనించేది. ఆ చెట్లు కొట్టేస్తే నీడ ఏం కాను? అందుకని వారు రావడంతోటే పెద్దగా అరుస్తూ తరిమి కొట్టేది. ‘అలా నా పౌర సేవ మొదలైంది’ అని గుర్తు చేసుకుంది కామాక్షి. ఆమెకు రోజూ బీచ్‌కు వెళ్లడం అలవాటు అలా బీచ్ మీద ప్రేమ ఏర్పడింది.
96 ఏళ్ల వయసులో
‘నగర పౌరులకు హక్కులుంటాయి. పబ్లిక్ స్థలాలు వారి ఆహ్లాదం కోసం. పార్కులు వారికి కావాలి. పేవ్‌మెంట్‌లు కావాలి. బీచ్ శుభ్రంగా ఉండాలి. వాటి కోసం నేను పోరాటం చేస్తాను’ అంటుంది కామాక్షి. ఆ మధ్య జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 174 వ వార్డులో ఇండిపెండెంట్‌గా నిలుచుంది కామాక్షి. పత్రికలు ఆమె గురించి విస్తృతంగా రాశాయి. ‘పార్టీ జెండా కింద నిలబడితే పార్టీ పనులన్నీ సమర్థించాలి. నేను అలా చేయలేను’ అందామె. అందుకే ఓడిపోయింది కూడా. కాని నేటికీ ఆమె పౌరుల హక్కుల కోసం పని చేస్తూనే ఉంది. ‘బెసెంట్ నగర్ బీచ్ దగ్గర వాకింగ్ ట్రాక్‌ను అడ్డుకుంటూ పబ్లిక్ టాయిలెట్లు కడుతున్నారు. దానిని అడ్డుకోవడానికి ధర్నా చేస్తున్నాను’ అని ధర్నాకు కూచుందామె. కార్పొరేషన్ అధికారులకు ఆమెను చూస్తే భయం. ఎవరో ఒకరు భయపెట్టకపోతే పనులెలా జరుగుతాయి? 96 ఏళ్లలో కామాక్షి అన్ని పనులు చేస్తుంటే మనం ఎన్ని పనులు చేయాలి?
(చదవండి: సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!)
Comments
Please login to add a commentAdd a comment