అక్కా చెల్లెళ్లకు నిర్వాహకుల వివాహం
ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక
అనాథలకు అమ్మా నాన్నలై.. వివాహం.
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది.
అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు.
రంజిత్‌రెడ్డి–విజేత, సురేష్‌రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్‌ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment