శిరోజాల దాతలతో ప్రియానాయక్
అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం...ఇలా మన సంస్కృతిలో దానగుణానికి విశేష గౌరవం ఉంది.అయితే భువనేశ్వర్‌కు చెందిన హరిప్రియ నాయక్ ప్రచారం చేసేది మాత్రం ‘శిరోజాల దానం’. ‘మీరు దానం చేసే శిరోజాల పేద కేన్సర్ పేషెంట్ల ముఖంలో చిరునవ్వు తీసుకొస్తుంది’ అంటుందామె. సేకరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయించి పంచుతున్న హరిప్రియ నాయక్ అనేక ప్రశంసలు పొందుతోంది.
కేన్సర్‌తో పోరాడి గెలవ డానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. చాలామంది గెలుస్తారు. అయితే దిగువ మధ్యతరగతి స్త్రీలు, పేద స్త్రీలు ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కేన్సర్ చికిత్స సమయంలో కిమోథెరపీ వల్ల జుట్టు రాలిపో తుంది. ఆ సమయంలో శిరోముండనం కూడా చేయించుకోవాల్సి వస్తుంది. స్తోమత కలిగిన వర్గాల స్త్రీలు తిరిగి పూర్తి జుట్టు వచ్చేవరకూ విగ్గులు ధరిస్తారు. కాని పేద వర్గాల స్త్రీలకు ఆ అవకాశం ఉండదు. వారి కోసం, వారి ఆత్మవిశ్వాసం కోసం ఉచితంగా విగ్గులు ఏర్పాటు చేస్తోంది హరిప్రియ నాయక్. ‘శిరోజాల దానం ఇవాళ్టి అవసరం’ అంటుందామె.
సామాజిక సేవ
ఒడిశ్సాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 32 ఏళ్ల హరిప్రియ నాయక్ సామాజిక సేవారంగంలో పని చేస్తోంది. ‘ఒకసారి నేను కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయిన పేదస్త్రీలను చూశాను. వారు ఇంటినుంచి బయటకు రావడానికే సిగ్గుపడుతున్నారు. కేన్సర్‌తో పో రాడే సమయంలో మానసికంగా, శారీరకంగా గట్టిగా ఉండాలి. మానసికంగా కుచించుకుపో తే కష్టం. స్త్రీలు జుట్టును ఇష్టపడతారు. వారికి సరైన విగ్గు ఇవ్వగలిగితే ఆత్మవిశ్వాసం వస్తుందని పనిలోకి దిగాను’ అంటుంది హరిప్రియ నాయక్. ఆమె 2021లో ‘మిషన్ స్మైల్ ఫర్ ది కేన్సర్ ఫైటర్స్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని శిరోజాల సేకరణ కోసం మొదలుపెట్టింది. శిరోజాల దానం కోసం ప్రచారం కొనసాగించింది.
9 మంది సాయం ఒకరికి మేలు
‘సింథటిక్ విగ్గులు త్వరగా పాడవుతాయి. వాటివల్ల చర్మ సంబంధ ఇబ్బందులు వస్తాయి. అదే సహజమైన జుట్టుతో చేసిన విగ్గులు మన్నికగా ఉంటాయి. ఇందుకోసం ఎవరైనా సరే శిరోజాలు ఇవ్వొచ్చు. కాని 12 అంగుళాల కంటే ఎక్కువ పోడవు ఉన్నప్పుడే అవి ఉపయోగపడతాయి. 9 మంది ఇచ్చిన జుట్టుతో ఒక్క విగ్గు తయారవుతుంది. మా ప్రచారం ఒడిస్సాలో మాత్రమే కాదు జార్ఖండ్‌లో కూడా కొనసాగుతోంది. ఒక ఆరేళ్ల పాప మాకు శిరోజాలు ఇవ్వడం ఒక రికార్డు’ అంటుంది హరిప్రియ నాయక్.
హెయిర్ డొనేషన్ ఒడిశా
‘హెయిర్ డొనేషన్ ఒడిశా’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది హరిప్రియ నాయక్. వాలెంటీర్లు పని చేసేవారిని ఆహ్వానిస్తుంది. ఇప్పటికి 150 మంది వాలెంటీర్లు ఆమెతోపాటు పని చేస్తున్నారు. శిరోజాలు దానం చేసే వారి నుంచి వాటిని సేకరించి హైదరాబాదులోని ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ కేన్సర్ పేషెంట్స్’ సంస్థకు పంపుతారు. అది ఉచితంగా విగ్గులు తయారు చేసి ఇస్తుంది. వాటిని కేన్సర్ ఫైటర్స్‌కు అందజేస్తారు.‘నా జుట్టు తగినంత పెరిగిన ప్రతిసారీ నేను దానం చేస్తుంటాను. మీరు కూడా చేయండి. ఇది కూడా పుణ్యకార్యమే’ అంటుంది హరిప్రియ నాయక్.
Comments
Please login to add a commentAdd a comment