పాపకు పదే పదే జ్వరం... ఏం చేయాలి?
మా పాపకు రెండు నెలలు. పుట్టినప్పటి నుంచి తరచూ జ్వరం వస్తూనే ఉంది. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతున్నాయి. దగ్గు, ఇతరత్రా సమస్యలేమీ లేవు. బరువు పెరిగినప్పటికీ అంత ఆరోగ్యంగా అనిపించడం లేదు. మందులు వాడుతున్నప్పుడు తగ్గినట్లే తగ్గి మళ్లీ జ్వరం వస్తోంది. మా పాపకు ఉన్న సమస్యకు పరిష్కారం చెప్పండి.
- శైలజ, నూజివీడు
మీరు చెప్పిన లక్షణాలు... మరీ ముఖ్యంగా పదే పదే జ్వరం రావడం అనేది ఏ వయసు పిల్లలకు అయినప్పటికీ కాస్త తీవ్రంగానే పరిగణించాల్సిన అంశం. ఏ వయసు పిల్లల్లోనైనా జ్వరానికి ముఖ్యకారణం ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్ అన్నది ఏ అవయవంలో వచ్చిందో దాన్ని బట్టి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. ఆ లక్షణాలను బట్టే అది ఎలాంటి ఇన్ఫెక్షన్, దాని ప్రభావం ఏమిటి, దాని తీవ్రత ఎంత అన్న అంశాలను ఆలోచించి, చికిత్స చేయడం జరుగుతుంది.
అలాగే కొన్నిసార్లు ఇతర కారణాలు... ముఖ్యంగా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్, కొన్ని మెటబాలిక్ డిసీజెస్, ఇమ్యూనో డెఫిషియెన్సీస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం, దాని ప్రభావంతో జ్వరం రావడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల వల్ల... ముఖ్యంగా డీహైడ్రేషన్ ఫీవర్స్‌ను నెలల పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం.
అయితే పైన పేర్కొన్న కొన్ని అరుదైన సందర్భాల (రేర్ కండిషన్స్)లో జ్వరంతో పాటు ఇతర సూచనలు కూడా... అంటే ముఖ్యంగా చర్మంలో మార్పులు, ఊపిరి తీసుకోవడంలో తేడాలు, ప్రవర్తనపరమైన మార్పుల వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. మీ పాప విషయంలో పైన పేర్కొన్న అలాంటి తీవ్రమైన లక్షణాలేవీ లేవు కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక ఇలాంటి పిల్లల్లో చాలావరకు మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) అన్నది జ్వరానికి కారణం అవుతుంది. అందుకే మీ పాప విషయంలోనూ మొట్టమొదట యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అన్న విషయాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకోవడం ముఖ్యం.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేని సందర్భాల్లో మాత్రమే ఇతర సీరియస్ కండిషన్స్ గురించి ఆలోచించవచ్చు. అవసరమైతే వేరే ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవని రూల్ అవుట్ చేసుకోడానికి రక్తపరీక్ష, బ్లడ్ కల్చర్ పరీక్ష, సోనోగ్రామ్ ఎగ్జామినేషన్స్ వంటివి చేయించాల్సి రావచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఎస్సే పరీక్షతో పాటు హార్మోనల్ ఎస్సే పరీక్ష కూడా చేయించాల్సి ఉంటుంది. మీ పాపకు పెరుగుదలలో ఎలాంటి సమస్యా లేదు కాబట్టి ఆమె విషయంలో మొట్టమొదట అనుమానించాల్సింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను మాత్రమే. కాబట్టి అది ఉందేమోనని తొలుత పరీక్షించాలి. ఒకవేళ అది లేదని రూల్ ఔట్ చేస్తే అప్పుడు ఇతరత్రా సమస్యల గురించి ఆలోచించవచ్చు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు మరోసారి మీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ను సంప్రదించి తగు చికిత్స తీసుకోండి.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
పీడియాట్రీషియన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్