నవయువం : చిట్టచివరికి, ఎట్టకేలకు ‘క్లిక్’ అయ్యాడు! | finally clicked as entrepreneur | Sakshi
Sakshi News home page

నవయువం : చిట్టచివరికి, ఎట్టకేలకు ‘క్లిక్’ అయ్యాడు!

Published Wed, Dec 11 2013 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

నవయువం :   చిట్టచివరికి, ఎట్టకేలకు ‘క్లిక్’ అయ్యాడు!

నవయువం : చిట్టచివరికి, ఎట్టకేలకు ‘క్లిక్’ అయ్యాడు!

   2013లో క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సందీప్ గెలుచుకొన్నాడు.
     ‘బిజినెస్ వరల్డ్’ మ్యాగజీన్ నుంచి ‘మోస్ట్ ప్రామిసింగ్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డును అందుకొన్నాడు.
 
     స్టార్ యూత్ అచీవర్ అవార్డు, బ్రిటిష్ కౌన్సిల్ నుంచి యంగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డులు వచ్చాయి.
     ‘ఇటీ నౌ’ నుంచి పయోనీర్ ఆఫ్ టుమారో అవార్డును అందుకొన్నాడు.
     {పముఖ మ్యాగజీన్‌లకు ఫీచర్ ఆర్టికల్స్ రాస్తుంటాడు.
 
 సగటు యువత తమ జీవితంలో అతి పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పుకునే ‘పరాజయాలు’ అతడి జీవితంలో లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే ‘అపజయాలే విజయానికి మెట్లు’ అనే నమ్మకాన్ని తారక మంత్రంగా చేసుకొని ముందుకు సాగాడు. కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక సాధారణ కెమెరాతో ప్రస్థానం మొదలుపెట్టి అనితర సాధ్యమైన విజయాలు సాధించి, స్ఫూర్తిప్రదాతగా మారాడు. స్ఫూర్తిమంతమైన ప్రసంగాలు చేసే వక్త అయ్యాడు. అతడే సందీప్ పరమేశ్వరి.  
 
 ఇరవై ఏడేళ్ల ఈ ఢిల్లీ యువకుడి విజయ ప్రస్థానం పన్నెండు వేల రూపాయల విలువచేసే ఒక కెమెరాతో మొదలైంది. పదమూడేళ్ల నుంచే వ్యాపార రంగంలో అనుభవం ఉంది! తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో పదిహేనేళ్ల వయసులోనే సొంతంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు సందీప్. ఎలాగంటే...
 ఇంటి దగ్గర ఉన్న రెండు టూ వీలర్స్‌ను అద్దెకు ఇచ్చేవాడు సందీప్. అలా ఢిల్లీవీధుల్లో అమ్మాయిలతో బైక్‌పై తిరగాలని తపించే యువకులకు సందీప్ ఆపద్బాంధవుడు అయ్యాడు. పెట్రోల్ వారిదే. గంటకు యాభై రూపాయలు అద్దె. ఇలా సంపాదన మొదలు పెట్టిన సందీప్‌కు కొన్నిరోజుల్లోనే చదువు మీద ఆసక్తి తగ్గిపోయింది. చిన్న వయసులోనే కొంతమంది స్నేహితులతో కలిసి ఒక వ్యాపారం మొదలు పెట్టాడు. అయితే అది ఆరు నెలలకే మూత పడింది. తనతో పాటు పెట్టుబడి పెట్టిన స్నేహితులకు కూడా బంధువులందరిలోనూ చెడ్డపేరు వచ్చింది. ఎన్నో ఆశలతో, ఆశయాలతో మొదలు పెట్టిన వ్యాపారం దెబ్బతినడం, ఇదే సమయంలో ఇంట్లో ఆర్థికపరమైన కష్టాలు మొదలు కావడంతో ఏదైనా ఉపాధి మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో సందీప్‌కు ఫోటోగ్రఫీపై ఉన్న ఆసక్తి ఒక ఉద్యోగాన్ని సంపాదించిపెట్టింది. మోడలింగ్ ఏజెన్సీలో కెమెరామెన్‌గా జాయిన్ అయ్యాడు.
 
 లిమ్కా బుక్‌లోకి ఎక్కాడు!
 జీవితంలో అంతవరకూ ఎదురైన అనుభవాలను బట్టి ... ఎంచుకొన్న పని ఏదైనా సరే... దాంట్లో అంకిత భావాన్ని చూపాలనే పాఠాన్ని నేర్చుకొన్నాడు సందీప్. మోడలింగ్ ఫొటోగ్రాఫర్‌గా చేరిన కొన్ని రోజుల్లోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడంటే అతని తపన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదిగంటలా నలభై అయిదు నిమిషాల వ్యవధిలో నూట ఇరవై రెండు మంది మోడల్స్‌కు పదివేల షాట్స్ తీయడం ద్వారా ఇతడు లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించాడు.
 
 కెరీర్ మార్చుకున్నాడు!
 లిమ్కా రికార్డ్‌తో మోడలింగ్ ప్రపంచంలో సందీప్‌కు మంచి పేరు వచ్చింది. అయితే అలాగని అక్కడే సెటిలైపోదామని అనుకోలేదు. వేరే వ్యాపారం చేయాలనే ఆలోచన  కొత్త మార్గాలను చూపింది. తాను సృజనాత్మకతతో తీసిన ఫొటోలపై తన హక్కులను ఉపయోగించుకుంటూ చేసిన ప్రయత్నం అతడిని పెద్ద వ్యాపారవేత్తను చేసింది. ‘ఇమేజ్ బజార్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో తను తీసిన ఫొటోలను అప్‌లోడ్ చేయసాగాడు. అతి తక్కువ రోజుల్లోనే లెక్కకు మించి ‘ఇండియన్ ఫేసెస్’ను కలిగి ఉన్న వెబ్‌సైట్‌గా ‘ఇమేజ్ బజార్’కు పేరొచ్చింది. అనేక వార్తాసంస్థలు ఇమేజెస్ కోసం సందీప్‌ను సంప్రదించడం మొదలుపెట్టాయి. ఈ ఫోటోల బిజినెస్ అతి తక్కువ సమయంలోనే సందీప్‌ను కోటీశ్వరుడిని చేసింది. ‘ఇమేజ్ బజార్’కు వెబ్ ఫ్లోటింగ్ పెరిగింది. ఏకంగా నలభై అయిదు సంస్థలు ఫొటోల విషయంలో ఈ సైట్‌తో ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఇరవెరైండేళ్ల  వయసులోనే ఈ వెబ్‌సైట్‌ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని పొందాడు. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్ టర్నోవర్ పది హేను కోట్ల రూపాయల వరకూ ఉంది.
 
 ప్రసంగాలతో స్ఫూర్తిని పంచుతున్నాడు!
 ప్రస్తుతం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయగల వక్తగా కూడా సందీప్‌కు మంచి గుర్తింపు ఉంది. అనేక కాలేజీల్లో, పాఠశాలల్లో ప్రసంగిస్తూ... యువతలో స్ఫూర్తిని నింపుతున్నాడు. ‘సక్సెస్ నాట్ జస్ట్ అబౌట్ వర్కింగ్‌హార్డ్’ అంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement