నీళ్లలో గెలిచి నీటిపాలు...
ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడం... ఒక క్రీడాకారుడి జీవితంలో అత్యుత్తమ క్షణం...ఆ సమయంలో వారి ఆనందానికి హద్దులుండవు. అయితే సంబరాలు హద్దు దాటితేనే సమస్య... ప్రఖ్యాత రోయర్ వచెస్లావ్ నికోలవిక్ ఇవనోవ్‌కు ఇది అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. రష్యాకు చెందిన ఈ ఆటగాడు రోయింగ్ (సింగిల్ స్కల్ విభాగం)లో వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే అత్యుత్సాహంతో తొలిసారి నెగ్గిన బంగారు పతకాన్ని నీటిపాలు చేశాడు.
1956లో జరిగిన మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో రోయింగ్ సింగిల్ స్కల్ విభాగంలో ఇవనోవ్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అయితే పతకం అందుకోగానే 18 ఏళ్ల ఇవనోవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో దాన్ని గాల్లో ఎగిరేసి ఉత్సాహంగా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే చేయి అదుపు తప్పింది. ఆ పతకం దిశ మారి మరో వైపున్న సరస్సులో పడింది. అంతే... ఒక్క క్షణం ఏమీ అర్థం కాని అతను... ఆ వెంటనే తేరుకొని ఆ సరస్సులోకి జంప్ చేశాడు.
అయితే ఎంత గాలించినా ఇవనోవ్‌కు పతకం చిక్కలేదు. చివరకు నిర్వాహకులు కూడా గజ ఈతగాళ్లతో వెతికించినా ఫలితం లేకపోయింది. దాంతో బిక్క మొహం వేసుకొని అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత 1960 రోమ్, 1964 టోక్యో ఒలింపిక్స్‌లలో కూడా ఇవనోవ్ ఇదే విభాగంలో మళ్లీ స్వర్ణాలు నెగ్గాడు. అయితే ఈ సారి గాల్లో విసరలేదు.