మొదటి అడుగు
మహిళ 2014
ఒక వైపు ప్రగతి... మరో వైపు అధోగతి..! వాడుకభాషలో, సినిమా ఫక్కీలో చెప్పాలంటే - ఒకరోజు ‘దూకుడు’... మరుసటి రోజు ‘బ్రేకుడు’! మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కి... సంక్షిప్తంగా 2014 సంవత్సరం మహిళకు రెండు విభిన్న కోణాల్లో కనపడింది. సంవత్సరం ప్రథమార్ధంలో రాజకీయాలలో, ముఖ్యంగా ఎన్నికల్లో ప్రముఖ పాత్ర వహించినవారిలో సోనియా గాంధీ, సుష్మాస్వరాజ్, స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, ఆనందీబెన్, తెలుగువాళ్ళలో కవిత, షర్మిల, రోజా - ఇలా ఎంతోమంది మహిళలున్నారు. వీళ్ళంతా... ‘ఆడవారు ఎందులోనైనా దూసుకెళ్ళగలరు’ అని నిరూపించారు.
చక్కటి కాంచీవరం పట్టుచీర, తలనిండా మల్లెపూలు, చేతి నిండా గాజులు పెట్టుకొని ట్రెడిషనల్‌గా ఉంటూనే, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో లాంచ్ అయిన ‘మంగళయాన్’ ప్రాజెక్ట్‌లో తమది నంబర్ 1 పాత్ర అని చూపించారు. మరోవైపు కేవలం హైదరాబాద్ లాంటి ప్రధాన నగరంలోనే మహిళలపై అత్యాచారాలు ఒకటిన్నర రెట్లు ఎక్కువయ్యాయి. 2012లో 75 అత్యాచారం కేసులు నమోదైతే, ఈ సంవత్సరం దాదాపు 102 కేసులు వచ్చాయి.
వచ్చే ఏడు ఎలాంటి ఉమెన్ సేఫ్టీ పాలసీ వస్తుందో, ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో అని ఎదురుచూసి మోసపోకుండా, ఆడవారు తమ సేఫ్టీ, సెక్యూరిటీ తామే చూసుకోవాలని గ్రహించారు. అందుకే, ఈ సంవత్సరం చివరలో మొబైల్ ఫోన్‌లో సేఫ్టీ యాప్స్ డౌన్‌లోడ్స్‌తో, పెప్పర్ స్ప్రేలతో, మార్షల్ ఆర్ట్స్‌తో రెడీ అవుతున్నారు. మార్పు మనతోనే మొదలవ్వాలని నమ్మి, తామే మొదటి అడుగు వేస్తున్నారు.
మంజులతా కళానిధి
(ఈ ఏడాది ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ‘రైస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త)