బాలాజీ సింగ్ మహాజాదూ! | Balaji Singh mahajadu! | Sakshi
Sakshi News home page

బాలాజీ సింగ్ మహాజాదూ!

Published Fri, Aug 1 2014 2:26 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

బాలాజీ సింగ్ మహాజాదూ! - Sakshi

బాలాజీ సింగ్ మహాజాదూ!

  •   సినిమాలకు డబ్బింగ్ అవకాశం ఇప్పిస్తానంటూ మహిళలకు ఎర
  •   కిడ్నీల దానం పేరిట రూ.లక్షల్లో వసూలు
  •   సాయికుమార్ కోసం కొనసాగుతున్న గాలింపు
  • సాక్షి ప్రతినిధి, విజయవాడ : కిడ్నీ రాకెట్‌లో కీలక నిందితుడైన బాలాజీ సింగ్ మోసాలు చేయడంలో దిట్టని తెలుస్తోంది. స్థానిక సత్యనారాయణపురం పోలీసులు కిడ్నీ రాకెట్ ముఠాను అరెస్టు చేసిన ప్పుడు అతడిని ప్రశ్నిస్తే క్షణం కూడా తడుముకోకుండా తన మోసాల చిట్టా విప్పాడు. అతని తండ్రి గోవింద్‌సింగ్, సోదరుడు పృధ్వీరాజ్‌సింగ్ కూడా మోసాల్లో సిద్ధహస్తులే. ఈ విషయాలను బాలాజీ సింగ్ స్వయంగా అంగీకరించాడు. దీంతో పోలీసులు పృధ్వీరాజ్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు.
     
    మోసపోయిన మహిళలు
     
    బాలాజీసింగ్ మళయాల డబ్బింగ్ సినిమాలు కొనుగోలు చేసి ఆడించడం ద్వారా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టులు కావాలని, మంచి గొంతు ఉంటే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తానంటూ పలువురు యువతులు, మహిళలను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడ కొందరిని పరిచయం చేశాడు. గాత్రం బాగున్నవారికి మంచి అవకాశాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి రూ.లక్షల్లో నగదు వసూలు చేశాడు. విజయవాడలోనే ఐదుగురి నుంచి ఇలా డబ్బు వసూలు చేశాడని తెలిసింది. బాలాజీ సింగ్‌ను అరెస్టు చేశారని పత్రికల్లో వార్తలు రావడంతో విజయవాడకు చెందిన ఒక మహిళ తాను మోసపోయిన వివరాలను సత్యనారాయణపురం పోలీసులకు తెలిపింది.
     
    అయితే ఆమె నివసిస్తున్న ప్రాంతం సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులనే ఆశ్రయించాలని సత్యనారాయణపురం పోలీ సులు సూచించారు. బాలాజీ చేతిలో చాలామంది మోసపోయినా కేసు పెడితే పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అనంతరం ఇబ్బందికర పరిస్థితులు ఎదరవుతాయని పలువురు వెనుకాడుతున్నారని సమాచారం.
     
    ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి కిడ్నీ విక్రయించి అప్పుల బారినుంచి బయటపడొచ్చంటూ కొందరికి లక్షల రూపాయల్లో ఎరవేసి మోసగించాడు. కొందరితో వ్యభిచారం కూడా చేయించాడని తెలిసింది. ఇలా మోసపోయిన వారు లోలోపల కుమిలిపోతున్నట్లు తెలిసింది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ తనతో పాటు చాలా మంది మోసపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
     సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్న నాగసాయిదుర్గ, జి.ఉమాదేవి కిడ్నీలను విక్రయించేందుకు కూడా సింగ్ సిద్ధమయ్యాడు. ఫోర్జరీ సంతకాల డాక్యుమెంట్ల వ్యవహారం బయటకు రాకుంటే వారిద్దరి కిడ్నీలు కూడా అమ్మేసేవాడు. బాలాజీసింగ్‌ను పోలీసులు కష్టడీలోకి తీసుకుని విచారిస్తే ఎన్నో నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
     
    కిడ్నీలు ఇప్పిస్తానంటూ మోసం

    హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడల్లోని కిడ్నీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లోని సిబ్బందితో సంబంధాలు పెంచుకున్న బాలాజీ సింగ్ కిడ్నీ రోగులు, డయాలసిస్ చేయించుకుంటున్న వారి వివరాలు తెలుసుకునేవాడు. కిడ్నీలు ఇప్పిస్తానంటూ రోగులు, వారి బంధువుల ఆర్థిక స్థాయిని బట్టి రూ.లక్షల్లో బేరం కుదుర్చుకుని కొంత మొత్తం ముందుగానే వసూలు చేసేవాడు. హైదరాబాద్‌కు చెందిన సాయికుమార్‌తో సంబంధాలు బలపడటంతో ఆయనకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్యమైన వైద్యులతో కూడా బాలాజీ సింగ్ పరిచయం పెంచుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఐ.పోలవరం శివారు తిళ్ళకుప్పకు చెందిన కడియం అబ్బు నుంచి నాలుగేళ్ల క్రితం రూ.2 లక్షలు వసూలుచేశాడు.  అయితే కిడ్నీ ఇప్పించలేదు. ఇలాంటి బాధితులు అనేక మంది ఉన్నారని సమాచారం. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న బాలాజీసింగ్, పృధ్వీరాజ్ సింగ్‌లను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సత్యనారాయణపురం పోలీసులు గురువారం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement