పెద్దగీత– చిన్నగీత
ఆత్మీయం
పూర్వం ఒక గురువుగారు పాఠం చెబుతూ, నల్లబల్లపై ఒక గీత గీసి, ఆ గీతను చెరపకుండా చిన్నదిగా చేయమని విద్యార్థులను అడిగారు. ఎలా చేయగలం? ఆ గీతను ముట్టుకోకుండా చిన్నదిగా చేయాలి. అపుడు వారిలో ఒక తెలివైన విద్యార్థి లేచి ఆ గీత కింద మరొక పెద్దగీతను గీశాడు. దానితో మొదటి గీత చిన్నదిగా అయిపోయింది. ఇక్కడ నీతి ఏమంటే, మీ కష్టాలు చాలా పెద్దవిగా అనిపించినపుడు, ఒక్కసారి కనులు పైకెత్తి చూడండి. ఎందుకంటే ఇప్పటివరకూ మీ దృష్టిని మీ పైనే కేంద్రీకరించి ఉంచారు. ఒకసారి మీ చుట్టూ ఉన్నవారిని, మీకంటే చాలా ఎక్కువ కష్టాలు పడుతున్నవారిని చూడండి. మీ కష్టం మీరనుకున్నంత పెద్దదేమీ కాదని మీకు అనిపిస్తుంది.
మీకు ఏదైనా పెద్దకష్టం వచ్చినపుడు మీకంటే పెద్ద కష్టాలు పడుతున్నవారికేసి చూడండి. మీలో ఒక ఆత్మవిశ్వాసం, నా సమస్య చిన్నది, నేను దీనిని అధిగమించగలను అనే నమ్మకం కలుగుతాయి. కాబట్టి, ఆనందంగా ఉండటానికి మొదటి సూత్రం ఏమంటే, ప్రపంచంలో ఎక్కడైతే పెద్దపెద్ద సమస్యలు ఉన్నాయో అక్కడ చూడండి. అపుడు మీ సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయో అప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొనే, లేదా పరిష్కరించే శక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. స్థూలంగా చెప్పాలంటే, ఎక్కువ కష్టాలు ఎవరికైతే ఉన్నవో అటువంటివారికి సహాయపడండి. సేవ చేయండి.