తెలివైన శత్రువుకంటే తెలివితక్కువ స్నేహితుడే ఎక్కువ ప్రమాదకారి. ప్రతి ఒక్క ఫిలాసఫర్ ఎక్కడో ఒక చోట ఈ మాట చెప్పే ఉంటాడు. ఎవరూ చెప్పకపోయినా, ప్రతి ఒక్కరికీ జీవితంలో ఇలాంటి అనుభవం ఒకటి ఎదురయ్యే ఉంటుంది. సత్యపాల్ సింగ్ సెంట్రల్ మినిస్టర్. ఉన్నత విద్యాశాఖకు ఈమధ్యే సెప్టెంబర్‌లో మంత్రిగా వచ్చారు. శనివారం ఔరంగాబాద్‌లో అఖిలభారతీయ వైదిక సమ్మేళంలో ప్రసంగిస్తూ, డార్విన్ సిద్ధాంతం తప్పు అన్నారు. స్కూళ్లలోంచి, కాలేజీల్లోంచి పాఠ్యపుస్తకాల్లో డార్విన్ పరిణామక్రమ సిద్ధాంతాన్ని తీసెయ్యాలి అన్నారు. ‘‘కోతి నుంచి మనిషి పుట్టాడని డార్విన్ చెప్పాడు. అదే నిజమైతే కోతి నుంచి మనిషి పుట్టడాన్ని మన పూర్వీకులు ఎవరైనా చూసి ఉండాలి కదా! చూసినట్లు ఏ వేదంలోనూ లేదు. మనుషులు రావడం రావడమే భూమ్మీదకు మనుషులుగా వచ్చారు’’ అన్నది సత్యపాల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మర్నాడు, ఆదివారం పుణెలోని సీనియర్ సైంటిస్టులు కొందరు కలిసి కూర్చొని సత్యపాల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ, పన్నెండొందల సంతకాలతో మంత్రిగారి శాఖకు ఒక లేఖ రాశారు! ‘చెప్పండి, డార్విన్ సిద్ధాంతాన్ని పిల్లల పుస్తకాల్లోంచి మీరెలా తీస్తారు?’ అని. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటే ఎలా? వందేళ్లుగా డార్విన్ సిద్ధాంతంపై మా సైంటిస్టులు అధ్యయనాలు చేస్తున్నారు. ఆ ఫలితాలన్నీ కూడా డార్విన్‌ని సమర్థించే విధంగానే ఉన్నాయి. మినిస్టర్ గారికి ఈ మాత్రం జీకే కూడా లేకపోవడం మాకు షాకింగ్‌గా ఉంది’ అని రేడియో ఆస్ట్రోనామర్ గోవింద్ స్వరూప్, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ రీడర్ అనికేత్ సూళే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు!
నిజానికి వీళ్లేం దిగ్భ్రాంతికి లోనుకానవసరం లేదు. మంత్రిగారి మాటలకు దిగాలు పడనవసరమూ లేదు. సత్యపాల్ తనకు తోచింది అన్నారు తప్ప, తోచినంత పనీ చేయిస్తాడని, ఒకవేళ మోదీని ఒప్పించి చేయించినా డార్విన్ సిద్ధాంతం మరుగున పడిపోతుందని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ముఖ్యంగా సైంటిస్టులు. మంత్రిగారు అన్నట్లు లేదా మనమంతా నమ్ముతున్నట్లు .. మనిషి కోతి నుంచి వచ్చాడని డార్విన్ ఎక్కడా చెప్పలేదు. అసలు ‘మనిషి ఫ్రమ్ కోతి’ అనే మాటే డార్విన్ రాసిన సిద్ధాంత గ్రంథం ‘ది డిస్సెంట్ ఆఫ్ మ్యాన్’లోని ఏ పేజీలోనూ లేదు! ‘కోతి, మనిషి ఒకే చెట్టు కొమ్మలు’ అని డార్విన్ అన్నాడు తప్ప, కోతి ఆ కొమ్మపై నుంచి ఈ కొమ్మకు ఎగిరీ ఎగిరీ చివరికి మనిషైపోయింది అనేమీ సూత్రీకరించలేదు. కోతి, మనిషి కజిన్స్. కజిన్ నుంచి మనిషి రాడు కదా! ఇంత చిన్న విషయం మంత్రిగారి మాటలకు ‘షాక్ తిన్న’ సైంటిస్టులకు తెలియకుండా ఉంటుందా?! మంత్రిగారి వల్ల సైన్స్‌కి వచ్చే నష్టంగానీ, ఆయన మాటలపై సైంటిస్టులు స్పందించకుండా ఉంటే డార్విన్ సిద్ధాంతానికి జరిగే హానిగానీ ఏమీ ఉండదు. సైంటిస్టులు కూల్‌గా ఉంటే పోయేది. తెలివైన శత్రువుకంటే తెలివితక్కువ స్నేహితుడే డార్విన్‌కి ఎక్కువ ప్రమాదకారి.
– మాధవ్ శింగరాజు
కోతికి కజిన్లు
Published Tue, Jan 23 2018 1:03 AM | Last Updated on Tue, Jan 23 2018 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment