ఆ నలుగురి కోసం...
సంచలనాలకు మారుపేరు, మహామహులే ‘ఎర్ర’ మట్టికరిచే రోలండ్ గారోస్ స్టేడియంకు 86 ఏళ్ల చరిత్ర ఉంది. 1927వ సంవత్సరం ఫ్రాన్స్ టెన్నిస్ లోకానికి చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ దేశపు ఆటగాళ్లు జాక్వస్ బ్రూగ్నాన్, జీన్ బొరోట్రా, హెన్సీ కోచెట్, రెనీ లాకోస్ట్ కలసి అప్పట్లో అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేశారు.
ఈ నలుగురు అమెరికా గడ్డపై అమెరికాను ఓడించి డేవిస్‌కప్‌ను గెలుచుకున్నారు. నిబంధన ప్రకారం తర్వాతి ఏడాది ఈ రెండు జట్ల మధ్యే ఫ్రాన్స్‌లో రీ మ్యాచ్ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే డేవిస్ కప్‌లాంటి పెద్ద ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే స్థాయి స్టేడియం పారిస్‌లో లేదు. ఒక రకంగా పరువు పోగొట్టుకునే పరిస్థితి తయారైంది. ఈ దశలో ఒక ప్రైవేట్ క్లబ్‌కు చెందినవారు మూడు హెక్టార్ల భూమి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కొన్నాళ్ల క్రితం మరణించిన తమ క్లబ్ సీనియర్ సభ్యుడు రోలండ్ గారోస్ పేరు దానికి పెట్టాలని షరతు విధించారు.
విమానయాన రంగ నిపుణుడైన గారోస్‌కు మధ్యధరా సముద్రం మీదుగా విమానం నడిపిన తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు ఉంది. దాంతో 1928లో రోలండ్ గారోస్ స్టేడియం సిద్ధమైంది. తొలిసారి అక్కడే ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ (ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్) టోర్నీని నిర్వహించారు. అదే ఏడాది చివర్లో ఫ్రాన్స్-అమెరికా పోరు కూడా అక్కడే జరిగింది. ఈ సారి కూడా ఫ్రెంచివారు తమ ఆధిక్యం ప్రదర్శిస్తూ సొంతగడ్డపై కూడా చెలరేగి డేవిస్‌కప్‌ను నిలబెట్టుకున్నారు. తమ దేశపు గౌరవం కాపాడేందుకు ఆ నలుగురి కోసం కొత్త స్టేడియంను కట్టాల్సి వచ్చింది.