చలికాలం... మృదువైన చర్మం కోసం...
బ్యూటిప్స్
పెదవులు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలొవెరా జెల్ చర్మం పగుళ్లను నివారిస్తుంది. పొడిబారిన పెదవులకు అలొవెరా జెల్‌ని లిప్‌బామ్‌లా రాసుకోవాలి. లేదా రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, పడుకునేముందు పెదవులకు రాసుకోవాలి. పెదవుల చర్మం మృదువుగా మారుతుంది.
పూలలోని పుప్పొడి, నల్ల నువ్వులు, పసుపుకొమ్ము, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలం చర్మం కాంతివంతం అవుతుంది.
స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చలికాలంలో పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం..కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.