
జీవితంలో ఎన్నోసార్లు గాట్లు పడతాయి. వాటిల్లో... కడుపు కోత ఉంటుంది. గుండె కోతా ఉంటుంది. ప్రతి బాధా ఒక రంపపు కోతే! మరి.. చనిపోయిన తర్వాత కూడా.. కోత తప్పకపోతే? శివ శివా! ప్రాణం లేదు కాబట్టి... పంచేంద్రియాలు శాశ్వత నిద్రలో ఉంటాయి కాబట్టి కోత తెలియదు. కానీ కోసే వ్యక్తికి ఆ బాధ తెలుస్తుంది. పోస్ట్‌మార్టమ్ అనేది.. శవాల్ని కోసి, నిజాల్ని తీసే వృత్తి. అక్కడ దైవం కనిపిస్తుందా? శవ శవా... కనిపిస్తుంది!
మార్చురీలో దైవత్వాన్ని చూడగలమా?! ఈ సందేహంతో గాంధీ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఆవరణలోకి అడుగుపెట్టినప్పుడు ఒక విధమైన వైరాగ్య భావన మనసును తాకింది. ఫేస్ మాస్క్ కట్టుకుని మార్చురీ రూమ్ వైపుగా వెళ్లాం. ఆ గదిలోపలకు చూడగానే గుండె గతుక్కుమంది. వరుసగా బల్లల మీద శవాలు! వాటికి పోస్టుమార్టం చేస్తూ డాక్టర్లు, వర్కర్లు కనిపించారు. అగ్నిప్రమాదంలో కాలిన శరీరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న డాక్టర్ లక్ష్మణ్‌రావుని పలకరించాం. ఎన్నో సందేహాలను వ్యక్తం చేశాం.
పోస్టుమార్టంలో నిజాలను ఎలా నిర్ధారిస్తుంటారు?
లక్ష్మణ్‌రావు: ఇటీవల ప్రమాదవశాత్తు ఒకతను లారీ మీద నుంచి కిందపడి చనిపోయాడని పోలీసులు పంచనామా రాసి శవాన్ని మా దగ్గరకు తీసుకువచ్చారు. పోస్టుమార్టంలో తెలిసిన నిజమేంటంటే.. అతని గొంతు నులిమి ఎవరో లారీ నుంచి కిందకు తోసేశారని. ఈ ఆధారాల ప్రకారం పోలీసులు నిజాలను రాబడితే... అతని బావమరిదే ఈ పనిచేశాడని రుజువయ్యింది. ఇలాగే మొన్న చాందినీ జైన్ కేసు. ఆమె ఎలా చనిపోయిందో పోలీసులకు అర్థం కాలేదు. పై నుంచి పడిపోయిన కేసుగా పంచనామాలో రాసిచ్చారు. కానీ, పైనుంచి పడిపోతే ఆ బాడీ మీద ఎలాంటి గాయాలు లేవు. కొన్ని ఆనవాళ్లను బట్టి హత్య కేసుగా చెప్పాం. మేం ఏది చెప్పామో అలాగే జరిగింది. రేప్ కేసుల్లోనూ ఇలాంటివి తెలుస్తుంటాయి. శవం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. దీని వల్ల మరో నేరం జరగకుండా, మరో నేరస్థుడు తయారుకాకుండా, నేరస్థుడికి తగిన శిక్ష పడేలా మేం సహాయపడతాం. కొన్ని వరదలు, బస్సు ప్రమాదాలు లాంటివి జరిగాయనుకోండి. అలాంటి టైమ్‌లో చాలా మంది చనిపోతుంటారు. వారి శరీరాలు ముక్కలు ముక్కలు అయిపోతుంటాయి. ఎవరి బాడీ ఎవరిదో కూడా అలాంటి సందర్భాల్లో తెలియదు. ఫలానా మనిషి అని మేం నిర్ధారణ చేస్తేనే ఆ కుటుంబానికి నష్టపరిహారం, ఇన్సూరెన్స్ వంటివి అందుతాయి. కర్మకాండలు చేసుకోగలుగుతారు. సాధారణంగా ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ అంటే బయటంతా ‘వీళ్లు శవాలను కోస్తారు’ అనుకుంటారు. కానీ, ఇక్కడ చాలా వర్క్ ఉంటుంది.
ఆధారాలను ఎలా వెలికితీస్తారు, ఎలాంటి వర్క్ ఉంటుంది?
ఒక వ్యక్తి విషం తీసుకొని చనిపోయాడను కోండి.. నోటి నుంచే ఆ ద్రవం కడుపులోకి వెళ్లాలి. అక్కణ్ణుంచి జీర్ణమై బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లివర్‌కి, వ్యర్ధ పదార్థాలు కిడ్నీకి చేరుతాయి. ఈ మెకానిజమ్ కోసం.. కడుపు, బ్లడ్, లివర్, కిడ్నీ, యూరిన్,.. ఇలా చిన్న చిన్న పార్ట్స్ శరీరం నుంచి తీసి ల్యాబ్‌కి పంపిస్తాం. రేప్ కేస్ అయితే.. జనరల్ ఫిజికల్ ఎగ్జామి నేషన్ చూస్తాం. శరీరం మీద గాట్లు, బైట్స్, వెజైనల్ పార్ట్ దగ్గర సెమన్, బ్లీడింగ్ వంటివి బట్టి రేప్‌కేస్‌గా నిర్ధారిస్తాం. మంటల్లో కాలిపోతే.. పుర్రెను బట్టి ఆడా–మగ, జంతువా.. అనేది చెబుతాం. బాగా డీ కంపోజ్ అయిన, తవ్వి తీసిన శవాలు ఉంటాయి. భాగాలన్నీ సపరేట్ అయిపోయుంటాయి. అప్పుడు బోన్స్ నుంచి ఆధారాలు సేకరిస్తాం.
చావు తర్వాత దేహాన్ని ఆత్మ వదిలిపోదు ఆ దరిదాపుల్లోనే ఉంటుందని కొంతమంది సైంటిస్టులు సైతం చెబుతుంటారు. మీకు అలాంటి అభిప్రాయం ఉందా?
దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు, ఆత్మలు కూడా ఉంటాయి. కానీ, ఇక్కడ అలాంటివేవీ మేం చూడలేదు. కానీ, రాత్రిపూట పోస్టుమార్టం చేయం. ఒకవేళ తప్పనిపరిస్థితి వస్తే పోలీసులు, మిగతా సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఉన్నంతసేపే ఇలా ఉంటుంది. ఇది దాటితే నా ప్రపంచం వేరేగా ఉంటుంది. ఇదే లైఫ్‌ని కంటిన్యూ చేయగలిగితే ఇన్నేళ్లు నేనుండేవాణ్ణి కాదేమో!
ఆత్మలు ఉన్నాయంటు న్నారు. పోస్టుమార్టం చేసే ముందు ధైర్యం కోసం ఇంట్లో పూజ చేసి వస్తారా? పోస్ట్ మార్టం తర్వాత మనసు ప్రశాంతంగా ఉండటానికి ఏమైనా పద్ధతులు అవలంబిస్తారా?
ఇంట్లో చేసే అన్ని పూజల్లో పాల్గొంటాను. అలాగని పూజ చేసి మార్చురీకి రావాలనే నియమం ఏమీ లేదు. సాధారణంగా ఎవరైనా చనిపోతే చూడ్డానికి వెళ్లినవారు తిరిగి నేరుగా ఇంటికి వచ్చి తలారా స్నానం చేస్తారు. అలాగే చేయాలనే నియమం పెట్టుకోం. కానీ, బంధువులో, మిత్రులో చనిపోయినప్పుడు చూసొచ్చిన తర్వాత అలా స్నానం చేయడం ఉంటుంది. ఇప్పుడు పోస్టుమార్టం చేసి వచ్చాక లంచ్ టైమ్ అవుతుంది. ఇలాగే బయటకెళ్లి బిర్యానీ తినొస్తాం. ఇది డ్యూటీ.. అంతే! అప్పట్లో కలరా అనే వ్యాధి ఎక్కువగా ఉండేది. అందుకే చనిపోయినప్పుడు వారింటికెళ్లి శవాన్ని ముట్టుకుంటే వ్యాధి వస్తుందని భయపడేవారు. అక్కణ్ణుంచే ఇంటికి రాగానే స్నానం చేయాలనే ఆలోచన వచ్చింది.
దేవుడి సృష్టిలో మనిషి చాలా ఉన్నతుడు అంటారు. మీరేమనుకుంటారు?
సృష్టికి మనిషి ఏ విధంగానూ మనిషి ఉపయోగపడడు. పాములు, గేదెలు వంటివి చనిపోతే వాటి చర్మమైనా పనికి వస్తుంది. కొన్ని చనిపోతే చెట్టు చేమకైనా బలాన్నిస్తాయి. మనిషి చనిపోతే దేనికీ పనికిరాడు. భూమి మీద వేస్ట్ ప్రాణి ఏదైనా ఉందంటే అది మనిషే!
మీరు దేవుణ్ణి ఎంతగా నమ్ముతారు? ఏం కావాలని కోరుకుంటారు?
చాలా నమ్ముతాను. వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. చదువుకునే రోజుల నుంచి ఇప్పటి వరకు 11 సార్లు కొండమెట్లు ఎక్కి ఉంటాను. మన పని కరెక్ట్‌గా చేస్తే దేవుడి కరుణ ఉంటుందని నమ్ముతాను. అలాగని కోరుకోకుండా ఏమీ ఉండను. నా కోసం కాకుండా పిల్లలు సక్సెస్ అవ్వాలని కోరుకుం టాను. ఫోరెన్సిక్ డాక్టర్ అయ్యాక వెళ్లి థ్యాంక్స్ చెప్పుకున్నాను. చదువుకునే రోజుల్లో శ్రీరామ శ్రీరామ అని పది లక్షల సార్లు రాసి ఉంటాను.
దైవభక్తి ఉన్న మీరు ఈ వృత్తిని ఎలా ఎంచుకున్నారు? ఇదీ దైవ నిర్ణయం అనుకుంటారా?
మాది రామగుండం దగ్గర మేడిపల్లి గ్రామం. మా నాన్న చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసేవాడు. నేను డాక్టర్ అవ్వాలని మా నాన్న కోరిక. ఆయన ఇష్టం మేరకే ఎంబీబిఎస్ చేశాను. ముందు పిడియాట్రీషిన్ కావాలను కున్నాను. కొన్ని కారణాల వల్ల దాన్ని ఎంచుకోలేకపోయాను. తర్వాత నా ముందు 5–6 మెడికల్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ఫోరెన్సిక్ డాక్టర్ అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది. దీంతో వెంటనే ఈ డ్యూటీకి ఒప్పుకున్నాను. ఒకసారి ఒప్పుకున్నాక దీన్నీ ఇష్టపడగలగాలి. లేకపోతే ప్రతిరోజూ నరకమే చూడాల్సి ఉంటుంది. అలా పదేళ్లుగా ఫోరెన్సిక్ డాక్టర్‌గా పనిచేస్తున్నాను. దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేక మాలో తాగుడికి అలవాటుపడిన వారున్నారు. మా డిపార్ట్‌మెంట్‌లో ఇప్పటికీ 30 శాతం మంది మార్చూరీకి రాకుండా బయట బయటే వేరే క్లాసులు తీసుకోవడం వంటి పనులు చూసుకొని వెళ్లిపోతుంటారు. ఎంబీబీస్ చదివేటప్పుడు ఎవ్వరూ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ కావాలని కోరుకోరు. వచ్చినా మధ్యలోనే వెళ్లిపోయిన వారున్నారు. కొందరు ఛాలెజింగ్‌గా ఎంచుకుని టాప్ పొజిషన్‌లకు వెళ్లిన వారున్నారు. పెద్ద పెద్ద జడ్జీలకు, ఐఎఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తుంటాం. వాళ్లు క్రైమ్ సీన్ తయారుచేసుకోవాలంటే మేం ఇచ్చిన ఆధారాలే ప్రాణం. అలాంటప్పుడు గర్వంగా అనిపిస్తుంది. మేం బాడీలో అనాటమీ డిసెక్షన్ చేస్తాం, పాథాలజీలో వ్యాధుల గురించి చదువుకుంటాం. మెడిసిన్‌లో ట్రీట్‌మెంట్ గురించి చదువుకుంటాం. ఇవన్నీ మేమే చెప్పగలం. అంతేకాదు ఒక డాక్టర్ వల్ల పేషెంట్ చనిపోతే ఏ కారణంగా చనిపోయాడో మేం తప్ప ప్రపంచంలో మరెవ్వరూ చెప్పలేరు. మెడిసిన్ ఇంత డెవలప్ అవడానికి కారణం.. డెడ్‌బాడీసే! శవాల అనాటమీ డిసెక్షన్ వల్లే ఎంతో తెలుసుకోగలుగుతాం.
మొదటిసారి శవాన్ని పోస్టుమార్టం చేసినప్పుడు ఏమనిపించింది? దేవుణ్ణి తలుచుకున్నారా?
పోస్ట్‌మార్టం రూమ్‌లో మా ప్రొఫెసర్ ‘ఈ ఫీల్డ్‌కి ఎందుకొచ్చావ్’ అన్నారు. ఈ డిపార్ట్‌మెంట్‌కి ఎవరొచ్చినా ఇదే మాట అడుగుతారు. చాలా సమస్యలను తట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని కోల్పోవాల్సి ఉంటుందని కూడా చెప్పారు. పోస్ట్‌మార్టం చూసిన రోజు నుంచి దాదాపు నెల రోజులు శవాలు నన్ను వెంటాడుతున్నట్టే ఉండేది. కళ్లు మూసినా, తెరిచినా శవాలు.. వాటిలోపలి అవయవాలు కనిపించేవి. ఎదురుగా ఎవరితోనైనా మాట్లాడు తున్నా వాళ్ల బాడీ పార్ట్స్ కనిపిస్తూ ఉండేవి. మా ఆవిడ అయితే ఈ జాబ్ వదిలేయమంది.
ఎవరైనా చనిపోయినవారిని చూసొచ్చినప్పుడు శ్మశాన వైరాగ్యం ఆవరించి దేవుణ్ణి తలుచుకుంటారు. మీరు ప్రతిరోజూ శవాల మధ్యే గడుపుతారు...
అందుకే, గుండె బండబారిపోయిందేమో అనిపిస్తుంటుంది. చాలా వరకు సున్నితత్త్వం పోతుంది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఏది చెబితే అది చేసేటంత. అలాంటిది ఆయన చనిపోయినప్పుడు నాకు కంట్లో నీళ్లు రాలేదు. గుండె మొద్దుబారి, శూన్యం ఆవరించినట్టు అనిపించింది. ‘అంత ఇష్టమైన మనిషి కదా! ఏడుపు ఎందుకు రాలేదు’ అనుకునేవాడిని. మనిషికి ఉండాల్సిన సున్నితమైన ఫ్లేవర్ వెళ్లిపోయిందండీ! దీంతో ఆలోచనా విధానం కూడా మారింది. కాకపోతే ఏదైనా సమస్య వస్తే డీల్ చేసే ధైర్యం, తెగువ వచ్చాయి. మా మేనమామకు నేనే పోస్టుమార్టం చేయాల్సి వచ్చింది. అప్పుడనిపించింది.. ఇన్నాళ్లు ఎంత కలిసిమెలసి, ఆనందంగా గడిపాం. చనిపోయిన తర్వాత ఈ పరిస్థితి ఏంట్రా బాబూ అనిపించింది. అలాగే ఏదైనా సాధించినప్పుడు కూడా పెద్ద ఎగై్జట్‌మెంట్ అనిపించదు. ఇప్పుడు ఓ ఖరీదైన కారు కొన్నాననుకోండి... ఏమీ అనిపించిదు. అంతా రొటీన్ అయిపోయింది. ఇలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మా మిసెస్ భయపడుతుంది. ఏదైనా మాట్లాడితే...‘ అమ్మో! క్రిమినల్‌తో మాట్లాడలేం’ అంటుంది (నవ్వేస్తూ).
మీ పిల్లలు, బంధుమిత్రులు మీ ఉద్యోగం గురించి చెప్పినప్పుడు వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది?
నాకు ఇద్దరు పిల్లలు. ఇంజనీరింగ్ చదువుతున్నారు. పిల్లలకు చిన్నతనమంతా నేను డాక్టర్‌గానే వాళ్లకు తెలుసు. మా ఆవిడ కూడా వాళ్లకు చెప్పలేదు. (నవ్వుతూ) శవాలను కోసే డాక్టర్ అని కాకుండా ఫోరెన్సిక్ డాక్టర్ అని అందమైన పదాలే వాడుతాం. మొదట్లో అయితే ఇది ఎందుకు తీసుకున్నావ్? అని అడిగినవాళ్లే ఎక్కువ. పది మందిలో మాట్లాడినప్పుడు వాళ్లేం అనుకుంటారో అని నేను కూడా అసలు విషయం చెప్పకపోయే వాడిని. ఇప్పుడు ఫోరెన్సిక్ డాక్టర్ అని గర్వంగా చెప్పుకుంటాను. పదేళ్ల క్రితం నాటికి ఇప్పటికీ జనాల మైండ్‌సెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో మాత్రం ‘వీళ్లు ఎప్పుడూ తాగి ఉంటారు. వీళ్ల దగ్గర శవాల కంపు వస్తుంది’ అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఈ ఫీల్డ్‌కి అమ్మాయిలు కూడా వస్తున్నారు. ఇప్పుడు నలుగురు అమ్మాయిలు మా డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. వాళ్లు ఇక్కడ విధులు చేసుకుంటారు. ఇంటి దగ్గర పూజలు, వ్రతాలు చేసుకుంటుంటారు. దేనికదే అనేది ఒక లైన్ గీసుకోగలుగుతున్నారు. మా ఆవిడ ఇమిటేషన్ జువెల్రీ తయారుచేస్తుంది. ఎగ్జిబిషన్స్ పెడుతుంది. ఆమె శరీరాలను అందంగా అలంకరించేందుకు తాపత్రయపడుతుంది. నేను శరీరాలలో ఆధారాలను సేకరించేందుకు తాపత్రయపడతాను. (నవ్వేస్తూ)
మార్చు్చరీలో ఎప్పుడైనా బాధ కలిగి దేవుడిని తలుచుకున్న సందర్భం?
నా ఫ్రెండ్ రమేష్ ఇదే ఫ్యాకల్టీ. ఇద్దరం చదువుకునేరోజుల్లో ఏడెనిమిదేళ్లు ఒకే రూంలో కలిసి ఉన్నాం. ఈ మధ్యే అతనికి యాక్సిడెంట్ అయితే మార్చూరీకి తీసుకొచ్చారు. నేనే పోస్టుమార్టం చేశాను. బాధనిపించింది. ఈ పదేళ్లలో మా ఫ్యాకల్టీలోని ఐదుగురు యాక్సిడెంట్‌లో మరణిస్తే ఇక్కడకు తీసుకొ చ్చారు. (చేతులు జోడిస్తూ) నేను చనిపోతే ఇక్కడకు రాకూడదు స్వామీ అని దణ్ణం పెట్టుకుంటాను.
ఆడవాళ్లు కూడా ఈ శాఖను ఎంచుకోవడానికి కారణం? ధైర్యం కోసం పూజలు ఎక్కువ చేస్తుంటారా?
చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామి భక్తురాలిని. ప్రతి మంగళవారం స్వామిని పూజిస్తాను. అదంతా ఇంటి వరకే పరిమితం. వరుసగా మూడు రోజులు ఈ డ్యూటీలో ఉన్నాను. ఇది నా వృత్తి. అంతవరకే చూస్తాను. మార్చూరీకి వస్తే చేస్తున్న పనే దైవం. ఇంటికి వెళితే ఇవన్నీ మర్చిపోతా. ఇంటి పనుల్లో బిజీ అయిపోతాను. ఇది ఒక వృత్తిగా ఎంచుకున్నప్పుడు శవాల మధ్య ఉంటున్నామనే భయాలు ఉండకూడదు. మెడిసిన్‌లో ప్రొఫెసర్ల ముందు ‘వైవా’ ఇవ్వాల్సి వచ్చినప్పుడు బాడీ అనాటమీ గురించి ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వాలి. అప్పుడు ఇంటికే ఎముకలు, పుర్రె తెచ్చి అభ్యాసన చేసిన రోజులున్నా యి. పదకొండేళ్ల పాటు గ్రామీణ ప్రాంతంలో డాక్టర్‌గా విధుల్లో ఉండి నాలుగేళ్ల క్రితం ఈ డిపార్ట్‌మెంట్‌కి వచ్చాను. ఈ వృత్తి పట్ల అందరిలోనూ అవగాహన పెరుగుతోంది. ఫలితంగా ఈ డిపార్ట్‌మెంట్‌లో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది.
– డాక్టర్ వాణిశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్
ఇదేనా ఫైనల్ జర్నీ.. ఇంత దానికా అంత తాపత్రయం అని ఎప్పుడైనా అనిపించిందా?
చాలా సందర్భాల్లో.. కొన్నేళ్ల క్రితం ఓ రౌడీ గొడవల్లో చనిపోయాడు. ఉన్నప్పుడు వాడి హడావిడి చూసినవాడినే. వాడి శవం బల్లమీదకొచ్చింది. ఇంత దానికి ఎందుకురా బాబూ అంతమందితో అన్ని గొడవలు పెట్టుకున్నావ్. ఎందరో అమాయకులను ముంచావ్! చివరకు ఏం సాధించావు అనుకున్నాను. ఇక్కడకొచ్చాక కులం, మతం, రంగు, రూపు .. ఏమీ ఉండవు. అంతా ఒకటే! ఆధారాల కోసం శవం.
మీరు ఈ రూమ్‌లోకి రాగానే ముందు బల్లమీద శవాన్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది?
ముందు ఎలా చనిపోయాడనే థాట్ ఉంటుంది. ఆడ–మగ అనే తేడా ఒకసారి ఈ రూమ్‌లోకి వచ్చాక ఉండదు. చిన్నపిల్లల శవాలు వచ్చినప్పుడు మాత్రం కొన్ని క్షణాలు ‘అరెరె’ అనిపిస్తుంది. ఎలా చనిపోయాడనేది ప్రాధమిక ఆధారాలతో పోలీసులు పంచనామా ఇస్తారు. వాళ్లు రాసిందానికి, శవం మీద కనిపించిన దానికి పోల్చి చూస్తాం. శవం క్రైమకి ఎవిడెన్స్ ఇచ్చే ఒక ఎలిమెంట్‌గా మాత్రమే అనిపిస్తుంది. శవాన్ని చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూస్తాం. బాగా నీటుగా కడుగుతాం, గాయలు జాగ్రత్తగా పరిశీలిస్తాం. పని పూర్తయ్యాక జాగ్రత్తగా ప్యాక్ చేసి, పక్కన పెట్టిస్తాం.
ఇలాంటివి రెగ్యులర్‌గా చేస్తుంటే జీవితమ్మీద విరక్తి పుట్టి దేవుడా! అనుకున్న సందర్భం...
రోజూ చేస్తే అలాగే అనిపించేదేమో! కానీ, ఒక రోజు మార్చూరీ డ్యూటీ మరో రోజు కోర్టు పనులు ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంత గ్యాప్ వస్తుంది. కానీ, ఇక్కడ పనిచేసే తోటీ(వర్కర్స్)ల పనే ధారుణంగా ఉంటుంది. వాళ్లు శవాల ఫ్లూయిడ్స్ అన్నీ కడగాలి. కట్ చేయాలి. ఒకరో ఇద్దరో తప్ప మిగతావాళ్లంతా ఫ్యామిలీకి దూరమైపోయినవారే! ఇంటికెళితే శవాల కంపు అని పెళ్లాం, పిల్లలు అసహ్యించుకుంటే ఇక వారికి జీవితమే ఉండదు.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి
Comments
Please login to add a commentAdd a comment