గగన్ సతీశ్... గ్రేట్ ఫీట్!
ఒంటిని విల్లులా వంచి చేసేది జిమ్నాస్టిక్స్. దానికి స్కేటింగును మిక్స్‌చేసి, ఏకంగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు ఓ ఆరేళ్ల బాలుడు. అతడు ఏ విదేశీయుడో కాదు. మన భారతీయ పిల్లాడు. బెంగళూరుకు చెందిన బుడ్డోడు.
శరీరాన్ని నేలకు వంచి... శక్తిని క్రోడీకరించుకొని... ఐదే సెంటీమీటర్ల గ్యాప్‌తో... కేవలం 29 సెకనుల్లో 230 అడుగుల దూరం దూసుకెళ్లాడు... అది కూడా పార్క్‌చేసి ఉన్న 39 కార్ల కింద నుంచి! చూసే వాళ్లలో ఆశ్చర్యం. ఆ వెనువెంటనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం! ఈ ఘనతను సాధించిన చిన్నారి గగన్ సతీష్!
గగన్ శరీరం ఒక ధనుస్సులాంటిదని మొదట్లోనే గ్రహించారట తల్లిండ్రులు హేమ, రాజన్నలు. అందుకే తనను ఏదైనా క్రీడలో ప్రావీణ్యుడిని చేద్దామని భావించారట! ‘తనకు సరైన కోచింగ్ ఇచ్చి క్రీడాకారుడిని చేద్దామని అనుకొన్నాం. అందుకు తగ్గట్టుగా మూడేళ్ల వయసు నుంచే సతీశ్ స్కేటింగ్ మీద ఆసక్తిని పెంచుకొన్నాడు. దాంతో అందులోనే శిక్షణనిప్పించాం. రోలర్‌స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఎన్నోసార్లు గాయపడ్డాడు. అయినా బెదిరేవాడు కాదు. మానేస్తాను అనేవాడు కూడా కాదు. పట్టుదలతో సాధించాడు’ అంటారా తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో.
మామూలుగా చిన్నపిల్లలో ఉండే బద్దకం, మారాం చేయడం వంటి లక్షణాలు గగన్‌లో మచ్చుకు కూడా కనిపించవు. ఉదయం ఐదింటికే లేస్తాడు. తండ్రితో కలిసి హుషారుగా కోచింగ్ క్లాసులకు వెళ్లిపోతాడు. కొన్ని గంటలసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత అట్నుంచటే స్కూల్‌కు వెళ్లిపోతాడు. సాయంత్రం బడి ముగిసాక మళ్లీ ప్రాక్టీస్ మొదలు. తన ఆసక్తి చూస్తే ముచ్చటేస్తుందంటూ ఉంటారు గగన్ కోచ్ యతీశ్‌గౌడ!
39 వాహనాల కిందనుంచి స్కేటింగ్ చేయడాన్ని గొప్ప విజయంగా భావించడం లేదు గగన్. వంద కార్ల కింద నుంచి వెళ్తే, అప్పుడు సంతోష పడతానంటున్నాడు. అంతే కాదు... ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని ముద్దు ముద్దు మాటలతో చెబుతున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి బలమైన లక్ష్యాలను ఏర్పరచుకున్నవాడు... ఆ లక్ష్యాన్ని సాధించకుండా వదిలిపెడతాడా!