
ఆటల్లో గాట్లు, కట్లు ఉండనే ఉంటాయి. ఆటల్లో కాకుండా కూడా ఉంటాయిగా!! అదే చిత్రం. గేమ్స్‌లో వచ్చేవాటికి, గేమ్స్‌లో రానివాటికి కూడా గేమ్స్ నేమ్స్ పెట్టారు. ఆసక్తికరమైన ఆ జబ్బుల పేర్లు... మనకు ఎవరికైనా అలాంటివి వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఈ నేమ్స్, గేమ్స్!
గోల్ఫర్స్ ఎల్బో: దీనిపేరు ‘గోల్ఫర్స్ ఎల్బో’ అయినప్పటికీ గోల్ఫ్ ఆడనివారిలోనూ ఈ సమస్య రావచ్చు. టెన్నిస్ ఆడేవారిలోనూ, క్రికెట్‌లో బేస్‌బాల్ ఆటలో బౌలింగ్ చేసేవారిలోనూ ఈ సమస్య కనిపించవచ్చు. అందుకే కొన్నిసార్లు దీన్ని ‘పిచ్చర్స్ ఎల్బో’ అని కూడా పిలుస్తారు. ఈ సమస్యలో మోచేతి ప్రాంతంలో నొప్పితో పాటు మంట, వాపు (ఇన్‌ఫ్లమేషన్) కూడా కనిపించవచ్చు. వైద్య పరిభాషలో దీన్ని ‘మీడియల్ ఎపికాండిలైటిస్’ అంటారు. వాహనం నడిపే కారణాలతో మాటిమాటికీ పిడికిలి బిగించి పనిచేయడం, చేతిని ఊపుతూ పనిచేయాల్సి రావడం వల్ల టెండన్ దెబ్బతిని కూడా ఈ సమస్య రావచ్చు.
స్క్రూడ్రైవర్లు వాడటం, సుత్తితో కొట్టడం, పెయింటింగ్ చేసేవారిలోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. మన గోల్ఫర్స్ ఎల్బోను టెన్నిస్ ఎల్బో తాలుకు కజిన్‌గా పేర్కొనవచ్చు. అయితే దీనికి ‘టెన్నిస్ ఎల్బో’ అంతటి ప్రాచుర్యం లేదు. ఈ రెండూ మోచేతిలోని టెండన్ల ఇన్ఫెక్షన్ సమస్యతో వచ్చేవే. తేడా అల్లా... టెన్నిస్ ఎల్బోలో మోచేతి వెలుపలి (అంటే బయటివైపు) టెండన్లతో సమస్య వస్తుంది. అదే గోల్ఫర్స్ ఎల్బోలో లోపలివైపు టెండన్లతో వస్తుంది. తగినంత విశ్రాంతి, ఐస్ అద్దడం, కాస్త చేతులు పైకి ఉంచి పడుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం ఉంటుంది. అవసరాన్ని బట్టి నొప్పి నివారణ మందులు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. కొంతమందిలో స్టెరాయిడ్స్ కూడా అవసరమే అయినా అవి డాక్టర్ విచక్షణ మేరకు వాడాలి.
టెన్నిస్ ఎల్బో: ‘టెన్నిస్ ఎల్బో’ టెన్నిస్ ఆడేవారితో పాటు చేతితో చాలా ఎక్కువగా పనిచేసేవారిలో ఎక్కువ. వైద్య పరిభాషలో దీన్ని లాటరల్ ఎపికాండిలైటిస్ అంటారు. చెట్లు కొట్టడం వంటివి చేస్తూ ఉండటం, కార్పెంటరీ, మాంసం కొడుతుండే వారిలోనూ ఈ సమస్య వస్తుంటుంది. ఒక్కోసారి గట్టిగా షేక్‌హ్యాండ్ ఇవ్వడం వల్ల కూడా టెన్నిస్ ఎల్బో రావచ్చు. (అందుకే విపరీతంగా, గట్టిగా ఊపుతూ షేక్‌హ్యాండ్ ఇవ్వడం అంత సరికాదు). కొన్ని రకాల వ్యాయామాలు, నొప్పి నివారణ మందులతో దీన్ని నయం చేయవచ్చు.
జంపర్స్ నీ : మోకాలిచిప్పకు సంబంధించి తీవ్రమైన నొప్పి వచ్చే పరిస్థితి ఇది. వైద్యపరిభాషలో దీన్ని పటెల్లార్ టెండనైటిస్ అంటారు. సాధారణంగా అథ్లెట్లు ఎదుర్కొనే వేదనల్లో ఇది ఒకటి. తరచూ దుముకుతూ ఉండే సమయంలో ఈ టెండన్ మీద చాలా ఎక్కువ బరువు పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. బాస్కెట్‌బాల్, వాలీబాల్, హైజంప్, లాంగ్ జంప్‌లో ఎగిరి గెంతినప్పుడు కాలిమీద పడ్డ బరువు కారణంగా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. గట్టి నేల (హార్డర్ సర్ఫేస్) మీద స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేవారిలో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువే.
రన్నర్స్ నీ : కేవలం పరుగులు పెట్టే క్రీడాకారులకే గాక... మోకాళ్లను చాలా ఎక్కువగా వంచే పనుల్లో ఉండేవారికీ ఇది వచ్చే అవకాశం ఉంది. వాకింగ్, బైక్‌లు నడపడం, గెంతడం వంటివి చేసేవారిలోనూ ఇది కనిపించవచ్చు. దీన్ని వైద్య పరిభాషలో ‘పటెల్లోఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్’ అని కూడా అంటారు. ఇది నిర్దిష్టంగా ఏదైనా గాయం కావడం వల్ల కాకుండా మోకాలి దగ్గర నొప్పితో కనిపిస్తుంది.
షిన్ స్ప్లింట్ : మోకాలి కింది భాగం నుంచి పాదం మొదలయ్యే వరకు ఉండే భాగాన్ని షిన్ అంటారు. ఏదైనా కారణాల వల్ల ఆ భాగంలో వాపు, ఒక్కోసారి వెంట్రుకవాసి అంతటి పగులు (హెయిల్‌లైన్ ఫ్రాక్చర్), వెన్నెముక కింది భాగం బలహీనంగా ఉండటం వంటి అనేక అంశాల వల్ల ఈ భాగంలో నొప్పి వస్తుంది. దీన్నే షిన్ స్పి›్లంట్ అంటారు. రన్నింగ్ చేసే క్రీడాకారుల్లో ఇది చాలా సాధారణమైన సమస్య. ఒక్కోసారి తీవ్రమైన వ్యాయామం చేసేవారిలోనూ ఇది కనిపించవచ్చు. విపరీతంగా నృత్యం చేసే డాన్సర్లలోనూ ఈ సమస్య వస్తుంటుంది.
గేమ్‌కీపర్స్ థంబ్ (స్కీయర్స్ థంబ్ ) : మన బొటనవేలిని మిగతా వేళ్లతో కలిపి ఉండే మృదువైన కణజాలం దెబ్బతినడం వల్ల వచ్చే సమస్యను స్కీయర్స్ థంబ్ అని అంటారు. అంటే లిగమెంట్స్ అని పిలిచే అక్కడి మృదుకణజాలం గాయపడటం వల్ల ఈ సమస్య వస్తుందన్న మాట. సాధారణం స్కీయింగ్ చేసేవారిలో స్కీయింగ్‌రాడ్ పట్టుకున్నప్పుడు బొటనవేలు గాయపడటం వల్ల ఈ సమస్య రావచ్చు. అయితే ఆటల్లో గానీ లేదా ఇతరత్రా గానీ బొటనవేలికి బలమైన గాయం తగిలి, అది మిగతా వేళ్ల నుంచి దూరం జరిగేలా బలమైన విఘాతం కలిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. సాధారణంగా ఆటోమొబైల్ యాక్సిడెంట్స్‌లో ఇలా బొటనవేలికి దెబ్బతగిలే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు క్రీడాకారుడి పేరు ఉన్నప్పటికీ ఈ కింద పేర్కొన్నది ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో వచ్చే సమస్య.
అథ్లెట్స్ ఫుట్ : ఇది ఒకరకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్ని వైద్య పరిభాషలో టీనియా పెడిస్ అంటారు. ఇది పాదంలోని బొటనవేలు... ఇతర వేళ్ల మధ్య రావచ్చు. చేతి వేళ్లకూ సోకవచ్చు. అయితే తరచూ కాలివేళ్ల మధ్యే కనిపిస్తుంటుంది. ఇది ఏమంత తీవ్రమైన జబ్బు కాదు. అయితే తగ్గడానికి మొరాయిస్తుంది. అంత తేలిగ్గా తగ్గక బాధపెడుతూ ఉంటుంది. డయాబెటిస్ లేదా తక్కువ వ్యాధి నిరోధకశక్తి ఉన్నవారిలో ఇది మరింత బాధిస్తుంది.
ఇటీవల మన క్రీడాకారిణులు సానియా, సైనా నెహ్వాల్, సింధూల సక్సెస్‌లతో ఆటల పట్ల ఆసక్తి, గ్రౌండ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఆరోగ్యానికి ఆటలు ఎంత సురక్షితంగా ఆడుకోవడమూ అంతే అవసరం.
జాగ్రత్తలు– చికిత్స
ఇక్కడ పేర్కొన్న దాదాపు అన్ని సమస్యలకు మొదట తగినంత విశ్రాంతి, ఐసు ముక్కలతో అద్దడం, అవసరాన్ని బట్టి ఎలాస్టిక్ బ్యాండేజ్‌తో తగిన సపోర్టు ఇవ్వడం, ఫిజియోథెరపీ లాంటి వ్యాయాయ ప్రక్రియల్ని అనుసరించడం వంటివాటితో ఉపశమనం కలుగుతుంది. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడాలి. చాలా అరుదుగానే కొన్ని సమస్యలకు శస్త్ర చికిత్స అవసరం కావచ్చు.
క్రీడల పేరు కలిగి ఉన్న మానసిక సమస్యలు
ఫీమేల్ అథ్లెట్స్ ట్రెయిడ్ : ఇది ఒక ‘ఈటింగ్ డిజార్డర్’. తాము మరింత సన్నగా ఉంటే రన్నింగ్ వంటి క్రీడల్లో ఇంకా బాగా చురుగ్గా రాణించగలమనే అభిప్రాయంతో కొందరు క్రీడాకారులు తాము తీసుకుంటున్న భోజనం, పోషకాలతో కూడిన ఆహారం పరిమాణాన్ని తగ్గిస్తారు. దాని వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుందని భావించి లేనిపోని అనర్థాలు తెచ్చుకుంటారు.
ఇలా రన్నింగ్ క్రీడాకారుణులు మాత్రమే కాకుండా ఇదే పని కొంతమంది టీన్స్‌లో ఉన్న యువతులూ చేస్తారు. అయితే సాధారణంగా ఇది క్రీడాకారిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే ఈ పేరు. ఇలా సరిగా తినకపోవడం, అదేపనిగా వ్యాయామాన్ని మాత్రం కొనసాగించడం ఫలితంగా వారు ఒక తిండికి సంబంధించిన ఒక రుగ్మత (ఈటింగ్ డిజార్డర్)ను ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిపేరే ఫీమేల్ అథ్లెట్ ట్రెయిడ్.
అనొరెక్సియా అథ్లెటికా : దీన్ని ‘హైపర్ జిమ్నాషియా’ అని కూడా అంటారు. ఇది కూడా ఒక రకమైన ఈటింగ్ డిజార్డర్. తమ ఫిగర్ మీద చాలా ఎక్కువగా శ్రద్ధ పెడుతూ, చాలా తక్కువగా తింటూ, చాలా ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల తాము ఫిట్‌గా ఉంటామన్న భావనతో అతిగా వ్యాయామం చేసే రుగ్మత ఇది. ఈ రుగ్మత ఉన్నవారు తమకు ఆహారం మీద, వ్యాయామం మీద ఉన్నంత నియంత్రణ జీవితంలోని మిగతా అంశాల మీద లేదని భావిస్తుంటారు.
అయితే వాస్తవానికి, విచిత్రంగా వారికి తమ వ్యాయామం, ఆహారం మీదే నియంత్రణ ఉండదు. ఒకసారి ఈ భావన మొదలైన తర్వాత వారు అదేపనిగా వ్యాయామం చేస్తూ, (ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే భావనతో) అదేపనిగా తింటూ ఉంటారు. ఇది బయటపడలేని ఒక వ్యసనంగా మారు తుంది. మానసిక వ్యాధిగా పరిణమించే ఇది ఒక పట్టాన తగ్గదు. సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్, అవసరాన్ని బట్టి బిహేవియరల్ థెరపీ వంటి ప్రక్రియలతో ఈ మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు.
– డాక్టర్ ప్రవీణ్‌రావు, సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment