ఉచిత శిక్షణ కోసం గెలిచేవాడిని! | 6 medals at the World Police Games | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణ కోసం గెలిచేవాడిని!

Published Tue, Aug 6 2013 12:57 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

ఉచిత శిక్షణ కోసం గెలిచేవాడిని! - Sakshi

ఉచిత శిక్షణ కోసం గెలిచేవాడిని!

ప్రపంచ క్రీడాపటంపై మరోసారి తెలుగు వెలుగులు... ఆర్చరీలో కడప కుర్రాడు చరణ్ రెడ్డి మూడు పతకాలతో సంచలనం సృష్టిస్తే.. ప్రపంచంలోని పోలీసుల మధ్య ప్రతిష్టాత్మకంగా సాగే పోలీస్ క్రీడల్లో విజయవాడకు చెందిన తులసీ చైతన్య ఏకంగా ఆరు పతకాలతో అదరగొట్టాడు.
 
‘చిన్నప్పటినుంచే స్విమ్మింగ్ అంటే అమితాసక్తి. వేసవి శిబిరంలో రాణిస్తే ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. దాంతో ప్రతి ఏటా పట్టుదలగా ఆడి గెలిచేవాడిని. అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది. కానిస్టేబుల్ కుమారుడినైన నాకు పోలీస్ శాఖలోనే తగిన గుర్తింపు దక్కింది. తాజా విజయాలు మా శాఖకు అంకితం’ అని ఏపీ స్విమ్మర్ తులసీ చైతన్య వ్యాఖ్యానించాడు. బెల్‌ఫాస్ట్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పోలీస్ గేమ్స్‌లో చైతన్య 6 పతకాలు (3 స్వర్ణాలు, 3 రజతాలు) గెలుచుకోవడం విశేషం. 
 
స్కూల్ స్థాయి నుంచే... 
విజయవాడలో పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నప్పుడు చైతన్యకు స్విమ్మింగ్‌పై ఆసక్తి కలిగింది. అప్పుడే స్కూల్ నేషనల్స్‌లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ‘శాప్’ అకాడమీలో చేరడంతో చైతన్య ఈత మెరుగుపడింది. ఆ తర్వాత 2003 నుంచి 2006 వరకు వివిధ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో నాగార్జున విశ్వ విద్యాలయం తరఫున స్వర్ణం నెగ్గాడు. రైల్వేస్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా ఎంపికైనా పోలీస్ ఉద్యోగంపై ఆసక్తితో కొన్నాళ్లకే దానిని చైతన్య వదిలేశాడు. స్పోర్ట్స్‌మన్‌గా విజయాలతో పాటు చక్కటి ఫిట్‌నెస్ రికార్డుతో అతను వెంటనే ఎంపికయ్యాడు.
 
పోలీసుగా విజయాలు...
పోలీస్ శాఖలో ఉద్యోగిగా ఉన్న చైతన్యకు తొలి సారి ఆలిండియా పోలీస్ అక్వాటిక్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. అతని ప్రతిభను గుర్తించిన అడిషనల్ డీజీ (స్పోర్ట్స్) రాజీవ్ త్రివేది ఈ ఎంపిక చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ చైతన్య ఒక స్వర్ణం, మరో రజతం నెగ్గాడు. దాంతో త్రివేది అతడిని మరింతగా ప్రోత్సహించారు. వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ కోసం బెంగళూరు పంపించారు. అక్కడ ప్రముఖ కోచ్ ప్రదీప్ కుమార్ వద్ద శిక్షణ పొందిన చైతన్య వరల్డ్ గేమ్స్‌లో అద్భుత విజయాలు అందుకున్నాడు
 . ‘అమెరికా, కెనడా, ఆస్ట్రేలియావంటి దేశాలనుంచి పోటీని తట్టుకొని ఇన్ని పతకాలు సాధించడం నమ్మలేకపోతున్నాను. నా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. త్రివేదిగారు ఎంతో ప్రోత్సహించారు. ఈ విజయాలు మా పోలీస్ శాఖకు అంకితం’ అని చైతన్య అన్నాడు. భవిష్యత్తులో స్విమ్మింగ్‌లో మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైతన్య వెల్లడించాడు. అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు హాజరైన తులసీ చైతన్య కోసం రాష్ట్ర హోంశాఖ రూ.1.76 లక్షలు సోమవారం విడుదలచేసింది.  
 
 ‘త ఆరేళ్లుగా జూనియర్ స్థాయిలో పలు విజయాలు సాధించినా... జాతీయ స్థాయి సీనియర్ విభాగంలో పతకం కోసం శ్రమించాను. అయితే అది దక్కకపోయినా ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ పతకం సాధించడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి అన్నాడు. ఇటీవల మంగోలియాలో జరిగిన రెండో ఆసియా గ్రాండ్ ప్రి ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో చరణ్ మొత్తం 3 పతకాలు (స్వర్ణం, రజతం, కాంస్యం) గెలుచుకున్నాడు. 
 
రాష్ట్రానికి చెందిన రితుల్ ఛటర్జీ, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, జ్యోతి సురేఖ ఇప్పటికే అంతర్జాతీయ ఆర్చరీలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించగా తాజాగా చరణ్ ఆ జాబితాలో చేరాడు. మారిన చేయి!: సాధారణంగా ఆర్చరీలో ఎక్కువ మంది కుడి చేతి వాటంవారే కనిపిస్తారు. అయితే చరణ్‌ది భిన్నమైన శైలి. మామూలుగా కుడి చేతి వాటమే అయినా ఆర్చరీలో మాత్రం అతనిది ఎడమ చేతి వాటమే. కుడి కంటితో పోలిస్తే అతడి ఎడమ కన్ను దృష్టి బలంగా ఉండటమే అందుకు కారణం. ఈ విషయాన్ని గుర్తించిన కోచ్‌లు అతడిని అదే తరహాలో ప్రోత్సహించారు.
 
‘దీని వల్ల నేను సాధారణ ఎక్విప్‌మెంట్ వాడటంలో ఇబ్బంది పడ్డాను. పైగా స్పోర్ట్స్ స్కూల్‌లో ఎక్కువగా రికర్వ్ విభాగం విల్లులే ఉన్నాయి. దాంతో నా సొంత డబ్బులు వెచ్చించి నాకు అనుకూలమైన విల్లును కొనాల్సి వచ్చింది’ అని ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చరణ్ రెడ్డి వెల్లడించాడు. స్పోర్ట్స్ స్కూల్‌తోనే మొదలు...: వైఎస్సార్ కడపకు చెందిన చరణ్ రెడ్డిది సాధారణ కుటుంబ నేపథ్యం. తండ్రి ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నారు. 2003లో అతను హకీంపేటలోని ఏపీ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యాడు. మూడేళ్ల ప్రాథమిక శిక్షణ అనంతరం ఆర్చరీ క్రీడను ఎంచుకున్న అతను కాంపౌండ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 25కు పైగా పతకాలు గెలుచుకున్నాడు.
 
గత ఏడాది జార్ఖండ్‌లో టీమ్ చాంపియన్‌షిప్ స్వర్ణం నెగ్గిన ఏపీ జట్టులో అతను సభ్యుడు. స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి నర్సయ్య, కోచ్ రవిశంకర్‌ల ప్రోత్సాహంతో అతను మరింత పదును తేలాడు. మంగోలియా గ్రాండ్‌ప్రి కోసం జరిగిన ఇండియా టీమ్ సెలక్షన్స్‌లో టాపర్‌గా నిలిచిన చరణ్ ఆ ఈవెంట్‌లో సత్తా చాటాడు. ‘మరింత ప్రాక్టీస్ చేసి నిలకడగా ఆడాలని భావిస్తున్నాను. ప్రస్తుతం నాతో పాటు కోచ్, కుటుంబ సభ్యులందరిదీ ఒకటే లక్ష్యం. ఆసియా క్రీడల్లో పతకం నెగ్గాలనే పట్టుదలతో ఉన్నాను’ అని చరణ్ రెడ్డి చెప్పాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement