గ్యాస్ట్రో కౌన్సెలింగ్‌ | Gastro Counseling | Sakshi
Sakshi News home page

గ్యాస్ట్రో కౌన్సెలింగ్‌

Published Mon, Oct 15 2018 1:18 AM | Last Updated on Mon, Oct 15 2018 1:18 AM

Gastro Counseling - Sakshi

పాంక్రియాటైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకూ ముప్పు?
నా వయసు 37 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు చాలా నీరసంగా ఉంటోంది. బరువూ తగ్గింది. తరచూ పొత్తి కడుపులో నొప్పి వస్తోంది. దాంతో రక్తపరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు షుగర్‌ ఉన్నట్లు తేలింది. అందుకే ఈ అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయని అనుకున్నాను. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడదామని వెళ్తే, ఆయన కొన్ని ఇతర పరీక్షలు చేసి, నేను అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌తో బాధపడుతున్నానని, వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రమాదమని చెప్పారు. నేను అప్పుడప్పుడూ మద్యం కూడా తీసుకుంటూ ఉంటాను.  అందుకే ఈ వ్యాధి వచ్చిందా? ఇదేమైనా డేంజరా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – ఎమ్‌.ఆర్‌. ప్రసాద్, నిజామాబాద్‌
పాంక్రియాటైటిస్‌ అనేది తీవ్రమైన వ్యాధి కాదు. కానీ దీర్ఘకాలం దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. పాంక్రియాస్‌ (క్లోమ గ్రంథి) చిన్నపేగుకు పక్కనే ఉండి జీర్ణప్రక్రియలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఇందులో ఉండే కణజాలాలు గ్లూకగాన్, ఇన్సులిన్, సొమటోస్టాటిన్‌ అనే హార్మోన్లను రక్తంలోకి విడుదల చేసి దానిని శక్తిగా మారుస్తుంది. డయాబెటిస్‌ నుంచి కూడా ఈ గ్రంథి కాపాడుతుంది. ఈ రసం ఒక గొట్టం ద్వారా వచ్చి చిన్న పేగులో కలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అక్కడ వాపు వస్తుంది. దీన్ని పాంక్రియాటైటిస్‌ అంటారు.

కొన్ని సందర్భాల్లో క్లోమరసంలో ప్రొటీన్ల పరిమాణం ఎక్కువై ఉండలుగా ఏర్పడి అవి గొట్టంలో అడ్డుపడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు మితిమీరిన మద్యపానం, జన్యువుల ప్రభావం, జంక్‌ఫుడ్‌ కూడా ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. అయితే ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొన్నేళ్ల తర్వాత బయటపడతాయి. మీకు ఈ వ్యాధి చాలాకాలం నుంచి ఉండటం వల్ల నీరసం, నిస్సత్తువతో పాటు బరువు తగ్గడం లాంటి లక్షణాలతో బాధపడ్డారు. మీరు వెంటనే మద్యం పూర్తిగా మానేయండి. దీనిని మొదటిదశలోనే కనిపెట్టకపోతే వ్యాధి ముదిరి ప్రమాదకరంగా పరిణమిస్తుంది.

మీకు రక్తపరీక్షలు, సీరమ్‌ లైపేజ్‌ పరీక్షలు, సీటీ స్కాన్‌ లేదా ఎమ్మారై స్కాన్‌ లాంటివి చేయాల్సి ఉంటుంది. క్లోమం ఏ మేరకు దెబ్బతిన్నదో నిర్ధారణ చేసి మీకు చికిత్స అందించాలి. లేకపోతే ‘అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌’ కాస్తా ‘క్రానిక్‌ పాంక్రియాటైటిస్‌’గా మారే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి చెడిపోయే అవకాశాలున్నాయి. కొన్ని సందర్భాలలో మందులతో ఈ జబ్బు తగ్గనప్పుడు ఇప్పుడు అందివచ్చిన అత్యాధునిక చికిత్స సదుపాయం ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీ/కీహోల్‌ సర్జరీ విధానం ద్వారా ఒకవేళ క్లోమగ్రంథి చెడిపోయి ఉంటే దాన్ని తొలగించవచ్చు. ఈ శస్త్రచికిత్స వల్ల రోగి హాస్పిటల్‌లో ఉండే వ్యవధి తగ్గడంతో త్వరగానే మీరు మీ సాధారణ వృత్తి వ్యాపకాలు కొన సాగించవచ్చు.


లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అవసరమా?
మా నాన్నకు 51 ఏళ్లు. చాలా ఏళ్లుగా ఆయనకు మద్యపానం అలవాటు ఉంది. ఈ మధ్య కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతుంటే వైద్య పరీక్షలు చేయించాం. మద్యపానం అలవాటు వల్ల లివర్‌ బాగా పాడైపోయిందని డాక్టర్‌ చెప్పారు. లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ అవసరముంటుందా? దయచేసి తెలపండి. – డి. సుందర్, భీమవరం
మద్యపానం వల్ల శరీరంలో ముందుగా పాడయ్యేది లివరే. ఎప్పుడన్నా ఒకసారి, అదీ చాలా మితంగా తాగితే తాగొచ్చుగానీ అది రోజువారీ అలవాటుగా మారితే మాత్రం లివర్‌ దెబ్బతింటుందని గుర్తించడం చాలా అవసరం. మీ నాన్న విషయానికి వస్తే ముందుగా ఆయన లివర్‌ ఏ మేరకు దెబ్బతిన్నదో చూడాలి. కామెర్లు, ట్యూమర్స్‌ (గడ్డలు), సిర్రోసిస్, హెపటైటిస్‌ వంటి కారణాలతో లివర్‌ దెబ్బతింటుంది. లివర్‌ పూర్తిగా గట్టిపడిపోయి రాయిలా మారిపోయిన స్థితిలో దానిని క్రానిక్‌ లివర్‌ డిసీజ్‌ అంటారు.

లివర్‌ పూర్తిగా నాశనమైపోయి పనిచేయనప్పుడు మాత్రమే లివర్‌ మార్పిడి సర్జరీ అనివార్యం అవుతుంది. అయితే దానికంటే ముందుగా దెబ్బతిన్న లివర్‌ను కాపాడేందుకు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మద్యపానం వల్ల లివర్‌ దెబ్బతిన్న కేసులలో ముందుగా ఓ ఆర్నెల్లపాటు ఆ పేషెంట్‌ను మద్యానికి దూరంగా ఉంచి చికిత్స చేయడం ద్వారా లివర్‌ను కాపాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ నాన్న విషయంలో కూడా అది సాధ్యమే. ముందుగా ఆయనచేత వెంటనే మద్యం మాన్పించి దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుకు చూపించి చికిత్స ప్రారంభించండి.


పిత్తాశయంలో రాళ్లు... సర్జరీ తప్పదా?
నా వయసు 45 ఏళ్లు. నేను ఇటీవలే రొటీన్‌గా చేయించుకున్న వైద్య పరీక్షలలో గాల్‌బ్లాడర్‌ (పిత్తాశయం)లో రాళ్లు ఉన్నట్లు బయటపడింది. కానీ నాకు కడుపునొప్పి వంటి ఎలాంటి లక్షణాలూ బయటికి కనిపించడం లేదు. ఇప్పుడు రాళ్లను తొలగించడానికి సర్జరీనే ఉత్తమ పరిష్కారం అని డాక్టర్‌ అంటున్నారు. మీ సలహా ఏమిటి?
– డి. రాగిణి, వరంగల్‌
గాల్‌బ్లాడర్‌ అనేది లివర్‌కు అనుసంధానమై సంచి మాదిరిగా ఉండే నిర్మాణం. ఇది పైత్యరసాన్ని నిల్వ చేస్తుంది. రకరకాల కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడతాయి. మీకు కూడా ఏవో కారణాల వల్ల గాల్‌బ్లాడర్‌లో రాళ్లు వచ్చి ఉండవచ్చు. అయితే మీ విషయం తీసుకుంటే మీకు కడుపులో ఎలాంటి నొప్పిలేదు కాబట్టి వీటిని లక్షణాలు కనిపించని గాల్‌స్టోన్స్‌గా చెప్పవచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడిన జబ్బుతో బాధపడే కొందరు పేషెంట్లకు ఉదరం కుడివైపు ఎగువభాగాన తీవ్రమైన నొప్పివస్తుంది.

అలాగే కామెర్లు, తీవ్రమైన పాంక్రియాటిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సందర్భాల్లో కీహోల్‌ సర్జరీ ద్వారా మొత్తం గాల్‌బ్లాడర్‌ను తీసివేయాలని మేము సూచిస్తాం. మీ విషయానికి వస్తే, మీకు కడుపునొప్పి లాంటి లక్షనాలే ఏవీ కనిపించనందున మీకు ఇప్పుడైతే ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు తీవ్రమైన కడుపునొప్పి లేదా కామెర్లు వంటి పరిణామాలకు గురైతే అప్పుడు సర్జరీ కోసం స్పెషలిస్టు డాక్టర్‌ను సంప్రదించవచ్చు. పిత్తాశయంలో రాళ్లకు సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించని పేషెంట్లలో కేవలం మూడింట ఒక వంతు మందికి మాత్రమే తర్వాతికాలంలో సర్జరీ అవసరమయ్యే అవకాశం ఉంటుంది.


– డాక్టర్‌ జి. పార్థసారథి, సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ బేరియాట్రిక్‌ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement