గ్యాస్ట్రో కౌన్సెలింగ్‌ | Gastro Counseling | Sakshi
Sakshi News home page

గ్యాస్ట్రో కౌన్సెలింగ్‌

Published Mon, Nov 5 2018 1:17 AM | Last Updated on Mon, Nov 5 2018 1:17 AM

Gastro Counseling - Sakshi

లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరమంటున్నారు... సలహా ఇవ్వండి
నా వయసు 46 ఏళ్లు. నాకు గత 20 ఏళ్లుగా మద్యం అలవాటు ఉంది. రెండేళ్ల కిందట తీవ్రమైన అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్చారు. లివర్‌ దెబ్బతిన్నదనీ, తాగడం మానేయమని చెప్పారు. ఇంకా కొనసాగితే లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సి వస్తుందని చెప్పారు. తగ్గించాను గానీ మద్యం పూర్తిగా మానలేకపోయాను. ఇటీవల నీరసంగా ఉండటంతో మళ్లీ ఆసుపలత్రిలో చూపించుకున్నాను. మితిమీరిన మద్యం ప్రభావం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నదనీ, కాలేయ మార్పిడి చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. – పి.ఎన్‌. నాథ్, కోదాడ

కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి సరిచేసుకోవడానికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా తొలిదశలో యథావిధిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో అది చాలారకాల వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. లివర్‌ సిర్రోసిస్‌ వంటి కొన్ని వ్యాధుల కారణంగా ఆ పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కేసుల్లో కాలేయ క్యాన్సర్‌ ఒకటి. దీని చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం హఠాత్తుగా కుప్పకూలిపోతుంది.

కాలేయ వ్యాధుల చికిత్సకు ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల మందులు, అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దీన్ని మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వీటినే ఏ, బి, సి ‘చైల్డ్‌ పగ్‌ స్టేజెస్‌’ అంటున్నారు. ఏ చైల్డ్‌ స్థాయిలోనే డాక్టర్‌ దగ్గరికి రాగలిగితే మందులతో, మంచి  అలవాట్ల వంటి జీవనశైలి మార్పులతో చికిత్స చేసి మళ్లీ పూర్తిస్థాయి సాధారణ పరిస్థితికి తేవచ్చు. మొదటి రెండు స్థాయిలు అంటే ఏ, బి దశల్లో చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. అయితే బి, సి స్థాయిలకు చేరుకుంటే వ్యాధి తీవ్రతను, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనా వేసి కాలేయ మార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు.

కాలేయ మార్పిడిలో రెండు రకాలు
వ్యాధిగ్రస్తమై పనిచేయలేని స్థితిలో ఉన్న కాలేయాన్ని తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైన మరో కాలేయాన్ని అమర్చడానికి చేసే సర్జరీనే కాలేయ మార్పిడి (లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) అంటారు. ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది... మరణించిన దాత (కెడావరిక్‌ డోనార్‌) దేహం నుంచి సేకరించిన దాన్ని అవసరమైన వారికి అమర్చడం.

బ్రెయిన్‌డెడ్‌కు గురై వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి దేహం నుంచి సేకరించిన దాన్ని అవసరమైన వారికి అమర్చడం మొదటి పద్ధతి. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్‌ సంస్థలో పేరు నమోదు చేసుకొని తమ వంతు వచ్చేంతవరకు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక రెండో పద్ధతిలో ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తమ కాలేయంలోని కొంత భాగాన్ని ఇవ్వడం ద్వారా రోగి దాన్ని స్వీకరించడం. ఆ తర్వాత రోగి యథావిధిగా తన సాధారణజీవితం గడిపేందుకు అవకాశం దొరుకుతుంది.


- డాక్టర్‌ బాలచంద్రన్‌ మీనన్, సీనియర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెపటాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement