ఛాతీలో మంట...పరిష్కారం?
నాకు చాలా రోజులుగా ఛాతీలో మంట వస్తోంది. మెడికల్ షాపులో అడిగితే ఏదో మందు ఇచ్చారు. అది తాగినప్పుడు మంట తగ్గుతోంది. తర్వాత యథావిధిగా మంట వస్తోంది. పరిష్కారం చెప్పండి. – ఎల్. సుమన్, ఖమ్మం
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే మీరొకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మీ వ్యాధి లక్షణాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అందులో కొన్ని ముఖ్యమైన సూచనలివి...
♦ ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించండి, కాఫీ, టీలను మానేయండి.
♦ పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి.
♦ మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే అది తగ్గించుకోండి.
♦ తిన్న వెంటనే నిద్రించకండి.
♦ పడుకునే సమయంలో తలవైపు కాస్తంత ఎత్తుగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
♦ పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ సలహా మేరకు హెచ్–2 బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) మందులు వాడండి.
కాలేయంలో కొవ్వు... ప్రమాదమా?
నా వయసు 67 ఏళ్లు. నాకు డయాబెటిస్, హైబీపీ ఉన్నాయి. ఒకసారి ఉన్నట్లుండి కడుపులో నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. అప్పుడు డాక్టర్‌గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి ‘కాలేయంలో కొవ్వు చేరింద’ని చెప్పారు. కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? – డి. పద్మనాభం, ఒంగోలు
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలోనూ లివర్‌లో కొవ్వు చేరడం సాధారణంగా జరుగుతుంది. కాలేయంలో కొవ్వు ఉన్నంత మాత్రాన పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ కాలేయం పనితీరులో తేడా కనిపిస్తే మాత్రం కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ, బరువును తగ్గించుకుంటే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోయే అవకాశం ఉంది.
కడుపంతా ఉబ్బరంగా ఉంటోంది... ఎందుకిలా?
నా వయసు 29 ఏళ్లు. నేను షిఫ్ట్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ షిఫ్ట్‌లు ఒక పద్ధతి ప్రకారం ఉండవు. కొద్దిరోజులుగా పొట్ట అంతా ఉబ్బరంగా ఉంటోంది. తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కావడం లేదు. వీటితో పాటు కోపం, చిరాకు ఎక్కువగా కలుగుతున్నాయి. శారీరకంగానూ, మానసికంగానూ బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. – డి. నరేంద్రనాథ్, చిట్యాల
మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీరు పెప్టిక్ అల్సర్‌తో గానీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో గానీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో రాయలేదు. చాలావరకు అల్సర్స్‌కు సంబంధించిన వ్యాధి వల్ల కడుపులో నొప్పి రావడం, మంటరావడం జరుగుతుంది.
భోజనం చేసిన తర్వాత నొప్పి ఎక్కువ కావడం గానీ, తక్కువ కావడం గానీ జరుగుతుంది. ఒక్కోసారి కడుపులో అల్సర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ జరిగేలా చూసుకోండి. ఎండోస్కోపీ పరీక్షతో మీ వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ అయితే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది.
- డాక్టర్ భవానీరాజు ,సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment