Gastroenterology counseling
-
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
ఛాతీలో మంట...పరిష్కారం? నాకు చాలా రోజులుగా ఛాతీలో మంట వస్తోంది. మెడికల్ షాపులో అడిగితే ఏదో మందు ఇచ్చారు. అది తాగినప్పుడు మంట తగ్గుతోంది. తర్వాత యథావిధిగా మంట వస్తోంది. పరిష్కారం చెప్పండి. – ఎల్. సుమన్, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీకు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే మీరొకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవడం మంచిది. మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మీ వ్యాధి లక్షణాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అందులో కొన్ని ముఖ్యమైన సూచనలివి... ♦ ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించండి, కాఫీ, టీలను మానేయండి. ♦ పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి. ♦ మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉంటే అది తగ్గించుకోండి. ♦ తిన్న వెంటనే నిద్రించకండి. ♦ పడుకునే సమయంలో తలవైపు కాస్తంత ఎత్తుగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ♦ పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ సలహా మేరకు హెచ్–2 బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) మందులు వాడండి. కాలేయంలో కొవ్వు... ప్రమాదమా? నా వయసు 67 ఏళ్లు. నాకు డయాబెటిస్, హైబీపీ ఉన్నాయి. ఒకసారి ఉన్నట్లుండి కడుపులో నొప్పి వస్తే డాక్టర్‌ను సంప్రదించాను. అప్పుడు డాక్టర్‌గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి ‘కాలేయంలో కొవ్వు చేరింద’ని చెప్పారు. కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? – డి. పద్మనాభం, ఒంగోలు మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలోనూ లివర్‌లో కొవ్వు చేరడం సాధారణంగా జరుగుతుంది. కాలేయంలో కొవ్వు ఉన్నంత మాత్రాన పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ కాలేయం పనితీరులో తేడా కనిపిస్తే మాత్రం కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ, బరువును తగ్గించుకుంటే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోయే అవకాశం ఉంది. కడుపంతా ఉబ్బరంగా ఉంటోంది... ఎందుకిలా? నా వయసు 29 ఏళ్లు. నేను షిఫ్ట్‌లలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ షిఫ్ట్‌లు ఒక పద్ధతి ప్రకారం ఉండవు. కొద్దిరోజులుగా పొట్ట అంతా ఉబ్బరంగా ఉంటోంది. తేన్పులు ఎక్కువగా వస్తున్నాయి. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కావడం లేదు. వీటితో పాటు కోపం, చిరాకు ఎక్కువగా కలుగుతున్నాయి. శారీరకంగానూ, మానసికంగానూ బాధపడుతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. – డి. నరేంద్రనాథ్, చిట్యాల మీరు రాసిన లక్షణాలను బట్టి చూస్తే మీరు పెప్టిక్ అల్సర్‌తో గానీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో గానీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో రాయలేదు. చాలావరకు అల్సర్స్‌కు సంబంధించిన వ్యాధి వల్ల కడుపులో నొప్పి రావడం, మంటరావడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత నొప్పి ఎక్కువ కావడం గానీ, తక్కువ కావడం గానీ జరుగుతుంది. ఒక్కోసారి కడుపులో అల్సర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకొని, వ్యాధి నిర్ధారణ జరిగేలా చూసుకోండి. ఎండోస్కోపీ పరీక్షతో మీ వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ అయితే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. - డాక్టర్ భవానీరాజు ,సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
కడుపునొప్పి – మలవిసర్జన తర్వాత ఉపశమనం... ఎందుకిలా? నా వయసు 37 ఏళ్లు. గత కొన్ని నెలలుగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. మల విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. కొన్నిసార్లు మలబద్ధకం, మరికొన్నిసార్లు విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, నన్నే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు ఇచ్చారు. అవి వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. – సాయి ప్రతాప్, నెల్లూరు మీరు రాసిన లక్షణాలు బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన చెందుతుండే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య తగ్గుతుంది. ఫ్యాటీలివర్ అంటున్నారు... సూచనలివ్వండి నా వయసు 57 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. – ఆంజనేయప్రసాద్, నల్లగొండ లివర్ కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వుపదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ♦ మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ♦ మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి ♦ లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు ♦ తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది ♦ మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. కాలేయం పెరిగింది అంటున్నారు... ఎందుకలా? నా వయసు 35 ఏళ్లు. నేను పడుకునే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – జి. మధుకర్, ఖమ్మం మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ♦ ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. తరచూ ఛాతీలో నొప్పి... నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత రెండున్నర ఏళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. వాళ్లు మాత్రం సమస్య ఏమీ లేదంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? – సంతోష్‌కుమార్, కొత్తగూడెం మీరు పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారా కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. - డాక్టర్ భవానీరాజు ,సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే...
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - రామకృష్ణ, నకిరెకల్ మీకు లివర్ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. దాని రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే, వారు మీకు తగిన చికిత్స అందిస్తారు. నేను నెల రోజుల క్రితం కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌లో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. అయితే నాకు ఎప్పుడూ కడుపు నొప్పి రాలేదు. ఇలా రాళ్లు ఉన్నవారు ఆపరేషన్ చేయించుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి దీనికి చికిత్స ఏమిటో చెప్పండి. - కృష్ణమూర్తి, విజయవాడ మీరు చెప్పిన వివరాల ప్రకారం మీకు ‘ఎసింప్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్’ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి, వ్యాధి లక్షణాలే ఏమీ లేనివారిలో ఏడాదికి వందమందిలో సుమారు ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. మీకు వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఒకసారి మీకు దగ్గర్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిస్తే, వారు మీ కండిషన్‌ను ప్రత్యక్షంగా చూసి తగిన సలహా ఇస్తారు. హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42. కొద్దిరోజులుగా కాళ్లు వాచిపోయి నడుస్తున్నప్పుడు నొప్పిగా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అన్నారు. దీని గురించి నాకు అవగాహన లేదు. దయచేసి నాకు వచ్చిన సమస్య ఏమిటో తెలిపండి. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - రవికుమార్, ఖమ్మం మన కాళ్ల నుంచి రకాన్ని గుండెకు చేరవేసే సిరల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టడం జరిగితే తలెత్తే సమస్య పేరే డీప్ వీన్ థ్రోంబోసిస్ (డీవీటీ). మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకూ ప్రతి అవయవానికీ, ప్రతి కణానికీ రక్త సరఫరా అవసరం. ఈ రక్త సరఫరా కోసం మన దేహమంతటా రక్తనాళాలు ఉంటాయి. వాటిని చెడు రక్తాన్ని గుండెకు చేరవేసే వాటిని సిరలు అంటారు. కాళ్ల నుంచి రక్తాన్ని శుద్ధి కోసం గుండెకు తీసుకెళ్లే సిరల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే అది రక్త ప్రవాహానికి అవరోధంగా మారుతుంది. అలా జరిగినప్పుడు రక్త ప్రసరణ నిలిచిపోయి, ఆ భాగంలో వాపు వస్తుంది. దీనినే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. కొన్ని కారణాలు: నడక కరువై పాదాలకు, కాళ్లకు తగినంత వ్యాయామం లేకపోవడం ఊపిరితిత్తుల క్యాన్సర్ క్లోమగ్రంథి క్యాన్సర్ సుదీర్ఘ విమాన ప్రయాణాలు అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం హార్మోన్ మాత్రలు ఎక్కువగా వాడటం ఏదైనా జబ్బు కారణంగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత సుదీర్ఘకాలం పాటు మంచం మీద ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం ఒంట్లో రక్తం గడ్డ కట్టే తత్వాన్ని పెంచే వ్యాధులలో బాధపడేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇక కొందరు మహిళల్లో గర్భధారణ కూడా దీనికి ఒక కారణం. లక్షణాలు : కాళ్లలో నొప్పి, నడుస్తున్నప్పుడు అసౌకర్యంగా ఉండటం కాళ్లు/చేతులపై చర్మం నల్లబారడం, అవి కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్) కాలు తొడ భాగంలో ఎర్రగా కందిపోయినట్లు, వాచిపోయి... నడవటం కష్టంగా అనిపించడం ప్రమాదాలు: ఈ సమస్యతో ప్రమాదాలు రెండు రకాలుగా వస్తాయి. మొదటిది: సిరల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ కారణంగా సిర మూసుకుపోయి, చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దాంతో నీరు, ఖనిజాలు, లవణాలు అక్కడే నిలిచిపోతాయి. దీనివల్ల కణజాలంపై ఒత్తిడి పెరిగి పక్కనే ఉన్న ధమనులు నొక్కుకుపోయి, మంచి రక్తం సరఫరా తగ్గి, గ్యాంగ్రీన్ ఏర్పడే అవకాశం ఉంది. రెండోది: సిరల్లో ఏర్పడ్డ గడ్డలను తొలగించకపోవడం వల్ల అవి రక్త ప్రసరణలో కలిసి మెల్లగా పైకి పయనించి, గుండెలోకి చేరతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తులోకి వెళ్లి అక్కడ రక్తనాళాల్లో ఇరుక్కుపోయి అత్యంత ప్రమాదకరమైన ‘పల్మనరీ ఎంబాలిజమ్’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా తయారవుతుంది. బీపీ పడిపోతుంది. నివారణ : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అదేపనిగా కూర్చొని ఉండకుండా అప్పుడప్పుడూ నడవడం గర్భిణులు డాక్టర్ల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం పక్షవాతం, క్యాన్సర్‌తో బాధపడుతూ మంచంపై ఉండేవారు ఈ సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. చికిత్స: హోమియోలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది. కిడ్నీ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 63 ఏళ్లు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మాలో ఎవరైనా కిడ్నీని దానం చేద్దాం అనుకున్నాం గానీ బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? - దామోదర్, నల్లగొండ కిడ్నీ వంద శాతం పాడైపోయినప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి ద్వారా రోగిని రక్షిస్తారు. దీనికి దాత అవసరమవుతారు. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీని సేకరించడం) అని రెండు రకాల దాతల నుంచి కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్స్ విషయంలో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అంతేగాక వీరి బ్లడ్ గ్రూపు కిడ్నీని పొందే వ్యక్తి బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయవ్యాధులైన హెపటైటిస్-బి, సి ఉండకూడదు. దాత ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేశాకే కిడ్నీ మార్పిడి చేస్తారు. రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది... స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్... తమ రక్త సంబంధీకులకు కిడ్నీ దానం చేయాలని ఉన్నాగానీ బ్లడ్ గ్రూపులు కలవకపోవడం వల్ల అది సాధ్యపడనప్పుడు... అదే సమస్యతో బాధపడుతున్న వేరొకరి రక్త సంబంధీకులలో బ్లడ్ గ్రూపు సరిపడిందనుకోండి. ఇలా ఒకరి రక్తసంబంధీకులకు మరొకరు పరస్పరం కిడ్నీలు దానం చేసుకునే ప్రక్రియను స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీని వారి బంధువుకూ, వారి కిడ్నీని వీరి బంధువుకు అమర్చే ఏర్పాటు చేస్తారు. వీరిద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి... ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. బ్లడ్‌గ్రూపు సరిపకపోయినప్పటికీ ఈ విధానంలో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా... కంపాటబుల్ కిడ్నీ మార్పిడి సర్జరీల మాదిరిగానే విజయవంతం అవుతున్నాయి. కాబట్టి మీరు మీ అమ్మగారికి తగిన విధానాన్ని అనుసరించేందుకు ఉపయుక్తమైన మార్గాలను తెలుసుకునేందుకు ఒకసారి అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నచోట, నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సూచనాలు తీసుకోండి.