డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే... | what is Deep Wien thrombosis..? | Sakshi
Sakshi News home page

డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే...

Published Thu, May 12 2016 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

what is Deep Wien thrombosis..?

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - రామకృష్ణ, నకిరెకల్

మీకు లివర్ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. దాని రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే, వారు మీకు తగిన చికిత్స అందిస్తారు.

 నేను నెల రోజుల క్రితం కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్‌లో నాకు గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. అయితే నాకు ఎప్పుడూ కడుపు నొప్పి రాలేదు. ఇలా రాళ్లు ఉన్నవారు ఆపరేషన్ చేయించుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి దీనికి చికిత్స ఏమిటో చెప్పండి. - కృష్ణమూర్తి, విజయవాడ

 మీరు చెప్పిన వివరాల ప్రకారం మీకు ‘ఎసింప్టమాటిక్ గాల్ స్టోన్ డిసీజ్’ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉండి, వ్యాధి లక్షణాలే ఏమీ లేనివారిలో ఏడాదికి వందమందిలో సుమారు ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్‌గానే ఉంటారు. మీకు వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఒకసారి మీకు దగ్గర్లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిస్తే, వారు మీ కండిషన్‌ను ప్రత్యక్షంగా చూసి తగిన సలహా ఇస్తారు.

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 42. కొద్దిరోజులుగా కాళ్లు వాచిపోయి నడుస్తున్నప్పుడు నొప్పిగా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అన్నారు. దీని గురించి నాకు అవగాహన లేదు. దయచేసి నాకు వచ్చిన సమస్య ఏమిటో తెలిపండి. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
- రవికుమార్, ఖమ్మం

 మన కాళ్ల నుంచి రకాన్ని గుండెకు చేరవేసే సిరల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టడం జరిగితే తలెత్తే సమస్య పేరే డీప్ వీన్ థ్రోంబోసిస్ (డీవీటీ). మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకూ ప్రతి అవయవానికీ, ప్రతి కణానికీ రక్త సరఫరా అవసరం. ఈ రక్త సరఫరా కోసం మన దేహమంతటా రక్తనాళాలు ఉంటాయి. వాటిని చెడు రక్తాన్ని గుండెకు చేరవేసే వాటిని సిరలు అంటారు. కాళ్ల నుంచి రక్తాన్ని శుద్ధి కోసం గుండెకు తీసుకెళ్లే సిరల్లో ఎక్కడైనా రక్తం గడ్డకడితే అది రక్త ప్రవాహానికి అవరోధంగా మారుతుంది. అలా జరిగినప్పుడు  రక్త ప్రసరణ నిలిచిపోయి, ఆ భాగంలో వాపు వస్తుంది. దీనినే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు.

 కొన్ని కారణాలు:  నడక కరువై పాదాలకు, కాళ్లకు తగినంత వ్యాయామం లేకపోవడం  ఊపిరితిత్తుల క్యాన్సర్  క్లోమగ్రంథి క్యాన్సర్   సుదీర్ఘ విమాన ప్రయాణాలు  అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం  హార్మోన్ మాత్రలు ఎక్కువగా వాడటం  ఏదైనా జబ్బు కారణంగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత సుదీర్ఘకాలం పాటు మంచం మీద ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం  ఒంట్లో రక్తం గడ్డ కట్టే తత్వాన్ని పెంచే వ్యాధులలో బాధపడేవారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఇక కొందరు మహిళల్లో గర్భధారణ కూడా దీనికి ఒక కారణం.

 లక్షణాలు :  కాళ్లలో నొప్పి, నడుస్తున్నప్పుడు అసౌకర్యంగా ఉండటం  కాళ్లు/చేతులపై చర్మం నల్లబారడం, అవి కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్)  కాలు తొడ భాగంలో ఎర్రగా కందిపోయినట్లు, వాచిపోయి... నడవటం కష్టంగా అనిపించడం  ప్రమాదాలు:  ఈ సమస్యతో ప్రమాదాలు రెండు రకాలుగా వస్తాయి. మొదటిది: సిరల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ కారణంగా సిర మూసుకుపోయి, చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దాంతో నీరు, ఖనిజాలు, లవణాలు అక్కడే నిలిచిపోతాయి. దీనివల్ల కణజాలంపై ఒత్తిడి పెరిగి పక్కనే ఉన్న ధమనులు నొక్కుకుపోయి, మంచి రక్తం సరఫరా తగ్గి, గ్యాంగ్రీన్ ఏర్పడే అవకాశం ఉంది.

 రెండోది: సిరల్లో ఏర్పడ్డ గడ్డలను తొలగించకపోవడం వల్ల అవి రక్త ప్రసరణలో కలిసి మెల్లగా పైకి పయనించి, గుండెలోకి చేరతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తులోకి వెళ్లి అక్కడ రక్తనాళాల్లో ఇరుక్కుపోయి అత్యంత ప్రమాదకరమైన ‘పల్మనరీ ఎంబాలిజమ్’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా తయారవుతుంది. బీపీ పడిపోతుంది.

 నివారణ : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం   అదేపనిగా కూర్చొని ఉండకుండా అప్పుడప్పుడూ నడవడం  గర్భిణులు డాక్టర్ల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం  పక్షవాతం, క్యాన్సర్‌తో బాధపడుతూ మంచంపై ఉండేవారు ఈ సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి.

 చికిత్స: హోమియోలో కాన్‌స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా రోగి మానసిక, శారీరక   లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది.

కిడ్నీ కౌన్సెలింగ్
మా అమ్మగారి వయసు 63 ఏళ్లు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మాలో ఎవరైనా కిడ్నీని దానం చేద్దాం అనుకున్నాం గానీ బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? - దామోదర్, నల్లగొండ

 కిడ్నీ వంద శాతం పాడైపోయినప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి ద్వారా రోగిని రక్షిస్తారు. దీనికి దాత అవసరమవుతారు. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీని సేకరించడం) అని రెండు రకాల దాతల నుంచి కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్స్ విషయంలో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అంతేగాక వీరి బ్లడ్ గ్రూపు కిడ్నీని పొందే వ్యక్తి బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయవ్యాధులైన హెపటైటిస్-బి, సి ఉండకూడదు. దాత ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేశాకే కిడ్నీ మార్పిడి చేస్తారు. రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది... స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది ఏబీఓ ఇన్‌కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్.

 స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్... తమ రక్త సంబంధీకులకు కిడ్నీ దానం చేయాలని ఉన్నాగానీ బ్లడ్ గ్రూపులు కలవకపోవడం వల్ల అది సాధ్యపడనప్పుడు... అదే సమస్యతో బాధపడుతున్న వేరొకరి రక్త సంబంధీకులలో బ్లడ్ గ్రూపు సరిపడిందనుకోండి. ఇలా ఒకరి రక్తసంబంధీకులకు మరొకరు పరస్పరం కిడ్నీలు దానం చేసుకునే ప్రక్రియను స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీని వారి బంధువుకూ, వారి కిడ్నీని వీరి బంధువుకు అమర్చే ఏర్పాటు చేస్తారు. వీరిద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది.

 బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి...
ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. బ్లడ్‌గ్రూపు సరిపకపోయినప్పటికీ ఈ విధానంలో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా... కంపాటబుల్ కిడ్నీ మార్పిడి సర్జరీల మాదిరిగానే విజయవంతం అవుతున్నాయి. కాబట్టి మీరు మీ అమ్మగారికి తగిన విధానాన్ని అనుసరించేందుకు ఉపయుక్తమైన మార్గాలను తెలుసుకునేందుకు ఒకసారి అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నచోట, నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సూచనాలు తీసుకోండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement