‘సయీద్‌ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’ | Ghoul means the soul in Arabic | Sakshi
Sakshi News home page

ఆత్మల ఇంటరాగేషన్‌

Published Sat, Jan 19 2019 1:56 AM | Last Updated on Sat, Jan 19 2019 9:22 AM

Ghoul means the soul in Arabic - Sakshi

ఘూల్‌... అంటే అరబిక్‌లో ఆత్మ అని అర్థం!అబు ఘ్రైబ్‌.. అంటే కోవర్ట్‌ డిటెన్షన్‌ సెంటర్‌. బ్రిటిషర్స్‌ కాలంలోని కాలాపాని లాంటిది.. నాజీ కాన్‌సంట్రేషన్‌ క్యాంప్‌ లాంటిది. అండర్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తూ ఉంటారు ఆర్మీ అధికారులు. ఈ రెండిటి కథే.. ఘూల్‌. నెట్‌ఫ్లిక్స్‌ సెకండ్‌ ఒరిజినల్‌. మూడు ఎపిసోడ్ల మినీ సిరీస్‌. 

నిదా రహీమ్‌ (రాధికా ఆప్టే).. నేషనల్‌ ప్రొటెక్షన్‌ స్క్వాడ్‌ ట్రైనీ. ఆమె తండ్రి ప్రొఫెసర్‌. యాక్టివిస్ట్‌ కూడా. ప్రభుత్వం నిషేధించిన సిలబస్‌ను పిల్లలకు బోధిస్తున్నాడని తండ్రి గురించి పోలీసులకు ఉప్పందించి అతనిని అరెస్ట్‌ చేయిస్తుంది. ప్రొఫెసర్‌ను కోవర్ట్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలిస్తారు. ఇంటరాగేషన్‌ ద్వారా తండ్రి తన తప్పు తెలుసుకొని పరివర్తన చెందిన వ్యక్తిగా బయటకు వస్తాడని నిదా నమ్మకం. ఆమె ఇంటరాగేషన్‌ స్కిల్స్‌ పట్ల ఆర్మీలో మంచి పేరుంటుంది. సొంత తండ్రినే పట్టించిందన్న కీర్తీ కూడి డిటెన్షన్‌ సెంటర్‌లో ఇంటరాగేషన్‌ ఆఫీసర్‌గా అవకాశం వస్తుంది నిదాకు. దానికి హెడ్‌ డకున్హా (మానవ్‌ కౌల్‌) అనే మిలటరీ ఆఫీసర్‌. 

అనుమానం.. అసహనం
ఆ సెంటర్‌ ఒక చీకటి గుహ. అందులో పనిచేసే వాళ్లకు కనీసం పగలు, రాత్రి తేడా తెలిసేలా ఉండాలని డిమ్‌ లైట్లు పెడ్తారు. ఆ వాతావరణానికి త్వరగా అలవాటు పడమని నిదాకు హుకుం జారీ చేస్తాడు ఆఫీసర్‌ డకున్హా. అక్కడే ఉన్న మరో లేడీ ఆఫీసర్‌ మేజర్‌ దాస్‌ (రత్నాబాలి భట్టఛార్జి).  దేశభక్తిని నరనరాన నింపుకున్న ఆమెకు నిదా నచ్చదు. ముస్లిం అని, ఆమెను నమ్మడానికి వీల్లేదని డకున్హాకు చెప్తుంది. నిత్యం నిదాను అనుమానిస్తూ, మాటలతో వేధిస్తూంటుంది. అప్పుడే అక్కడికి మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అలి సయీద్‌ను తీసుకొస్తారు. ‘‘అలి సయీద్‌ నోట నిజాలు కక్కించి నీ ఇంటరాగేషన్‌ స్కిల్స్‌ నిరూపించుకో’’ అని సవాలు విసురుతాడు డకున్హా. ఆ ప్రయత్నంలోనే అలి సయీద్‌ నిదాను ‘‘నిదూ’’ అని పిలుస్తాడు. షాక్‌ అవుతుంది ఆమె.

‘‘నువ్వెవరు?’’అని రెట్టిస్తుంది సయీద్‌ని. మొహం, నోటి నుంచి రక్తమోడుతున్న అతడు వికృతంగా నవ్వుతాడు. భీతిల్లి వెనక్కి తగ్గుతుంది నిదా. ‘‘భయపడొద్దు.. బయట ఇంటరాగేషన్‌కు, ఇక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. నేర్చుకోవాలి’’ అని చెప్పి వెళ్లిపోతాడు డకున్హా. అసహనంగా నసుగుతూ నిదాను క్యాంటీన్‌కి తీసుకెళ్తుంది మేజర్‌ దాస్‌. ‘‘ఏమైందీ భయపడ్డావా?’’ అంటూ అనునయం నటిస్తుంది ‘‘నన్ను నిదూ అని మా నాన్న మాత్రమే పిలుస్తారు. ఆ పేరు సయీద్‌కెలా తెలిసింది?’’ అదే షాక్‌లో అడుగుతుంది నిదా. ‘‘వేషాలు వేయకు. నీకన్నీ తెలుసు. మీరంతా ఒకటే’’ స్థిరమైన గొంతుతో బెదిరిస్తుంది మేజర్‌ దాస్‌. అవాక్కవుతుంది నిదా. తండ్రి గుర్తొస్తాడు. ‘‘నాన్న ఏమైనట్టు?’’ ఆలోచన మొదలవుతుంది. ఆ రాత్రి ఆమెకు పీడకలొకటి వస్తుంది. తండ్రి పిశాచమై తనను పీక్కు తింటున్నట్టు. దిగ్గున లేచి కూర్చుంటుంది. ఆ రాత్రంతా నిద్రపోదు. ఏదో తెలియని గిల్ట్‌ వెంటాడుతుంటుంది. 

తెల్లవారి..
తన తండ్రి గురించి డకున్హాను అడుగుతుంది నిదా. అక్కడి నుంచి పంపేశామని చెప్పి.. అలి సయీద్‌ ఇంటరాగేషన్‌ కంటిన్యూ చేయమంటాడు. ఆరోజు.. నిదాతో పాటు చౌదరి, గుప్తా ఇద్దరూ ఇంటరాగేషన్‌ సెల్‌లోకి వెళ్తారు. సయీద్‌ను ఇంటరాగేట్‌ చేయడానికి సన్నద్ధమవుతుంటే.. ఆ సెంటర్‌లో జరిగిన కొన్ని నేరాల గురించి మాట్లాడ్తాడు సయీద్‌. విస్మయానికి లోనవుతారు చౌదరి, గుప్త. నిదాకు అంతా అయోమయంగా ఉంటుంది. చౌదరీకి తెలియకుండా, గుప్తా, గుప్తాకు తెలియకుండా చౌదరి చేసినవీ చెప్పి వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెడ్తాడు. సయీద్‌ ఇంటరాగేషన్‌ను మరిచిపోయి ఆ ఇద్దరూ గొడవపడ్తుంటారు.

వాళ్లను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమవుతుంది నిదా. గుప్తాను కత్తితో పొడిచేస్తాడు చౌదరి. ఈ గొడవకు పరిగెత్తుకొచ్చిన డకున్హా, నిదా అంతా హతాశులవుతారు. అప్పుడూ నింద నిదా మీద తోసెయ్యడానికే చూస్తుంది మేజర్‌ దాస్‌. వాళ్లందరినీ బయటకు పంపేసి సయీద్‌కు కరెంట్‌ షాక్‌ ఇస్తాడు డకున్హా. ‘‘ఘూల్‌ ఘూల్‌’’ అని సణుగుతూ నోట్లోంచి నురగలు కక్కి తలవాల్చేస్తాడు సయీద్‌. అతను చనిపోయాడనుకుంటాడు డకున్హా. ఇదంతా రికార్డ్‌ రూమ్‌లోంచి గమనిస్తున్న నిదా.. సయీద్‌ సణిగిన మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. టెర్రరిస్ట్‌ ముద్రతో సెల్‌లో ఉన్న ఒక మౌల్వీని పిలిచి ఆ రికార్డింగ్‌ వినిపించి అర్థం అడుగుతుంది.

బిత్తరపోతాడు మౌల్వీ. చెప్పమని గద్దిస్తుంది నిదా. ‘‘ఘూల్‌ అంటే అరబిక్‌లో ఆత్మ. సయీద్‌ మనిషి కాడు. వాడు ఆత్మ’’ అని చెప్పి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు మౌల్వీ. డకున్హా ఇంటరాగేషన్‌ గదిలోంచి బయటకు రాగానే నిదా వెళ్లి చూస్తుంది. అక్కడ సయీద్‌ శరీరం ఉండదు. మళ్లీ ఎప్పటిలాగే గొలుసులతో బంధించి ఉంటుంది. అతను వికటాట్టహాసం చేస్తుంటాడు. చంపాలని ప్రయత్నిస్తుంది కాని కుదరదు. అప్పుడు నిదాకూ నిర్ధారణవుతుంది సయీద్‌ మనిషి కాదు అని. ఆ విషయమే డకున్హా, మేజర్‌ దాస్‌లతో చెప్తుంది. ఎవరూ నమ్మరు. మేజర్‌ దాసైతే నిదానూ టెర్రరిస్ట్‌గా ముద్ర వేసేస్తుంది. 

ఇంకో రోజు..
ఇంటరాగేషన్‌ స్పెషలిస్ట్‌ ఫౌలాద్‌ సింగ్‌ వస్తాడు సయీద్‌ను హింసించడానికి. ఆ టైమ్‌లోనే నిదా మౌల్వీ సెల్‌లోకి వెళ్తుంది ఘూల్‌కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం. అపరాధభావంతో బాధపడేవాళ్ల శరీరాన్ని ఘూల్‌ కోరుకుంటుందని, అలా వాళ్ల శరీరంలోకి జొరబడి ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్తాడు మౌల్వీ. తన తండ్రి గురించీ ఆరా తీస్తుంది. ఏమీ చెప్పడు మౌల్వీ. ఈ లోపు స్పెషల్‌ ఇంటరాగేషన్‌ సెల్‌ నుంచి పెద్ద కేక వినిపిస్తుంది. అటుగా పరిగెత్తుతుంది నిదా. అప్పుడే డకున్హాకు ఫోన్‌ వస్తుంది. ‘‘సర్‌.. సయీద్‌ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’’ అనే సమాచారంతో. డకున్హాకు నోట మాటరాదు.

మరిక్కడ ఉంది ఎవరు? స్పెషల్‌ ఇంటరాగేషన్‌ సెల్‌లో ఫౌలాద్‌ సింగ్‌ బాడీ కనిపిస్తుంది నిదాకు. సయీద్‌ అనుకుంటున్న వాడు ఏమైనట్టు? అనే డౌట్‌ వచ్చేలోపే ఫౌలాద్‌ సింగ్‌ శరీరంలో ఉన్న ఆత్మ గబగబా సెల్‌ నుంచి బయటకు వచ్చి ఇతర సెల్స్‌ తలుపులు తెరిచి అందులోని ఖైదీలందరినీ విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే నిదాను చూస్తుంది. ఆమె భయపడి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంది. సరైన సమయంలో డకున్హా అండ్‌ టీమ్‌ వచ్చి ఆమెను రక్షిస్తారు. అప్పడు జరిగిందంతా చెప్తుంది. వెళ్లి చూసి నిజమనే నమ్ముతారు. కాని మేజర్‌ దాస్‌ నమ్మదు. ఆ ఖైదీలను విడిపించడానికి నిదా ఆడుతున్న నాటకం అని, ఆమె వచ్చాకే ఆ సెంటర్‌ అంతా గందరగోళంగా తయారైందని, తమలో తామే తన్నుకు చస్తున్నారని మిగిలిన వాళ్లను రెచ్చగొడ్తుంది.

వాళ్లూ నమ్ముతారు. మేజర్‌ దాస్‌ ఆజ్ఞ మేరకు నిదాను సెల్‌లో వేస్తారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మిగిలిన ఖైదీలు కనిపిస్తారు. ఆ గదిలో హత్యలు జరిగినట్టు గోడకు తుపాకీ తూటాల ఛిద్రాలు, రక్తం మరకలు కనిపిస్తాయి. అప్పుడు అర్థమవుతుంది నిదాకు. అది ఇంటరాగేట్‌ చేసి మనుషులను మార్చే సెంటర్‌ కాదు.. ఫక్తు హత్యలు చేసే సెంటర్‌ అని. అప్పుడు అక్కడే ఉన్న మౌల్వీని అడుగుతుంది మళ్లీ తన తండ్రి గురించి. చనిపోయి ఉంటాడని చెప్తాడు. అక్కడున్న ఖైదీల్లోనే ఎవరో ఘూల్‌ అన్న విషయమూ బోధపడ్తుంది నిదాకు. ‘అహ్మద్‌’ అనే వ్యక్తిని చూపిస్తూ నువ్వేనా అని అడుగుతుంది. ‘‘వాడు మూగవాడు.. ఆత్మ మూగవాడి శరీరంలోకి ప్రవేశించదు’’ అంటాడు మౌల్వీ. ‘‘ఒక టీ అమ్ముకునే వాడిని టెర్రరిస్ట్‌ అని పట్టుకొచ్చారు.

వీడి నుంచి విషయాలు ఏమీ రాబట్టలేకపోయే సరికి వీడి భార్య, కొడుకును పట్టుకొచ్చి వీడి కళ్లముందే చంపేశారు. అప్పటి నుంచి వీడికి మాట పడిపోయింది’’ అని జరిగింది చెప్తాడు మౌల్వీ. దిమ్మ తిరుగుతుంది నిదాకు. చిమ్నీ చూపించి దాన్నుంచి బయటకు పొమ్మని అహ్మద్‌కు చెప్పి తనూ అహ్మద్‌ వెనక వెళ్తుంది. అహ్మద్‌ బయటపడి.. నిదాకూడా బయటపడే టైమ్‌కి ఘూల్‌ ఆమెను లోపలికి లాగి కాలి పిక్కను కొరుకుతుంది. అయినా తప్పించుకుని బయటకు వస్తుంది. ఇద్దరూ కలిసి డకున్హా చాంబర్‌కు వెళ్తారు. అక్కడ జరిగిన పెనుగులాటలో నిదా రూపంలో ఉంది ఆత్మ అని అర్థమవుతుంది అహ్మద్‌ కు. లోపల అసలు నిదా ఉంటుంది.

మేజర్‌ దాస్‌.. నిదాను చంపబోతుంటే డకున్హా మేజర్‌ దాస్‌ను చంపేస్తాడు. మిగిలిన వాళ్లలో ఒకొక్కరిలోకే ఆత్మ చేరి ఒకొక్కరినీ చంపేస్తుంటుంది. ఈలోపు తన తండ్రిని చంపమని ఆర్డర్‌ ఇచ్చింది డకున్హానే అని తెలుస్తుంది నిదాకు. పశ్చాత్తాపంతో కుమిలి పోతుంది. అహ్మద్‌తో కలిసి ఆ సెంటర్‌ నుంచి బయటకు వస్తుంది. బాంబు వేసి ఆ సెంటర్‌ను పేల్చేసి తనూ బయట పడ్తాడు డకున్హా. సెంటర్‌ బయట ఆర్మీ ఉంటుంది. డకున్హాను చూసి ‘‘వీడు మనిషి కాదు.. ఘూల్‌ ’’ అంటూ ఆర్మీ వారిస్తున్నా వినకుండా డకున్హాను చంపేస్తుంది నిదా. ఆర్మీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేస్తారు. అప్పుడు చెప్తుంది నిదా.. ‘‘అది కోవర్ట్‌ డిటెన్షన్‌ సెంటర్‌ కాదు.. హత్యలు చేసే సెంటర్‌.

అందరూ కరప్ట్‌ అయ్యారు’’అంటూ. నిదా కూడా టెర్రరిస్టే అని ముద్ర వేసి ఆమెనూ కోవర్ట్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ.. బ్లేడ్‌తో అర చేతిని కోసుకొని రక్త తర్పణ చేసి తన శరీరంలోకి ఘూల్‌ని ఆహ్వానించేందుకు సిద్ధపడ్తుంది నిదా!ఇక్కడితో ‘ఘూల్‌’ సీజన్‌ వన్‌ ఎండ్‌ అవుతుంది. హైపర్‌ నేషనలిజం, ఇస్లామోఫోబియా వల్ల తలెత్తిన ఘర్షణకు దృశ్యరూపం ‘‘ఘూల్‌’’. హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంది. దర్శకుడు పాట్రిక్‌ గ్రాహమ్‌. 
– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement