Arabic
-
అరబిక్ కుత్తు ఎన్టీఆర్ వర్షన్
-
మూడు జీవితాల ముచ్చటకు బుకర్
కొత్త బంగారం ఒమాన్ రాజధాని నగరం మస్కట్‌కు దగ్గర్లోనే ఉన్న కాల్పనిక ఊరైన ‘అల్ అవాఫీ’ లో ధనిక కుటుంబపు సలీమా, అజ్జాన్లకు ముగ్గురు కూతుళ్ళు. మయ్యాకు కుట్టుపనంటే ఇష్టం. తనిష్టపడిన అలీతో ప్రేమ విఫలమై, ధనవంతుడైన అబ్దల్లాని పెళ్ళి చేసుకుంటుంది. పుస్తక పురుగైన అస్మాకు తల్లిదండ్రుల ఇష్టప్రకారం ఖాలిద్‌తో పెళ్ళవుతుంది. ఆఖరిదైన ఖ్వాలా, కెనెడా నుంచి తిరిగి వచ్చిన తండ్రి సహోదరుడి కొడుకును వివాహమాడుతుంది. మయ్యా తన కూతురుకి ‘లండన్’ అన్న పేరు పెడుతుంది. భర్తను పట్టించుకోదు. ‘మయ్యా, ప్రేమంటే తెలియదా? నీ కళ్ళెప్పుడూ కుట్టు మెషీన్ మీదే ఉంటాయి తప్ప నన్ను గానీ నా ప్రేమని గానీ ఎందుకు చూడలేవు?’ అని అబ్దల్లా అడిగి, ‘యీ టీవీ డైలాగులేమిటి? నీవు చూసే ఈజిప్షియన్ సినిమాల ప్రభావమా!’ అన్న మయ్యా ఎగతాళిని ఎదురుకుంటాడు. అజ్జాన్– ‘చందమామంత అందంగా ఉండే’ నాజియాతో ప్రేమలో పడి, సలీమాను నిర్లక్ష్యపెడతాడు. జరీఫా– అబ్దల్లా తండ్రి సులేమాన్ ఇంటి బానిస. ఒమాన్ సమాజంలో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పులను అంగీకరించే ముగ్గురు అక్కచెల్లెళ్ళనీ, వారి కుటుంబాలనీ అనుసరిస్తుంది జోఖా అల్హార్తీ రాసిన ‘సెలెస్టియల్ బాడీస్’ నవల. గత సంఘటనల ద్వారా– రచయిత్రి, పాఠకులకు ఒమాన్ దేశపు పేదరికాన్నీ, పడిన కష్టాలనూ చిన్నచిన్న సంఘటనల ద్వారా చూపుతారు (బ్రిటిష్ పాలన, తిరుగుబాటు, ఒప్పందం) . అబ్ద్దల్లా– తండ్రి చేసిన బానిసల వర్తకం గుర్తు చేసుకుంటాడు. ‘‘ఆయన అరవడం మానలేదు. ‘ఒరేయ్, సంజర్ను గుంజకు కట్టేయండ్రా. వాడికి ఎవరు నీళ్ళిచ్చినా, నీడ కలిపించినా నాకు సమాధానం చెప్పాలి’ అన్నప్పుడు– ‘నాన్నా, ప్రభుత్వం బానిసలను విడిపించి ఎన్నేళ్ళో అయింది’’ అంటాడు అబ్దల్లా. అతనికి నిద్రలో ఒకే జ్ఞాపకం కలలో వస్తుంటుంది. తండ్రి తనను నూతిలో తలకిందులా వేళ్ళాడదీయడం. ‘అయ్యో, వద్దు, వద్దు’ అని వేడుకుంటున్నప్పుడు మెలకువ వస్తుంది. తనను పెంచిన జరీఫాను తన తల్లి గురించి ఎన్నిసార్లు అడిగినా, ఆమె మరణించిందని తప్ప సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. తల్లి జీవించే ఉందన్న సూచన మాత్రం నవల చివర్న కనబడుతుంది. జరీఫా కొడుకు, ‘నాకు పెళ్ళి చేసి మమ్మల్నిద్దరినీ పని చేయిస్తాడు సులేమాన్. ఇప్పుడు మనం బానిసలం కాము’ అన్నప్పుడు, తల్లి ‘అతనే లేకపోతే మనం ముష్టెత్తుకునేవాళ్ళం’ అంటుంది. ఒమాన్‌లో బానిసత్వం 1970 లోనే రద్దయినప్పటికీ, బానిసల ప్రవర్తన గానీ బానిసల యజమానుల ఆలోచనలు గానీ మారవు. లండన్– బానిస సంతతిని పెళ్ళి చేసుకుని– అతని దాంపత్య ద్రోహం, అతను తన్ని కొట్టడం భరించలేక విడాకులు తీసుకుంటుంది. ఒమాన్‌లో కాన్పు తరువాత పొట్ట రాకుండా, 40 రోజులు కడుపుకి రాయిని కడతారు. ఇంటి బయట వేరే గదిలో ఉంచుతారు. పెళ్ళికి ముందు వారంపాటు పెళ్ళి కూతుర్ని ఎవరూ చూడకూడదు. ఆస్మా పెళ్ళప్పుడు, అందరూ ఒక బంధువు ఉదంతం చెప్పుకుంటారు: శోభనపు రాత్రి భర్తను ఏడిపించేందుకు ఒకామెకు సూది కొనలుండే గాజులు తొడుగుతారు. అదర్థం కాని ఆమె– రాత్రి భర్త తనను సమీపించినప్పుడల్లా గాజులతో గుచ్చిగుచ్చి పెడుతుంది. నెలరోజుల తరువాత భయపడిన భర్త అడుగుతాడు: ‘నన్ను బలవంతంగా కట్టబెట్టారా, నన్నిలా గాజులతో చంపుతున్నావు!’ అని. చితక్కొట్టి్టన వెల్లుల్లి రెబ్బకి సూది గుచ్చి(ఇన్ఫెక్షన్ రాకుండా), ఆడపిల్లల చెవులకి పైనుండి కిందవరకూ పది కన్నాలు పొడుస్తారు. ఇలాంటి ఆచారాల వివరాలెన్నో ఉంటాయి పుస్తకంలో. ఒమాన్ ఉన్నత వర్గం– అత్తరు మానేసి, గూచీ పెర్ఫ్యూమ్ ఆధునికతనైతే అలవరచుకుంటుంది గానీ దృక్పథం మాత్రం సనాతనమైనదే. అధికారం ఉండేది పురుషుని చేతిలోనే. రచయిత్రి అల్హార్తీ బానిసలను గొప్పగానూ చూపించరు, బానిసల యజమానులను దుయ్యనూబట్టరు. అక్కచెల్లెళ్ళ జీవితాల కథలు చూపుతూ ఎడారి ప్రాంతం నుండి రాజధానికి చేరిన మూడు తరాల కథలనూ చెప్తారు. రచనకున్న నిర్మాణ క్రమం గమనింపతగ్గది. 60 అధ్యాయాలున్న నవల్లో– ఒక అధ్యాయం ప్రథమ పురుషలో ఉన్న ఒక పాత్ర కథనం అయితే, రెండోది విమానంలో కూర్చుని తన జీవితం గురించి ఆలోచించుకుంటున్న అబ్దల్లా గొంతుతో ఉంటుంది. అయితే, ఒక క్రమం అంటూ లేని కథనాలన్నీ గతంలో జరిగిన సంఘటనలను వర్ణించేవే. ప్రతీ అధ్యాయం భిన్నమైన పాత్రల మీద కేంద్రీకరిస్తుంది. ఎవరెవరికి ఏ విధమైన చుట్టరికమో తెలుసుకోడానికి, మొదటి పేజీలో ఉన్న వంశవృక్షాన్ని అస్తమానం చూడాల్సి వస్తుంది. నవలకున్న కొద్దిపాటి కథాంశమేదో మొదట్లోనే ఉంటుంది. అల్హార్తీ చేసినదల్లా అక్కడున్న ఖాళీలని పూరించడమే. జాతి, బానిసత్వం, లింగం గురించిన పడికట్టు మాటలేవీ ఉపయోగించరు రచయిత్రి. ఒక నిర్దిష్టమైన ముగింపు లేని నవలిది. సంభాషణలు తక్కువ. అవి కూడా కథనంలో కలిసిపోయి ఉంటాయి. ప్రతి పాత్రా ఏదో విధానంలో చరిత్రలో చిక్కుకునే ఉంటుంది. విమోచన కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. లండన్ డాక్టర్ అయివుండి కూడా ముందుకు కదలలేకపోతుంది. నవలకు ఈ వారంలోనే ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ ప్రదానం చేశారు. అరబ్ దేశాల నుండి మొట్టమొదటి మ్యాన్ బుకర్ అవార్డ్ పొందిన రచయిత అల్హార్తీ. 2016 నుంచి మారిన నియమాల ప్రకారం, యాబై వేల పౌండ్ల అవార్డ్ సొమ్ముని పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించిన మారిలిన్ బూథ్తో పంచుకున్నారు. అల్హార్తీ– ఎడిన్బర్ యూనివర్సిటీ నుండి క్లాసికల్ అరబిక్ లిటరేచర్‌లో పీహెచ్డీ పొందారు. ప్రస్తుతం ఒమాన్‌లోని సుల్తన్ ఖాబూస్ యూనివర్సిటీలో అరబిక్ డిపార్టుమెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. - కృష్ణ వేణి -
‘సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’
ఘూల్... అంటే అరబిక్‌లో ఆత్మ అని అర్థం!అబు ఘ్రైబ్.. అంటే కోవర్ట్ డిటెన్షన్ సెంటర్. బ్రిటిషర్స్ కాలంలోని కాలాపాని లాంటిది.. నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ లాంటిది. అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉంటారు ఆర్మీ అధికారులు. ఈ రెండిటి కథే.. ఘూల్. నెట్‌ఫ్లిక్స్ సెకండ్ ఒరిజినల్. మూడు ఎపిసోడ్ల మినీ సిరీస్. నిదా రహీమ్ (రాధికా ఆప్టే).. నేషనల్ ప్రొటెక్షన్ స్క్వాడ్ ట్రైనీ. ఆమె తండ్రి ప్రొఫెసర్. యాక్టివిస్ట్ కూడా. ప్రభుత్వం నిషేధించిన సిలబస్‌ను పిల్లలకు బోధిస్తున్నాడని తండ్రి గురించి పోలీసులకు ఉప్పందించి అతనిని అరెస్ట్ చేయిస్తుంది. ప్రొఫెసర్‌ను కోవర్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలిస్తారు. ఇంటరాగేషన్ ద్వారా తండ్రి తన తప్పు తెలుసుకొని పరివర్తన చెందిన వ్యక్తిగా బయటకు వస్తాడని నిదా నమ్మకం. ఆమె ఇంటరాగేషన్ స్కిల్స్ పట్ల ఆర్మీలో మంచి పేరుంటుంది. సొంత తండ్రినే పట్టించిందన్న కీర్తీ కూడి డిటెన్షన్ సెంటర్లో ఇంటరాగేషన్ ఆఫీసర్‌గా అవకాశం వస్తుంది నిదాకు. దానికి హెడ్ డకున్హా (మానవ్ కౌల్) అనే మిలటరీ ఆఫీసర్. అనుమానం.. అసహనం ఆ సెంటర్ ఒక చీకటి గుహ. అందులో పనిచేసే వాళ్లకు కనీసం పగలు, రాత్రి తేడా తెలిసేలా ఉండాలని డిమ్ లైట్లు పెడ్తారు. ఆ వాతావరణానికి త్వరగా అలవాటు పడమని నిదాకు హుకుం జారీ చేస్తాడు ఆఫీసర్ డకున్హా. అక్కడే ఉన్న మరో లేడీ ఆఫీసర్ మేజర్ దాస్ (రత్నాబాలి భట్టఛార్జి). దేశభక్తిని నరనరాన నింపుకున్న ఆమెకు నిదా నచ్చదు. ముస్లిం అని, ఆమెను నమ్మడానికి వీల్లేదని డకున్హాకు చెప్తుంది. నిత్యం నిదాను అనుమానిస్తూ, మాటలతో వేధిస్తూంటుంది. అప్పుడే అక్కడికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అలి సయీద్‌ను తీసుకొస్తారు. ‘‘అలి సయీద్ నోట నిజాలు కక్కించి నీ ఇంటరాగేషన్ స్కిల్స్ నిరూపించుకో’’ అని సవాలు విసురుతాడు డకున్హా. ఆ ప్రయత్నంలోనే అలి సయీద్ నిదాను ‘‘నిదూ’’ అని పిలుస్తాడు. షాక్ అవుతుంది ఆమె. ‘‘నువ్వెవరు?’’అని రెట్టిస్తుంది సయీద్‌ని. మొహం, నోటి నుంచి రక్తమోడుతున్న అతడు వికృతంగా నవ్వుతాడు. భీతిల్లి వెనక్కి తగ్గుతుంది నిదా. ‘‘భయపడొద్దు.. బయట ఇంటరాగేషన్‌కు, ఇక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. నేర్చుకోవాలి’’ అని చెప్పి వెళ్లిపోతాడు డకున్హా. అసహనంగా నసుగుతూ నిదాను క్యాంటీన్‌కి తీసుకెళ్తుంది మేజర్ దాస్. ‘‘ఏమైందీ భయపడ్డావా?’’ అంటూ అనునయం నటిస్తుంది ‘‘నన్ను నిదూ అని మా నాన్న మాత్రమే పిలుస్తారు. ఆ పేరు సయీద్కెలా తెలిసింది?’’ అదే షాక్‌లో అడుగుతుంది నిదా. ‘‘వేషాలు వేయకు. నీకన్నీ తెలుసు. మీరంతా ఒకటే’’ స్థిరమైన గొంతుతో బెదిరిస్తుంది మేజర్ దాస్. అవాక్కవుతుంది నిదా. తండ్రి గుర్తొస్తాడు. ‘‘నాన్న ఏమైనట్టు?’’ ఆలోచన మొదలవుతుంది. ఆ రాత్రి ఆమెకు పీడకలొకటి వస్తుంది. తండ్రి పిశాచమై తనను పీక్కు తింటున్నట్టు. దిగ్గున లేచి కూర్చుంటుంది. ఆ రాత్రంతా నిద్రపోదు. ఏదో తెలియని గిల్ట్ వెంటాడుతుంటుంది. తెల్లవారి.. తన తండ్రి గురించి డకున్హాను అడుగుతుంది నిదా. అక్కడి నుంచి పంపేశామని చెప్పి.. అలి సయీద్ ఇంటరాగేషన్ కంటిన్యూ చేయమంటాడు. ఆరోజు.. నిదాతో పాటు చౌదరి, గుప్తా ఇద్దరూ ఇంటరాగేషన్ సెల్‌లోకి వెళ్తారు. సయీద్‌ను ఇంటరాగేట్ చేయడానికి సన్నద్ధమవుతుంటే.. ఆ సెంటర్లో జరిగిన కొన్ని నేరాల గురించి మాట్లాడ్తాడు సయీద్. విస్మయానికి లోనవుతారు చౌదరి, గుప్త. నిదాకు అంతా అయోమయంగా ఉంటుంది. చౌదరీకి తెలియకుండా, గుప్తా, గుప్తాకు తెలియకుండా చౌదరి చేసినవీ చెప్పి వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెడ్తాడు. సయీద్ ఇంటరాగేషన్‌ను మరిచిపోయి ఆ ఇద్దరూ గొడవపడ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి విఫలమవుతుంది నిదా. గుప్తాను కత్తితో పొడిచేస్తాడు చౌదరి. ఈ గొడవకు పరిగెత్తుకొచ్చిన డకున్హా, నిదా అంతా హతాశులవుతారు. అప్పుడూ నింద నిదా మీద తోసెయ్యడానికే చూస్తుంది మేజర్ దాస్. వాళ్లందరినీ బయటకు పంపేసి సయీద్‌కు కరెంట్ షాక్ ఇస్తాడు డకున్హా. ‘‘ఘూల్ ఘూల్’’ అని సణుగుతూ నోట్లోంచి నురగలు కక్కి తలవాల్చేస్తాడు సయీద్. అతను చనిపోయాడనుకుంటాడు డకున్హా. ఇదంతా రికార్డ్ రూమ్‌లోంచి గమనిస్తున్న నిదా.. సయీద్ సణిగిన మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. టెర్రరిస్ట్ ముద్రతో సెల్లో ఉన్న ఒక మౌల్వీని పిలిచి ఆ రికార్డింగ్ వినిపించి అర్థం అడుగుతుంది. బిత్తరపోతాడు మౌల్వీ. చెప్పమని గద్దిస్తుంది నిదా. ‘‘ఘూల్ అంటే అరబిక్‌లో ఆత్మ. సయీద్ మనిషి కాడు. వాడు ఆత్మ’’ అని చెప్పి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు మౌల్వీ. డకున్హా ఇంటరాగేషన్ గదిలోంచి బయటకు రాగానే నిదా వెళ్లి చూస్తుంది. అక్కడ సయీద్ శరీరం ఉండదు. మళ్లీ ఎప్పటిలాగే గొలుసులతో బంధించి ఉంటుంది. అతను వికటాట్టహాసం చేస్తుంటాడు. చంపాలని ప్రయత్నిస్తుంది కాని కుదరదు. అప్పుడు నిదాకూ నిర్ధారణవుతుంది సయీద్ మనిషి కాదు అని. ఆ విషయమే డకున్హా, మేజర్ దాస్లతో చెప్తుంది. ఎవరూ నమ్మరు. మేజర్ దాసైతే నిదానూ టెర్రరిస్ట్‌గా ముద్ర వేసేస్తుంది. ఇంకో రోజు.. ఇంటరాగేషన్ స్పెషలిస్ట్ ఫౌలాద్ సింగ్ వస్తాడు సయీద్‌ను హింసించడానికి. ఆ టైమ్‌లోనే నిదా మౌల్వీ సెల్‌లోకి వెళ్తుంది ఘూల్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం. అపరాధభావంతో బాధపడేవాళ్ల శరీరాన్ని ఘూల్ కోరుకుంటుందని, అలా వాళ్ల శరీరంలోకి జొరబడి ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్తాడు మౌల్వీ. తన తండ్రి గురించీ ఆరా తీస్తుంది. ఏమీ చెప్పడు మౌల్వీ. ఈ లోపు స్పెషల్ ఇంటరాగేషన్ సెల్ నుంచి పెద్ద కేక వినిపిస్తుంది. అటుగా పరిగెత్తుతుంది నిదా. అప్పుడే డకున్హాకు ఫోన్ వస్తుంది. ‘‘సర్.. సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’’ అనే సమాచారంతో. డకున్హాకు నోట మాటరాదు. మరిక్కడ ఉంది ఎవరు? స్పెషల్ ఇంటరాగేషన్ సెల్లో ఫౌలాద్ సింగ్ బాడీ కనిపిస్తుంది నిదాకు. సయీద్ అనుకుంటున్న వాడు ఏమైనట్టు? అనే డౌట్ వచ్చేలోపే ఫౌలాద్ సింగ్ శరీరంలో ఉన్న ఆత్మ గబగబా సెల్ నుంచి బయటకు వచ్చి ఇతర సెల్స్ తలుపులు తెరిచి అందులోని ఖైదీలందరినీ విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే నిదాను చూస్తుంది. ఆమె భయపడి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంది. సరైన సమయంలో డకున్హా అండ్ టీమ్ వచ్చి ఆమెను రక్షిస్తారు. అప్పడు జరిగిందంతా చెప్తుంది. వెళ్లి చూసి నిజమనే నమ్ముతారు. కాని మేజర్ దాస్ నమ్మదు. ఆ ఖైదీలను విడిపించడానికి నిదా ఆడుతున్న నాటకం అని, ఆమె వచ్చాకే ఆ సెంటర్ అంతా గందరగోళంగా తయారైందని, తమలో తామే తన్నుకు చస్తున్నారని మిగిలిన వాళ్లను రెచ్చగొడ్తుంది. వాళ్లూ నమ్ముతారు. మేజర్ దాస్ ఆజ్ఞ మేరకు నిదాను సెల్లో వేస్తారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మిగిలిన ఖైదీలు కనిపిస్తారు. ఆ గదిలో హత్యలు జరిగినట్టు గోడకు తుపాకీ తూటాల ఛిద్రాలు, రక్తం మరకలు కనిపిస్తాయి. అప్పుడు అర్థమవుతుంది నిదాకు. అది ఇంటరాగేట్ చేసి మనుషులను మార్చే సెంటర్ కాదు.. ఫక్తు హత్యలు చేసే సెంటర్ అని. అప్పుడు అక్కడే ఉన్న మౌల్వీని అడుగుతుంది మళ్లీ తన తండ్రి గురించి. చనిపోయి ఉంటాడని చెప్తాడు. అక్కడున్న ఖైదీల్లోనే ఎవరో ఘూల్ అన్న విషయమూ బోధపడ్తుంది నిదాకు. ‘అహ్మద్’ అనే వ్యక్తిని చూపిస్తూ నువ్వేనా అని అడుగుతుంది. ‘‘వాడు మూగవాడు.. ఆత్మ మూగవాడి శరీరంలోకి ప్రవేశించదు’’ అంటాడు మౌల్వీ. ‘‘ఒక టీ అమ్ముకునే వాడిని టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చారు. వీడి నుంచి విషయాలు ఏమీ రాబట్టలేకపోయే సరికి వీడి భార్య, కొడుకును పట్టుకొచ్చి వీడి కళ్లముందే చంపేశారు. అప్పటి నుంచి వీడికి మాట పడిపోయింది’’ అని జరిగింది చెప్తాడు మౌల్వీ. దిమ్మ తిరుగుతుంది నిదాకు. చిమ్నీ చూపించి దాన్నుంచి బయటకు పొమ్మని అహ్మద్‌కు చెప్పి తనూ అహ్మద్ వెనక వెళ్తుంది. అహ్మద్ బయటపడి.. నిదాకూడా బయటపడే టైమ్‌కి ఘూల్ ఆమెను లోపలికి లాగి కాలి పిక్కను కొరుకుతుంది. అయినా తప్పించుకుని బయటకు వస్తుంది. ఇద్దరూ కలిసి డకున్హా చాంబర్‌కు వెళ్తారు. అక్కడ జరిగిన పెనుగులాటలో నిదా రూపంలో ఉంది ఆత్మ అని అర్థమవుతుంది అహ్మద్ కు. లోపల అసలు నిదా ఉంటుంది. మేజర్ దాస్.. నిదాను చంపబోతుంటే డకున్హా మేజర్ దాస్‌ను చంపేస్తాడు. మిగిలిన వాళ్లలో ఒకొక్కరిలోకే ఆత్మ చేరి ఒకొక్కరినీ చంపేస్తుంటుంది. ఈలోపు తన తండ్రిని చంపమని ఆర్డర్ ఇచ్చింది డకున్హానే అని తెలుస్తుంది నిదాకు. పశ్చాత్తాపంతో కుమిలి పోతుంది. అహ్మద్‌తో కలిసి ఆ సెంటర్ నుంచి బయటకు వస్తుంది. బాంబు వేసి ఆ సెంటర్‌ను పేల్చేసి తనూ బయట పడ్తాడు డకున్హా. సెంటర్ బయట ఆర్మీ ఉంటుంది. డకున్హాను చూసి ‘‘వీడు మనిషి కాదు.. ఘూల్ ’’ అంటూ ఆర్మీ వారిస్తున్నా వినకుండా డకున్హాను చంపేస్తుంది నిదా. ఆర్మీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు చెప్తుంది నిదా.. ‘‘అది కోవర్ట్ డిటెన్షన్ సెంటర్ కాదు.. హత్యలు చేసే సెంటర్. అందరూ కరప్ట్ అయ్యారు’’అంటూ. నిదా కూడా టెర్రరిస్టే అని ముద్ర వేసి ఆమెనూ కోవర్ట్ డిటెన్షన్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ.. బ్లేడ్‌తో అర చేతిని కోసుకొని రక్త తర్పణ చేసి తన శరీరంలోకి ఘూల్ని ఆహ్వానించేందుకు సిద్ధపడ్తుంది నిదా!ఇక్కడితో ‘ఘూల్’ సీజన్ వన్ ఎండ్ అవుతుంది. హైపర్ నేషనలిజం, ఇస్లామోఫోబియా వల్ల తలెత్తిన ఘర్షణకు దృశ్యరూపం ‘‘ఘూల్’’. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంది. దర్శకుడు పాట్రిక్ గ్రాహమ్. – సరస్వతి రమ -
స్పైడర్ : మరో సర్ప్రైజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళ స్టార్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. హిందీ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను అరబ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు అరబిక్ లోనూ డబ్ చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటు అరబిక్ లోనూ ఒకేసారి సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. -
అరబిక్ మాట్లాడినందుకు దించేశారు
లాస్ ఏంజెలిస్: ఓ ముస్లిం విద్యార్థి తన అంకుల్‌తో అరబిక్‌లో మాట్లాడినందుకు విమానంలో నుంచి దించేశారు. కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన మఖ్జూమి లాస్ఏంజిలిస్ నుంచి ఓక్లాండ్కు వెళ్లేందుకు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానమెక్కాడు. తర్వాత.. ముందురోజు ఐరాస కార్యదర్శి బాన్కీమూన్తో జరిగిన భేటీలో పాల్గొన్నట్లు, ఇస్లామిక్ స్టేట్ గురించి ప్రశ్న కూడా సంధించినట్లు చెప్పాడు. ఫోన్ సంభాషణ అనంతరం ముస్లిం సంప్రదాయం ప్రకారం అరబిక్ భాషలో ‘ఇన్షా అల్లా’ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇది విన్న తోటి ప్రయాణికురాలు భయంతో పరుగులు తీసింది. సిబ్బంది అతన్ని దించేశారు. -
విమానంలో అరబిక్‌లో మాట్లాడినందుకు..
వాషింగ్టన్: ఎలాంటి కారణం లేకుండానే అమెరికాలో విమానం నుంచి మరో ప్రయాణికుడిని దించివేశారు. అరబిక్ భాషలో మాట్లాడినందుకే ఇలా చేశారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీ విద్యార్థి ఖైరుల్దీన్ మఖ్జూమీ (26) వాపోయాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మఖ్జూమీ ఇరాక్ నుంచి శరణార్థుడిగా అమెరికాకు వచ్చాడు. ఈ నెల 9న లాస్ ఏంజిలెస్ నుంచి కాలిఫోర్నియా వెళ్లేందుకు సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. విమానం బయల్దేరేముందు మఖ్జూమీ బంధువుకు ఫోన్ చేసి అరబిక్‌లో మాట్లాడాడు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పాల్గొనే సెమీనార్ గురించి చర్చించాడు. ఈ ఈవెంట్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై అడగాల్సిన ప్రశ్న గురించి మాట్లాడాడు. విమానంలో మఖ్జూమీ మందు వరుస సీటులో కూర్చున్న ఓ మహిళ అతనితో వాదనకు దిగింది. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అరబిక్ భాషలో ఎందుకు మాట్లాడావని మఖ్జూమీని ప్రశ్నించారు. అతణ్ని విమానం నుంచి దించివేశారు. ఎఫ్‌బీఐ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. మఖ్జూమీపై ఎలాంటి అనుమానాలు లేవని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మఖ్జూమీ 8 గంటల అనంతరం మరో విమానంలో వెళ్లాడు. ఈ ఘటనపై మఖ్జూమీ స్పందిస్తూ.. తనకు, తన కుటుంబానికి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయని, ఇది కేవలం మరో ఘటన అని అన్నాడు. -
ఇది అరబిక్ కళ అందం!
కళారూపాల పునఃసృష్టి కొత్తేమీ కాదు. ఇప్పడు అలాంటి ప్రయత్నం మరోసారి జరిగింది. అల్-జాజరి ‘మెకానికల్ డ్రాయింగ్స్’ను పునఃసృష్టి చేస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞ అనే ‘విశేషం’ చాలా సహజంగా అల్-జాజరి పేరు ముందు అమిరిపోతుంది. ఈ ఇరాకీ ప్రతిభావంతుడు రచయిత మాత్రమే కాదు పరిశోధకుడు, ఇంజనీర్, గణితశాస్త్రవేత్త. జాజిరత్ ఉమర్ నగరంలో పుట్టిన అల్-జాజరికి ఆ పట్టణం పేరు స్ఫురించేలా తల్లిదండ్రులు పేరు పెట్టారు. నిజానికి ఆయన ప్రతిభ గురించి తెలిసినంతగా వ్యక్తిగత విషయాలు తెలియవు. రకరకాల కళాత్మక వస్తువులను తయారు చేయడం మీద జాజరికి బాగా ఆసక్తిగా ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేసి కొత్త కొత్త పరికరాలను రూపొందించేవాడు. వాటర్-పవర్డ్ సిస్టమ్‌తో పని చేసే ఎన్నో యంత్రాలను తయారుచేశాడు. వాటర్ ఫ్లో, మూమెంట్‌తో రకరకాల పరికరాలను తయారుచేశాడు. కొన్ని తన సృజనలో నుంచి పుడితే మరికొన్ని పాతవస్తువుల నుంచి స్ఫూర్తి పొందాడు. తాను రాసిన ప్రసిద్ధ పుస్తకంలో ఆ పరికరాల పరిచయం ఉంది. ఆనాటి విజ్ఞానస్పృహకు అవి అద్దం పడతాయి. ‘మీరు కూడా స్వయంగా తయారుచేయవచ్చు’ అనే పద్ధతిలో ఆయన రచనలు ఉంటాయి. నీటిశక్తితో పనిచేసే పరికరాలను ‘షక్లు’ అనిపిలుస్తారు. వీటితో గ్రాఫికల్ డ్రాయింగ్స్ సృష్టించడంతో పాటు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అరబిక్ అక్షరమాల నుంచి కొన్ని భిన్నమైన అక్షరాలను ఉపయోగించి బొమ్మలను గీయడమనే పద్ధతి ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో అల్-జాజరి రూపొందించిన మెకానికల్ డ్రాయింగ్స్‌ను ఇప్పుడు పునఃసృష్టిస్తున్నారు. తాజాగా ఎనిమిదివందల సంవత్సరాల క్రితం నాటి అల్-జాజరి పుస్తకం ఆధారంగా చరిత్రకారుడు బెర్ట్ హాల్ టోరోంటోకు చెందిన డిజైనర్ క్రిస్ సహాయ సహాకారాలతో ఆనాటి ‘మెకానికల్ డ్రాయింగ్స్’ను పునఃసృష్టిస్తున్నాడు.