ఇది అరబిక్ కళ అందం!
కళారూపాల పునఃసృష్టి కొత్తేమీ కాదు. ఇప్పడు అలాంటి ప్రయత్నం మరోసారి జరిగింది. అల్-జాజరి ‘మెకానికల్ డ్రాయింగ్స్’ను పునఃసృష్టి చేస్తున్నారు.
బహుముఖ ప్రజ్ఞ అనే ‘విశేషం’ చాలా సహజంగా అల్-జాజరి పేరు ముందు అమిరిపోతుంది. ఈ ఇరాకీ ప్రతిభావంతుడు రచయిత మాత్రమే కాదు పరిశోధకుడు, ఇంజనీర్, గణితశాస్త్రవేత్త. జాజిరత్ ఉమర్ నగరంలో పుట్టిన అల్-జాజరికి ఆ పట్టణం పేరు స్ఫురించేలా తల్లిదండ్రులు పేరు పెట్టారు. నిజానికి ఆయన ప్రతిభ గురించి తెలిసినంతగా వ్యక్తిగత విషయాలు తెలియవు.
రకరకాల కళాత్మక వస్తువులను తయారు చేయడం మీద జాజరికి బాగా ఆసక్తిగా ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేసి కొత్త కొత్త పరికరాలను రూపొందించేవాడు.
వాటర్-పవర్‌డ్ సిస్టమ్‌తో పని చేసే ఎన్నో యంత్రాలను తయారుచేశాడు. వాటర్ ఫ్లో, మూమెంట్‌తో రకరకాల పరికరాలను తయారుచేశాడు. కొన్ని తన సృజనలో నుంచి పుడితే మరికొన్ని పాతవస్తువుల నుంచి స్ఫూర్తి పొందాడు.
తాను రాసిన ప్రసిద్ధ పుస్తకంలో ఆ పరికరాల పరిచయం ఉంది. ఆనాటి విజ్ఞానస్పృహకు అవి అద్దం పడతాయి. ‘మీరు కూడా స్వయంగా తయారుచేయవచ్చు’ అనే పద్ధతిలో ఆయన రచనలు ఉంటాయి.
నీటిశక్తితో పనిచేసే పరికరాలను ‘షక్లు’ అనిపిలుస్తారు. వీటితో గ్రాఫికల్ డ్రాయింగ్స్ సృష్టించడంతో పాటు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అరబిక్ అక్షరమాల నుంచి కొన్ని భిన్నమైన అక్షరాలను ఉపయోగించి బొమ్మలను గీయడమనే పద్ధతి ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో అల్-జాజరి రూపొందించిన మెకానికల్ డ్రాయింగ్స్‌ను ఇప్పుడు పునఃసృష్టిస్తున్నారు.
తాజాగా
ఎనిమిదివందల సంవత్సరాల క్రితం నాటి అల్-జాజరి పుస్తకం ఆధారంగా చరిత్రకారుడు బెర్ట్ హాల్ టోరోంటోకు చెందిన డిజైనర్ క్రిస్ సహాయ సహాకారాలతో ఆనాటి ‘మెకానికల్ డ్రాయింగ్స్’ను పునఃసృష్టిస్తున్నాడు.