సెలెస్టియల్ బాడీస్ నవలకుగానూ 2019 మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న ఒమాన్ రచయిత్రి జోఖా అల్హార్తీ. అరబ్ దేశాల నుండి ఈ పురస్కారం పొందిన మొదటి రచయిత. పక్కన నవల ఆంగ్లానువాదకురాలు మారిలీన్ బూథ్
కొత్త బంగారం
ఒమాన్ రాజధాని నగరం మస్కట్‌కు దగ్గర్లోనే ఉన్న కాల్పనిక ఊరైన ‘అల్ అవాఫీ’ లో ధనిక కుటుంబపు సలీమా, అజ్జాన్‌లకు ముగ్గురు కూతుళ్ళు. మయ్యాకు కుట్టుపనంటే ఇష్టం. తనిష్టపడిన అలీతో ప్రేమ విఫలమై, ధనవంతుడైన అబ్దల్లాని పెళ్ళి చేసుకుంటుంది. పుస్తక పురుగైన అస్మాకు తల్లిదండ్రుల ఇష్టప్రకారం ఖాలిద్‌తో పెళ్ళవుతుంది. ఆఖరిదైన ఖ్వాలా, కెనెడా నుంచి తిరిగి వచ్చిన తండ్రి సహోదరుడి కొడుకును వివాహమాడుతుంది.
మయ్యా తన కూతురుకి ‘లండన్’ అన్న పేరు పెడుతుంది. భర్తను పట్టించుకోదు. ‘మయ్యా, ప్రేమంటే తెలియదా? నీ కళ్ళెప్పుడూ కుట్టు మెషీన్ మీదే ఉంటాయి తప్ప నన్ను గానీ నా ప్రేమని గానీ ఎందుకు చూడలేవు?’ అని అబ్దల్లా అడిగి, ‘యీ టీవీ డైలాగులేమిటి? నీవు చూసే ఈజిప్షియన్ సినిమాల ప్రభావమా!’ అన్న మయ్యా ఎగతాళిని ఎదురుకుంటాడు. అజ్జాన్– ‘చందమామంత అందంగా ఉండే’ నాజియాతో ప్రేమలో పడి, సలీమాను నిర్లక్ష్యపెడతాడు. జరీఫా– అబ్దల్లా తండ్రి సులేమాన్ ఇంటి బానిస.
ఒమాన్ సమాజంలో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పులను అంగీకరించే ముగ్గురు అక్కచెల్లెళ్ళనీ, వారి కుటుంబాలనీ అనుసరిస్తుంది జోఖా అల్హార్తీ రాసిన ‘సెలెస్టియల్ బాడీస్’ నవల. గత సంఘటనల ద్వారా– రచయిత్రి, పాఠకులకు ఒమాన్ దేశపు పేదరికాన్నీ, పడిన కష్టాలనూ చిన్నచిన్న సంఘటనల ద్వారా చూపుతారు (బ్రిటిష్ పాలన, తిరుగుబాటు, ఒప్పందం) .
అబ్ద్దల్లా– తండ్రి చేసిన బానిసల వర్తకం గుర్తు చేసుకుంటాడు. ‘‘ఆయన అరవడం మానలేదు. ‘ఒరేయ్, సంజర్‌ను గుంజకు కట్టేయండ్రా. వాడికి ఎవరు నీళ్ళిచ్చినా, నీడ కలిపించినా నాకు సమాధానం చెప్పాలి’ అన్నప్పుడు– ‘నాన్నా, ప్రభుత్వం బానిసలను విడిపించి ఎన్నేళ్ళో అయింది’’ అంటాడు అబ్దల్లా. అతనికి నిద్రలో ఒకే జ్ఞాపకం కలలో వస్తుంటుంది. తండ్రి తనను నూతిలో తలకిందులా వేళ్ళాడదీయడం. ‘అయ్యో, వద్దు, వద్దు’ అని వేడుకుంటున్నప్పుడు మెలకువ వస్తుంది. తనను పెంచిన జరీఫాను తన తల్లి గురించి ఎన్నిసార్లు అడిగినా, ఆమె మరణించిందని తప్ప సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. తల్లి జీవించే ఉందన్న సూచన మాత్రం నవల చివర్న కనబడుతుంది.
జరీఫా కొడుకు, ‘నాకు పెళ్ళి చేసి మమ్మల్నిద్దరినీ పని చేయిస్తాడు సులేమాన్. ఇప్పుడు మనం బానిసలం కాము’ అన్నప్పుడు, తల్లి ‘అతనే లేకపోతే మనం ముష్టెత్తుకునేవాళ్ళం’ అంటుంది. ఒమాన్లో బానిసత్వం 1970 లోనే రద్దయినప్పటికీ, బానిసల ప్రవర్తన గానీ బానిసల యజమానుల ఆలోచనలు గానీ మారవు. లండన్– బానిస సంతతిని పెళ్ళి చేసుకుని– అతని దాంపత్య ద్రోహం, అతను తన్ని కొట్టడం భరించలేక విడాకులు తీసుకుంటుంది.
ఒమాన్లో కాన్పు తరువాత పొట్ట రాకుండా, 40 రోజులు కడుపుకి రాయిని కడతారు. ఇంటి బయట వేరే గదిలో ఉంచుతారు. పెళ్ళికి ముందు వారంపాటు పెళ్ళి కూతుర్ని ఎవరూ చూడకూడదు. ఆస్మా పెళ్ళప్పుడు, అందరూ ఒక బంధువు ఉదంతం చెప్పుకుంటారు: శోభనపు రాత్రి భర్తను ఏడిపించేందుకు ఒకామెకు సూది కొనలుండే గాజులు తొడుగుతారు. అదర్థం కాని ఆమె– రాత్రి భర్త తనను సమీపించినప్పుడల్లా గాజులతో గుచ్చిగుచ్చి పెడుతుంది. నెలరోజుల తరువాత భయపడిన భర్త అడుగుతాడు: ‘నన్ను బలవంతంగా కట్టబెట్టారా, నన్నిలా గాజులతో చంపుతున్నావు!’ అని. చితక్కొట్టి్టన వెల్లుల్లి రెబ్బకి సూది గుచ్చి(ఇన్‌ఫెక్షన్ రాకుండా), ఆడపిల్లల చెవులకి పైనుండి కిందవరకూ పది కన్నాలు పొడుస్తారు. ఇలాంటి ఆచారాల వివరాలెన్నో ఉంటాయి పుస్తకంలో.
ఒమాన్ ఉన్నత వర్గం– అత్తరు మానేసి, గూచీ పెర్‌ఫ్యూమ్ ఆధునికతనైతే అలవరచుకుంటుంది గానీ దృక్పథం మాత్రం సనాతనమైనదే. అధికారం ఉండేది పురుషుని చేతిలోనే. రచయిత్రి అల్హార్తీ బానిసలను గొప్పగానూ చూపించరు, బానిసల యజమానులను దుయ్యనూబట్టరు. అక్కచెల్లెళ్ళ జీవితాల కథలు చూపుతూ ఎడారి ప్రాంతం నుండి రాజధానికి చేరిన మూడు తరాల కథలనూ చెప్తారు.
రచనకున్న నిర్మాణ క్రమం గమనింపతగ్గది. 60 అధ్యాయాలున్న నవల్లో– ఒక అధ్యాయం ప్రథమ పురుషలో ఉన్న ఒక పాత్ర కథనం అయితే, రెండోది విమానంలో కూర్చుని తన జీవితం గురించి ఆలోచించుకుంటున్న అబ్దల్లా గొంతుతో ఉంటుంది.
అయితే, ఒక క్రమం అంటూ లేని కథనాలన్నీ గతంలో జరిగిన సంఘటనలను వర్ణించేవే. ప్రతీ అధ్యాయం భిన్నమైన పాత్రల మీద కేంద్రీకరిస్తుంది. ఎవరెవరికి ఏ విధమైన చుట్టరికమో తెలుసుకోడానికి, మొదటి పేజీలో ఉన్న వంశవృక్షాన్ని అస్తమానం చూడాల్సి వస్తుంది. నవలకున్న కొద్దిపాటి కథాంశమేదో మొదట్లోనే ఉంటుంది. అల్హార్తీ చేసినదల్లా అక్కడున్న ఖాళీలని పూరించడమే. జాతి, బానిసత్వం, లింగం గురించిన పడికట్టు మాటలేవీ ఉపయోగించరు రచయిత్రి. ఒక నిర్దిష్టమైన ముగింపు లేని నవలిది. సంభాషణలు తక్కువ. అవి కూడా కథనంలో కలిసిపోయి ఉంటాయి. ప్రతి పాత్రా ఏదో విధానంలో చరిత్రలో చిక్కుకునే ఉంటుంది. విమోచన కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. లండన్ డాక్టర్ అయివుండి కూడా ముందుకు కదలలేకపోతుంది.
నవలకు ఈ వారంలోనే ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ ప్రదానం చేశారు. అరబ్ దేశాల నుండి మొట్టమొదటి మ్యాన్ బుకర్ అవార్డ్ పొందిన రచయిత అల్హార్తీ. 2016 నుంచి మారిన నియమాల ప్రకారం, యాబై వేల పౌండ్ల అవార్డ్ సొమ్ముని పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించిన మారిలిన్ బూథ్‌తో పంచుకున్నారు. అల్హార్తీ– ఎడిన్బర్ యూనివర్సిటీ నుండి క్లాసికల్ అరబిక్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ పొందారు. ప్రస్తుతం ఒమాన్‌లోని సుల్తన్ ఖాబూస్ యూనివర్సిటీలో అరబిక్ డిపార్టుమెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment