రెండు రోజులుగా ట్విట్టర్‌లో ఒక విశేషం వైరల్ అవుతోంది. అస్మితాఘోష్ అనే యువతి ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్లింది. బెంగాలీ పెళ్లే అది. పెళ్లి తంతును మహిళా పూజారులు నిర్వహించారు! అది ఆ అమ్మాయికి సంతోషంగా అనిపించింది. అస్మిత ఫెమినిస్ట్. గాయని. రచయిత్రి. ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి కనుక సహజంగానే ఆమెకు పెళ్లి వేదికపై మహిళా పురోహితులు కనిపించడం సంతోషాన్నిచ్చే సంగతి అయింది. మంత్రోచ్చాటనగా వధువును ఆ పురోహితులు పరిచయం చేసిన విధానం కూడా అస్మితను ఆకట్టుకుంది. మొదట వాళ్లు తల్లి పేరు చెప్పారు. తర్వాత తండ్రి పేరు చెప్పారు. ఆ తల్లిదండ్రుల కూతురే ఈ వధువు అని చెప్పారు. తల్లి పేరు ముందు చెప్పడం అస్మితను ముగ్ధురాలిని చేసింది.
కన్యాదానం దగ్గరికి వచ్చేసరికి ఆ తండ్రి.. ‘‘నేను కన్యాదానం ఇవ్వను’’ అనేశారు! అస్మిత్ పోస్ట్ చేసిన ఫొటోలో లేరు కానీ, పెళ్లికొచ్చిన అతిథులు ఆ మాటకు నివ్వెరపోయారు. ‘‘అవును. నేను కన్యాదానం చేయబోవడం లేదు. నా కూతురు ఆస్తి కాదు. దానం ఇవ్వడానికి’’ అన్నారు. ఇది కూడా అస్మితకు నచ్చింది. వెంటనే వధూవరులున్న ఒక ఫొటోను ఎంపిక చేసుకుని, ఫొటోతో పాటు వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘అయామ్ సో ఇప్రెస్డ్’ అని కామెంట్ కూడా పెట్టింది. ఫిబ్రవరి నాలుగున పోస్ట్ పెడితే ఇప్పటికింకా నిరవధికంగా లైక్‌లు వస్తూనే ఉన్నాయి. దాదాపు అందరి అభిప్రాయం ఒక్కటే. ‘మెల్లిమెల్లిగా సంప్రదాయాలను, ఆచారాలను మార్చుకుంటూ వస్తున్నాం.
ఇది మంచి విషయం’ అని. అషీమా అనే అమ్మాయి.. ‘ఇది ఏ గ్రహంలో జరిగింది? అందమైన మనుషులు’ అని ట్వీట్ చేసింది. దేవిప్రసాద్ మిశ్రా అనే అతను ‘దిస్ ఈజ్ ఎక్స్‌లెంట్. థ్యాంక్యూ ఫర్ షేరింగ్’ అని కామెంట్ ఇచ్చాడు. విమల్ అరోరా ‘ప్రోగ్రెసివ్’ అన్నాడు. రమేశ్ చంద్ర అనే యువకుడు ‘వెరీ బ్రేవ్ ఆఫ్ దెమ్! ఆదర్శప్రాయం’ అని ట్వీట్ పెట్టాడు. దీనిని బట్టి యువతరం ఆలోచనా ధోరణి అధునాతనం అవుతోందని తెలుస్తోంది. పూర్వ ఆచారాలను వారేమీ పూర్తిగా నిరాకరించడం లేదు. వాటిలోని అంతరార్థాలు తెలిశాక, అవి నచ్చకపోతే తిరస్కరిస్తున్నారు. ఇలాంటి ఘటనే, పశ్చిమబెంగాల్‌లోనే ఇటీవల ఒకటి జరిగింది.
వధువు ‘కనకాంజలి’ అనే ఆచారాన్ని పెళ్లి పీటల మీదే తిరస్కరించింది. వధువు గుప్పెట నిండా బియ్యం తీసుకుని తలపై పోసుకుంటూ, ‘‘నా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చేశాను’’ అని చెప్పడమే కనకాంజలి ఆచారంలోని పరమార్థం. అయితే ఆ వధువు.. ‘‘తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరేదీ, తీర్చుకోగలిగిందీ కాదు. కనుక నేను ఆ మంత్రాన్ని జపించలేను’’ అని ధైర్యంగా పురోహితులతో చెప్పడం అనేక మంది అభినందనలకు కారణమైంది. అస్మితా ఘోష్‌ను కూడా ఇప్పుడు మనం అభినందించాలి. ఆమే కనుక ట్వీట్‌లో తను వెళ్లిన పెళ్లిలోని ప్రత్యేకతల గురించి చెప్పకుంటే ఆ ప్రత్యేకతలు అక్కడితో ఆగిపోయేవి.
Comments
Please login to add a commentAdd a comment