Asmita
-
మేము అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండాలి
మోతె: రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన గురుకుల పాఠశాలల విద్యార్థుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అస్మిత ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని స్వగ్రామం మోతె మండలంలోని బుర్కచర్లలో కుటుంబ సభ్యులను కవిత మంగళవారం పరామర్శించారు. అస్మితకు నివాళులర్పించి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి చేతులెత్తి జోడించారు. ప్రతి హాస్టల్లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. తల్లిదండ్రులు పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని కవిత కోరారు. ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం చొరవ చూపి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఉన్నారు. -
విద్యార్థినుల ఆత్మహత్యల కలకలం!
సూర్యాపేట రూరల్: సూర్యాపేట జిల్లా ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడటం పలు అనుమాలకు తావిస్తోంది. ఇదే పాఠశాలలో ఇంటర్మిడియట్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ఈ నెల 10న హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వ అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీని సస్పెండ్ చేశారు. సెలవులు ఇవ్వడంతో.. వైష్ణవి ఉదంతం మరువకముందే తాజాగా ఇదే పా ఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్, జ్యోతిల కుమార్తె అస్మిత (15) శనివారం హైదరాబాద్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వైష్ణవి ఆత్మహత్య అనంతరం విద్యార్థినులు భయపడకుండా ఉంటానికి పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. దీంతో అస్మిత సెలవుల్లో హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్న తల్లి వద్దకు వెళ్లింది. శనివారంతో సెలవులు అయిపోతున్నందున తిరిగి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి.. తల్లి తన పనులకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుందని బంధువులు తెలిపారు. పాఠశాలకు తిరిగి వెళ్లాల్సిన రోజే అస్మిత ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అస్మిత, వైష్ణవి రూమ్మేట్స్? గురుకుల పాఠశాల విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థినులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి రూమ్‌లోనే అస్మిత కూడా ఉండేదని తెలిసింది. ఒకే రూమ్‌లో ఉండటంతో వైష్ణవి మరణాన్ని జీ ర్ణించుకోలేక అస్మిత కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు చెపుతున్నారు. వారం వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ఆత్మహత్యలకు పాల్పడటం వారి కుటుంబాలు, తోటి విద్యార్థినుల్లో విషాదాన్ని నింపింది. అస్మిత మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం బుర్కచర్ల తీసుకువచ్చి ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇమాంపేట గురుకుల పాఠశాల తనిఖీ ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం సోషల్ వెల్ఫేర్ గు రుకుల కార్యదర్శి సీతాలక్ష్మి తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, బాలికల విశ్రాంతి గదులను పరిశీలించారు. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్ద రు బాలికల ఆత్మహత్యల నేపథ్యంలో విద్యార్థినుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించాలని, పిల్లలతో మమేకమై వారిని ఆటపాటలతో ఆనందింపజేయా లని సూచించారు. గురుకులాల్లో మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సైకియాట్రిస్టులతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఆమె వెంట గురుకుల జాయింట్ సెక్రటరీ అనంతలక్షి్మ, నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ ప్రశాంతి, ఇన్చార్జి ప్రిన్సిపాల్ అరుణకుమారి ఉన్నారు. ఉన్నతాధికారుల ఆరా.. ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది? విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఏమి టి? తదితర అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సోమవారం గురుకుల పాఠశాలకు కలెక్టర్, అదనపు కలెక్టర్లు వెళ్లి విచార ణ జరపనున్నట్లు సమాచారం. ఈ తరహా ఘటనల వల్ల పాఠశాలలో విద్యనభ్యసించే ఇతర విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. -
సెమీస్‌లో ఓడిన అష్మిత
థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా సెమీఫైనల్లో వెనుదిరిగింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 61వ ర్యాంకర్ అష్మిత 13–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. అష్మితకు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
బెంజ్ కారు కొన్న బుల్లితెర నటి, ధర ఎన్ని లక్షలో తెలుసా?
అటు సీరియల్స్, ఇటు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నటి అస్మిత. సీరియల్స్‌తో బిజీగా ఉన్న సమయంలో యూట్యూబ్‌లో యష్ ట్రిక్స్ పేరిట ఛానల్ ఓపెన్ చేసింది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది నటి. హోం టూర్, ట్రావెలింగ్ వ్లాగ్, లొకేషన్లో చేసే అల్లరి, షాపింగ్ వ్లాగ్.. ఇలా అన్నింటినీ యూట్యూబ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు వినోదాన్ని పంచుతోంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న అస్మిత తాజాగా మెర్సిడిస్ బెంజ్ కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. 'ఈ అందమైన కారును నిన్న ఇంటికి తీసుకొచ్చేశాం. ఆనందంతో నా మనసు ఉప్పొంగుతోంది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరి ముఖాల్లోనూ సంతోషం కనిపించింది' అంటూ కొత్త కారు ముందు దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ కారు ధర అర కోటి పైనే ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త కారు కొన్న అస్మితకు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా అస్మితది మార్వాడీల కుటుంబం. ఆమె కలకత్తాలో జన్మించింది. తన చిన్నతనంలో కుటుంబం హైదరాబాద్ వచ్చి సెటిలైపోయింది. చిన్నప్పటి నుంచి అస్మితకు మోడలింగ్ అంటే పిచ్చి. కానీ ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. యాడ్ ఛాన్స్ వస్తే నో చెప్పారు. అయినా సరే వదలకుండా స్థానికంగా జరిగిన మోడలింగ్ పోటీలో అస్మిత పాల్గొని గెలిచింది. అప్పుడు ఇంట్లోవాళ్లకు నమ్మకం కలగడంతో ఓకే అన్నారు. అలా యాడ్స్‌లో బిజీ అయిన సమయంలో సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చింది. బుల్లితెరపై సీరియల్స్ చేస్తున్న సమయంలో మురారి, లవ్ టుడే, అప్పుడప్పుడు, అతిథి.. ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. అప్పట్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చినా ఇంట్రస్ట్ లేక వదిలేశానని గతంలో చెప్పింది అస్మిత. చదవండి: మాళవిక బోల్డ్ కామెంట్స్.. సిగ్గుతో మెలికలు తిరిగిన హీరోయిన్ -
పెళ్లి పీటలెక్కిన ప్రముఖ టీవీ నటి..
ప్రముఖ టెలివిజన్ నటి అస్మిత పెళ్లి పీటలు ఎక్కారు. కొరియోగ్రాఫర్ సుధీర్‌తో ఆమె వివాహం జరిగింది. చాలా కాలం క్రితమే తాను సుధీర్‌తో ప్రేమలో ఉన్నట్టు ఆస్మిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వీరిద్దరి వివాహం జరగగా.. శనివారం రోజున వీరి రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు పలువురు టీవీ నటులు, యాంకర్లు హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పలువురు నటీమణులు సోషల్ మీడియా పోస్ట్ చేశారు. పంజరం, పద్మవ్యుహం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాహలక్ష్మి, మనసు మమత.. సీరియళ్లలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. సీరియళ్లలో మాత్రమే కాకుండా అతిథి, కలెక్టర్ గారి భార్య, మధుమాసం.. చిత్రాల్లో కూడా నటించారు. -
కన్యాదానం ఇవ్వను
రెండు రోజులుగా ట్విట్టర్లో ఒక విశేషం వైరల్ అవుతోంది. అస్మితాఘోష్ అనే యువతి ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్లింది. బెంగాలీ పెళ్లే అది. పెళ్లి తంతును మహిళా పూజారులు నిర్వహించారు! అది ఆ అమ్మాయికి సంతోషంగా అనిపించింది. అస్మిత ఫెమినిస్ట్. గాయని. రచయిత్రి. ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి కనుక సహజంగానే ఆమెకు పెళ్లి వేదికపై మహిళా పురోహితులు కనిపించడం సంతోషాన్నిచ్చే సంగతి అయింది. మంత్రోచ్చాటనగా వధువును ఆ పురోహితులు పరిచయం చేసిన విధానం కూడా అస్మితను ఆకట్టుకుంది. మొదట వాళ్లు తల్లి పేరు చెప్పారు. తర్వాత తండ్రి పేరు చెప్పారు. ఆ తల్లిదండ్రుల కూతురే ఈ వధువు అని చెప్పారు. తల్లి పేరు ముందు చెప్పడం అస్మితను ముగ్ధురాలిని చేసింది. కన్యాదానం దగ్గరికి వచ్చేసరికి ఆ తండ్రి.. ‘‘నేను కన్యాదానం ఇవ్వను’’ అనేశారు! అస్మిత్ పోస్ట్ చేసిన ఫొటోలో లేరు కానీ, పెళ్లికొచ్చిన అతిథులు ఆ మాటకు నివ్వెరపోయారు. ‘‘అవును. నేను కన్యాదానం చేయబోవడం లేదు. నా కూతురు ఆస్తి కాదు. దానం ఇవ్వడానికి’’ అన్నారు. ఇది కూడా అస్మితకు నచ్చింది. వెంటనే వధూవరులున్న ఒక ఫొటోను ఎంపిక చేసుకుని, ఫొటోతో పాటు వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘అయామ్ సో ఇప్రెస్డ్’ అని కామెంట్ కూడా పెట్టింది. ఫిబ్రవరి నాలుగున పోస్ట్ పెడితే ఇప్పటికింకా నిరవధికంగా లైక్‌లు వస్తూనే ఉన్నాయి. దాదాపు అందరి అభిప్రాయం ఒక్కటే. ‘మెల్లిమెల్లిగా సంప్రదాయాలను, ఆచారాలను మార్చుకుంటూ వస్తున్నాం. ఇది మంచి విషయం’ అని. అషీమా అనే అమ్మాయి.. ‘ఇది ఏ గ్రహంలో జరిగింది? అందమైన మనుషులు’ అని ట్వీట్ చేసింది. దేవిప్రసాద్ మిశ్రా అనే అతను ‘దిస్ ఈజ్ ఎక్స్లెంట్. థ్యాంక్యూ ఫర్ షేరింగ్’ అని కామెంట్ ఇచ్చాడు. విమల్ అరోరా ‘ప్రోగ్రెసివ్’ అన్నాడు. రమేశ్ చంద్ర అనే యువకుడు ‘వెరీ బ్రేవ్ ఆఫ్ దెమ్! ఆదర్శప్రాయం’ అని ట్వీట్ పెట్టాడు. దీనిని బట్టి యువతరం ఆలోచనా ధోరణి అధునాతనం అవుతోందని తెలుస్తోంది. పూర్వ ఆచారాలను వారేమీ పూర్తిగా నిరాకరించడం లేదు. వాటిలోని అంతరార్థాలు తెలిశాక, అవి నచ్చకపోతే తిరస్కరిస్తున్నారు. ఇలాంటి ఘటనే, పశ్చిమబెంగాల్లోనే ఇటీవల ఒకటి జరిగింది. వధువు ‘కనకాంజలి’ అనే ఆచారాన్ని పెళ్లి పీటల మీదే తిరస్కరించింది. వధువు గుప్పెట నిండా బియ్యం తీసుకుని తలపై పోసుకుంటూ, ‘‘నా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చేశాను’’ అని చెప్పడమే కనకాంజలి ఆచారంలోని పరమార్థం. అయితే ఆ వధువు.. ‘‘తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరేదీ, తీర్చుకోగలిగిందీ కాదు. కనుక నేను ఆ మంత్రాన్ని జపించలేను’’ అని ధైర్యంగా పురోహితులతో చెప్పడం అనేక మంది అభినందనలకు కారణమైంది. అస్మితా ఘోష్‌ను కూడా ఇప్పుడు మనం అభినందించాలి. ఆమే కనుక ట్వీట్లో తను వెళ్లిన పెళ్లిలోని ప్రత్యేకతల గురించి చెప్పకుంటే ఆ ప్రత్యేకతలు అక్కడితో ఆగిపోయేవి. -
ఎవరు ఆడారు?
హాస్యనటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఖయ్యుమ్ (అలీ తమ్ముడు) ఫస్ట్ టైమ్ హీరోగా నటించిన చిత్రం ‘డర్టీ గేమ్’. అస్మిత కథానాయిక. షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై తాడి మనోహర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని దర్శకుడు సాగర్, నిర్మాత ప్రసన్న కుమార్ విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘మంచి కథ కుదిరింది. డర్టీ గేమ్ ఏంటి? ఎవరెవరు ఆడారు? అన్నది ఆసక్తికరం. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ అంశాలన్నీ మా చిత్రంలో ఉంటాయి. సునీల్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేసిన నేను ఈ చిత్రం చేయడానికి కారణం కథ నచ్చడమే. పాటలు ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని సునీల్ కశ్యప్ అన్నారు. ఖయ్యుమ్, అస్మిత, కవిత, జీవీ, కోటా శంకర్ రావు, సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బీఎస్ కుమార్. -
ఏడ్చింది చాలు ఇక ఏడిపిస్తా - అస్మిత
టెలివిజన్ టాప్ ఆర్టిస్టుల లిస్టులో మొదటి వరుసలో ఉండే పేరు అస్మిత. పంజరం, పద్మవ్యూహం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాలక్ష్మి... ఇలా ఎన్నో సీరియళ్లలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారామె. టాలెంట్, తెగువ, తెలివితేటలు, సమయస్ఫూర్తి... అన్నీ సమపాళ్లలో ఉన్న వ్యక్తి ఆమె. తన కెరీర్ గురించి, తన అనుభవాల గురించి అస్మిత సాక్షితో ఇలా పంచుకున్నారు... ఎప్పుడూ సీరియల్స్‌లో కనిపించే మీరు... ఆ మధ్య వార్తల్లో కనిపించారు? అవును. అదో పీడకల. నేను కారులో పోతుంటే కొందరు వెంబడించి వేధించారు. వెంటనే ఫొటో తీసి, షి టీమ్‌కి వాళ్లను పట్టించాను. అప్పటికే రెండు మూడుసార్లు అలాంటివి ఫేస్ చేశాను. ఇంక ఆ రోజు తట్టుకోలేక ఆ పని చేశాను. మీకు ధైర్యం ఎక్కువే? ఆ ధైర్యం ఉండాలి. ఎవరో వచ్చి వేధిస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మన భయం... వాళ్లకు అవకాశం. అదే ధైర్యం చేసి ఎదురు తిరిగితే, వాళ్లే భయపడి పారిపోతారు. అందుకే నేను చెప్తుంటాను... ఆడపిల్లలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, ఆపద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి, తెలివిగా అడుగు వేయాలి అని. చాలా డైలీ సీరియల్స్‌లో నిస్సహాయ మహిళగా, జాలిగొలిపే పాత్రలు చేశారు. కానీ స్వతహాగా మీరలా కాదన్నమాట? అవును. సీరియళ్లలో అంటే పాత్రల్ని బట్టి అలా చేయాల్సి వస్తుంది. బయట అలా ఉండను. చెప్పాలంటే సీరియళ్లలో కూడా ఏడ్చీ ఏడ్చీ విసుగొచ్చేసింది. అందుకే ఏడ్చేది కాకుండా ఏడిపించే పాత్ర చేయాలనకున్నా. ‘సీతామాలక్ష్మి’లోని మాలినీదేవి పాత్రతో ఆ కోరిక తీరింది. ఆ సీరియల్ హీరో నాగబాబుగారైతే, ‘నీలో నాకు ఒకలాంటి యారొగెన్స్ కనిపించేది, నెగటివ్ రోల్ బాగా చేయగలవని అనిపించేది, అది నిజమైంది’ అన్నారు. ఇక చూడండి, ఏడ్వను.. ఏడిపిస్తా! ఈ మధ్య పెద్ద వయసు పాత్రలు చేస్తున్నారు. కావాలనే చేస్తున్నారా లేక అవకాశాలు లేక..? లేదు లేదు... అవకాశాలు లేకపోవడమన్నది ఎప్పుడూ లేదు. కావాలనే చేస్తున్నాను. నిజానికి అవన్నీ మొదట వయసులో ఉన్న పాత్రలు. జనరేషన్స్ మారినప్పుడు నా పాత్ర ముసలిదయ్యింది... అంతే. అసలు నటిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది? మాది మార్వాడీల కుటుంబం. మా తాతగారువాళ్లు వ్యాపారరీత్యా కలకత్తాలో ఉన్నప్పుడు, నేను అక్కడే పుట్టాను. నా చిన్నతనంలోనే మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చి సెటిలైపోయింది. నాకు చిన్నప్పట్నుంచీ మోడలింగ్ అంటే పిచ్చి. కానీ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు ఓ జీన్స్ కంపెనీ యాడ్ చేసే చాన్స్ వస్తే నో అన్నారు. అయినా వదలకుండా నేను స్థానికంగా జరిగిన ఓ మోడలింగ్ పోటీలో పాల్గొని గెలిచాను. అప్పుడు ఓకే అన్నారు. దాంతో యాడ్స్‌లో బిజీ అయిపోయాను. ఆ తర్వాత ‘మనుషులు మమతలు’ సీరియల్లో చాన్స్ వచ్చింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదింక. అప్పట్లో సినిమాలూ చేశారు. ఇప్పుడు చేయడం లేదేంటి? ‘మనుషులు మమతలు’ చేస్తున్నప్పుడే ‘మురారి’ సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత వరుసగా లవ్ టుడే, అప్పుడప్పుడు, మధుమాసం, అతిథి... ఇలా వరుసగా కొన్ని చేసుకుంటూ పోయాను. అవన్నీ తెలిసినవాళ్ల ద్వారా వచ్చిన అవకాశాలు. నాకైతే సినిమాలపై పెద్ద ఆసక్తి లేదు. అందుకే హీరోయిన్గా చేసే చాన్స్ వచ్చినా వదిలేశాను. ఈ పరిశ్రమలో మీకు నచ్చేదేంటి... నచ్చనిదేంటి? నటనంటే ఆసక్తి. నటించే అవకాశం ఇచ్చిన పరిశ్రమ అంటే ఇష్టం. ఇక నచ్చనిదంటే... టైమింగ్స్. షెడ్యూల్స్ చాలా టైట్‌గా ఉంటాయి. రోజంతా పని చేస్తూనే ఉంటాం. ఒక్కోసారి చాలా అలసట వచ్చేస్తుంది. మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా మార్పులొచ్చాయి. వాటిలో మంచివీ ఉన్నాయి, బాధ పెట్టేవీ ఉన్నాయి. ముఖ్యంగా నటీనటుల విషయంలో వచ్చిన మార్పు నాకు నచ్చదు. అప్పట్లో మేం నటనను ఎంతో సీరియస్‌గా తీసుకునేవాళ్లం. చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్లం. కానీ ఇప్పటివాళ్లు కాస్త పేరు రాగానే పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్లే వాళ్లు సంవత్సరాల పాటు కొనసాగడం లేదు. ఒకట్రెండు సీరియళ్లు చేసి మాయమైపోతున్నారు. నటనారంగంలో ఆడవాళ్లను తక్కువగా చూస్తారంటారు... నిజమేనా? అదే నిజమైతే మేమంతా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పని చేయగలిగేవాళ్లం కాదు. ప్రతిచోటా మంచీ చెడూ ఉన్నట్టే ఇక్కడే ఉంటాయి. కేవలం చెడునే చూస్తూ మంచిని విస్మరించడం కరెక్ట్ కాదు. కానీ అక్కడ ఉండే వేధింపుల వల్ల టాలెంట్ ఉన్న అమ్మాయిలు ధైర్యంగా రాలేకపోతున్నారని అంటారు కదా? నాకెప్పుడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదు. అయినా వేధింపులనేవి ఎక్కడ లేవు? ఆఫీసుల్లో లేవా? బస్సుల్లో లేవా? రోడ్డుమీద నడిచి వెళ్తుంటే లేవా? మనం సరిగ్గా ఉండి, మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరన్నది నా నమ్మకం, నేను ఫాలో అయ్యే సిద్ధాంతం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నటించి నటించి బోర్ కొట్టేసింది. ఒకేలాంటి పాత్రలు చేసి విసిగిపోయాను. ఇక చాలు అనిపిస్తోంది. అందుకే యాక్టింగ్‌కి బై చెప్పి ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది. నిజానికి ఐదేళ్ల నుంచీ ఇలా అనుకుంటున్నాను. ఏదో ఒక మంచి రోల్ రావడంతో పోస్ట్‌పోన్ చేస్తున్నాను. ఈ సంవత్సరమైనా అనుకున్నది చేయాలి. కెరీర్ గురించి చెప్పారు. మరి మీ...? (నవ్వుతూ) పర్సనల్ లైఫ్ గురించే కదా! ఆ సెటిల్మెంట్ కూడా ఈ సంవత్సరమే జరుగుతుంది. ఆల్రెడీ నా లైఫ్‌లో ఓ వ్యక్తి ఉన్నారు. త్వరలో ఆయనను పెళ్లి చేసుకోబోతున్నాను. తను ఎవరు, ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్! - సమీర నేలపూడి -
టీడీపీ నేతల వేధింపులతో వివాహిత ఆత్మహత్య
స్టోరు తీసేస్తాం, పింఛను తొలగిస్తామని బెదిరించినట్టు మృతురాలి బంధువుల ఆరోపణ మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పరామర్శ అనంతపురం కార్పొరేషన్ : టీడీపీ నేతల వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనకూడేరు మండలం కొర్రకోడుకులో బుధవారం జరిగింది. మృతురాలి భర్త, బంధువులు, కూడేరు వైస్ ఎంపీపీ రాజశేఖర్ కథనం ప్రకారం.. వికలాంగుడైన ఉల్లా ఉద్దీన్, అస్మిత భార్యభర్తలు. ఉల్లా ఉద్దీన్ యూనిమేటర్గా పనిచేస్తున్నారు. సుమారు 18 నెలల నుంచి వేతనం రావడంలేదు. ఇతనికి రేషన్ దుకాణం ఉంది. వికలాంగుల పింఛను పొందుతున్నాడు. ఉల్లా ఉద్దీన్, ఆయన బంధువులు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. ఇదీ ఓర్వలేని టీడీపీ నేతలు కొందరు ఇది మా ప్రభుత్వం.. నీ స్టోరు తీసేస్తాం.. నీ పింఛను తొలగిస్తాం అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆ రెండు పోతే తాము బతకలేమని భయపడిన అస్మిత మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భౌతికకాయూన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అల్లా ఉద్దీన్ భార్య అస్మిత ఆత్యహత్య సమాచారం తెలుసుకున్న ఉరవకొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మార్చురీ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న మృతురాలి భర్త, బంధువులను పరామర్శించారు. అస్మిత ఆత్మహత్య చేసుకొనేందుకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరి బెదిరింపులకు భయపడవద్దని ధైర్యం చెప్పారు.