ఏడ్చింది చాలు ఇక ఏడిపిస్తా - అస్మిత | The edipista put cry - Asmita | Sakshi
Sakshi News home page

ఏడ్చింది చాలు ఇక ఏడిపిస్తా - అస్మిత

Published Fri, Feb 5 2016 11:14 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

ఏడ్చింది చాలు  ఇక ఏడిపిస్తా  - అస్మిత

ఏడ్చింది చాలు ఇక ఏడిపిస్తా - అస్మిత

టెలివిజన్ టాప్ ఆర్టిస్టుల లిస్టులో మొదటి వరుసలో ఉండే పేరు అస్మిత. పంజరం, పద్మవ్యూహం, మేఘసందేశం, ఆకాశగంగ, సీతామాలక్ష్మి... ఇలా ఎన్నో సీరియళ్లలో ఎంతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారామె. టాలెంట్, తెగువ, తెలివితేటలు, సమయస్ఫూర్తి... అన్నీ సమపాళ్లలో ఉన్న వ్యక్తి ఆమె. తన కెరీర్ గురించి, తన అనుభవాల గురించి అస్మిత సాక్షితో ఇలా పంచుకున్నారు...
 
 
ఎప్పుడూ సీరియల్స్‌లో కనిపించే మీరు... ఆ మధ్య వార్తల్లో కనిపించారు?
అవును. అదో పీడకల. నేను కారులో పోతుంటే కొందరు వెంబడించి వేధించారు. వెంటనే ఫొటో తీసి, షి టీమ్‌కి వాళ్లను పట్టించాను. అప్పటికే రెండు మూడుసార్లు అలాంటివి ఫేస్ చేశాను. ఇంక ఆ రోజు తట్టుకోలేక ఆ పని చేశాను.
     
మీకు ధైర్యం ఎక్కువే?
ఆ ధైర్యం ఉండాలి. ఎవరో వచ్చి వేధిస్తుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మన భయం... వాళ్లకు అవకాశం. అదే ధైర్యం చేసి ఎదురు తిరిగితే, వాళ్లే భయపడి పారిపోతారు. అందుకే నేను చెప్తుంటాను... ఆడపిల్లలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, ఆపద వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి, తెలివిగా అడుగు వేయాలి అని.
     

చాలా డైలీ సీరియల్స్‌లో నిస్సహాయ మహిళగా, జాలిగొలిపే పాత్రలు చేశారు. కానీ స్వతహాగా మీరలా కాదన్నమాట?
అవును. సీరియళ్లలో అంటే పాత్రల్ని బట్టి అలా చేయాల్సి వస్తుంది. బయట అలా ఉండను. చెప్పాలంటే సీరియళ్లలో కూడా ఏడ్చీ ఏడ్చీ విసుగొచ్చేసింది. అందుకే ఏడ్చేది కాకుండా ఏడిపించే పాత్ర చేయాలనకున్నా. ‘సీతామాలక్ష్మి’లోని మాలినీదేవి పాత్రతో ఆ కోరిక తీరింది. ఆ సీరియల్ హీరో నాగబాబుగారైతే, ‘నీలో నాకు ఒకలాంటి యారొగెన్స్ కనిపించేది, నెగటివ్ రోల్ బాగా చేయగలవని అనిపించేది, అది నిజమైంది’ అన్నారు. ఇక చూడండి, ఏడ్వను.. ఏడిపిస్తా!

     
ఈ మధ్య పెద్ద వయసు పాత్రలు చేస్తున్నారు. కావాలనే చేస్తున్నారా లేక అవకాశాలు లేక..?

లేదు లేదు... అవకాశాలు లేకపోవడమన్నది ఎప్పుడూ లేదు. కావాలనే చేస్తున్నాను. నిజానికి అవన్నీ మొదట వయసులో ఉన్న పాత్రలు. జనరేషన్స్ మారినప్పుడు నా పాత్ర ముసలిదయ్యింది... అంతే.
   
అసలు నటిగా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
మాది మార్వాడీల కుటుంబం. మా తాతగారువాళ్లు వ్యాపారరీత్యా కలకత్తాలో ఉన్నప్పుడు, నేను అక్కడే పుట్టాను. నా చిన్నతనంలోనే మా ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చి సెటిలైపోయింది. నాకు చిన్నప్పట్నుంచీ మోడలింగ్ అంటే పిచ్చి. కానీ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. డిగ్రీలో ఉన్నప్పుడు ఓ జీన్స్ కంపెనీ యాడ్ చేసే చాన్స్ వస్తే నో అన్నారు. అయినా వదలకుండా నేను స్థానికంగా జరిగిన ఓ మోడలింగ్ పోటీలో పాల్గొని గెలిచాను. అప్పుడు ఓకే అన్నారు. దాంతో యాడ్స్‌లో బిజీ అయిపోయాను. ఆ తర్వాత ‘మనుషులు మమతలు’ సీరియల్‌లో చాన్స్ వచ్చింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదింక.

అప్పట్లో సినిమాలూ చేశారు. ఇప్పుడు చేయడం లేదేంటి?
‘మనుషులు మమతలు’ చేస్తున్నప్పుడే ‘మురారి’ సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత వరుసగా లవ్ టుడే, అప్పుడప్పుడు, మధుమాసం, అతిథి... ఇలా వరుసగా కొన్ని చేసుకుంటూ పోయాను. అవన్నీ తెలిసినవాళ్ల ద్వారా వచ్చిన అవకాశాలు. నాకైతే సినిమాలపై పెద్ద ఆసక్తి లేదు. అందుకే హీరోయిన్‌గా చేసే చాన్స్ వచ్చినా వదిలేశాను.
     
ఈ పరిశ్రమలో మీకు నచ్చేదేంటి... నచ్చనిదేంటి?
నటనంటే ఆసక్తి. నటించే అవకాశం ఇచ్చిన పరిశ్రమ అంటే ఇష్టం. ఇక నచ్చనిదంటే... టైమింగ్స్. షెడ్యూల్స్ చాలా టైట్‌గా ఉంటాయి. రోజంతా పని చేస్తూనే ఉంటాం. ఒక్కోసారి చాలా అలసట వచ్చేస్తుంది.
     
మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పు ఏంటి?
చాలా మార్పులొచ్చాయి. వాటిలో మంచివీ ఉన్నాయి, బాధ పెట్టేవీ ఉన్నాయి. ముఖ్యంగా నటీనటుల విషయంలో వచ్చిన మార్పు నాకు నచ్చదు. అప్పట్లో మేం నటనను ఎంతో సీరియస్‌గా తీసుకునేవాళ్లం. చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్లం. కానీ ఇప్పటివాళ్లు కాస్త పేరు రాగానే పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్లే వాళ్లు సంవత్సరాల పాటు కొనసాగడం లేదు. ఒకట్రెండు సీరియళ్లు చేసి మాయమైపోతున్నారు.
  
నటనారంగంలో ఆడవాళ్లను తక్కువగా చూస్తారంటారు... నిజమేనా?
అదే నిజమైతే మేమంతా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పని చేయగలిగేవాళ్లం కాదు. ప్రతిచోటా మంచీ చెడూ ఉన్నట్టే ఇక్కడే ఉంటాయి. కేవలం చెడునే చూస్తూ మంచిని విస్మరించడం కరెక్ట్ కాదు.
     
కానీ అక్కడ ఉండే వేధింపుల వల్ల టాలెంట్ ఉన్న అమ్మాయిలు ధైర్యంగా రాలేకపోతున్నారని అంటారు కదా?
నాకెప్పుడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదు. అయినా వేధింపులనేవి ఎక్కడ లేవు? ఆఫీసుల్లో లేవా? బస్సుల్లో లేవా? రోడ్డుమీద నడిచి వెళ్తుంటే లేవా? మనం సరిగ్గా ఉండి, మన పని మనం చేసుకుంటూ పోతే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరన్నది నా నమ్మకం, నేను ఫాలో అయ్యే సిద్ధాంతం.

ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
నటించి నటించి బోర్ కొట్టేసింది. ఒకేలాంటి పాత్రలు చేసి విసిగిపోయాను. ఇక చాలు అనిపిస్తోంది. అందుకే యాక్టింగ్‌కి బై చెప్పి ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది. నిజానికి ఐదేళ్ల నుంచీ ఇలా అనుకుంటున్నాను. ఏదో ఒక మంచి రోల్ రావడంతో పోస్ట్‌పోన్ చేస్తున్నాను. ఈ సంవత్సరమైనా అనుకున్నది చేయాలి.
     
కెరీర్ గురించి చెప్పారు. మరి  మీ...?

(నవ్వుతూ) పర్సనల్ లైఫ్ గురించే కదా! ఆ సెటిల్మెంట్ కూడా ఈ సంవత్సరమే జరుగుతుంది. ఆల్రెడీ నా లైఫ్‌లో ఓ వ్యక్తి ఉన్నారు. త్వరలో ఆయనను పెళ్లి చేసుకోబోతున్నాను. తను ఎవరు, ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!

 - సమీర నేలపూడి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement