మోతె: రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన గురుకుల పాఠశాలల విద్యార్థుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అస్మిత ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది.
విద్యార్థిని స్వగ్రామం మోతె మండలంలోని బుర్కచర్లలో కుటుంబ సభ్యులను కవిత మంగళవారం పరామర్శించారు. అస్మితకు నివాళులర్పించి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి చేతులెత్తి జోడించారు.
ప్రతి హాస్టల్‌లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. తల్లిదండ్రులు పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని కవిత కోరారు. ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం చొరవ చూపి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment