ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్‌ | Tpcc Chief Mahesh Kumar Goud Challenges Mlc Kavitha | Sakshi
Sakshi News home page

ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్‌

Published Thu, Jan 2 2025 7:09 PM | Last Updated on Thu, Jan 2 2025 7:30 PM

Tpcc Chief Mahesh Kumar Goud Challenges Mlc Kavitha

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ధర్నా చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలకు న్యాయంగా అందాల్సిన నిధులు అందించకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. ఇప్పుడు  అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు

‘‘బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్‌ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్‌కు బీసీలు గుర్తుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్‌లో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం’’ అంటూ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు.

కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే. అంతేకాక రాష్ట్ర  క్యాబినెట్‌లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో బహిరంగ రహస్యమే. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’’ అంటూ మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఎద్దేవా చేశారు.

‘‘కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా.?

..బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?

..జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో  న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్‌ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?

..గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?. ఎమ్బీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?

..గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లు నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?’’ అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీకి మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రశ్నలు సంధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement