విద్యార్థినుల ఆత్మహత్యల కలకలం! | Imampeta Gurukula School student commits suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల ఆత్మహత్యల కలకలం!

Published Mon, Feb 19 2024 4:14 AM | Last Updated on Mon, Feb 19 2024 7:29 AM

Imampeta Gurukula School student commits suicide - Sakshi

సూర్యాపేట రూరల్‌: సూర్యాపేట జిల్లా ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడటం పలు అనుమాలకు తావిస్తోంది.

ఇదే పాఠశాలలో ఇంటర్మిడియట్‌ రెండో సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ఈ నెల 10న హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వ అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఝాన్సీని సస్పెండ్‌ చేశారు. 

సెలవులు ఇవ్వడంతో.. 
వైష్ణవి ఉదంతం మరువకముందే తాజాగా ఇదే పా ఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్, జ్యోతిల కుమార్తె అస్మిత (15) శనివారం హైదరాబాద్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వైష్ణవి ఆత్మహత్య అనంతరం విద్యార్థినులు భయపడకుండా ఉంటానికి పాఠశాలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. దీంతో అస్మిత సెలవుల్లో హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్న తల్లి వద్దకు వెళ్లింది.

శనివారంతో సెలవులు అయిపోతున్నందున తిరిగి పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి.. తల్లి తన పనులకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుందని బంధువులు తెలిపారు. పాఠశాలకు తిరిగి వెళ్లాల్సిన రోజే అస్మిత ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

అస్మిత, వైష్ణవి రూమ్‌మేట్స్‌? 
గురుకుల పాఠశాల విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఇటు తల్లిదండ్రులు, అటు విద్యార్థినులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి రూమ్‌లోనే అస్మిత కూడా ఉండేదని తెలిసింది. ఒకే రూమ్‌లో ఉండటంతో వైష్ణవి మరణాన్ని జీ ర్ణించుకోలేక అస్మిత కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు చెపుతున్నారు.

వారం వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ఆత్మహత్యలకు పాల్పడటం వారి కుటుంబాలు, తోటి విద్యార్థినుల్లో విషాదాన్ని నింపింది. అస్మిత మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం బుర్కచర్ల తీసుకువచ్చి ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు.  

ఇమాంపేట గురుకుల పాఠశాల తనిఖీ 
ఇమాంపేట వద్ద గల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం సాయంత్రం సోషల్‌ వెల్ఫేర్‌ గు రుకుల కార్యదర్శి సీతాలక్ష్మి తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాల, బాలికల విశ్రాంతి గదులను పరిశీలించారు. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్ద రు బాలికల ఆత్మహత్యల నేపథ్యంలో విద్యార్థినుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించాలని, పిల్లలతో మమేకమై వారిని ఆటపాటలతో ఆనందింపజేయా లని సూచించారు.

గురుకులాల్లో మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం సైకియాట్రిస్టులతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఆమె వెంట గురుకుల జాయింట్‌ సెక్రటరీ అనంతలక్షి్మ, నల్లగొండ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ప్రశాంతి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అరుణకుమారి ఉన్నారు. 


ఉన్నతాధికారుల ఆరా.. 
ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతోంది? విద్యార్థినులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఏమి టి? తదితర అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

సోమవారం గురుకుల పాఠశాలకు కలెక్టర్, అదనపు కలెక్టర్‌లు వెళ్లి విచార ణ జరపనున్నట్లు సమాచారం. ఈ తరహా ఘటనల వల్ల పాఠశాలలో విద్యనభ్యసించే ఇతర విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement