సౌజిత్ రాజు(ఫైల్)
సాక్షి, కొయ్యూరు(పాడేరు): ‘నేనంటే ఇంటిలో ఎవరికీ ఇష్టం లేదు... నాకు నేనే నచ్చను.. సంతోషం ఆవిరవుతున్న క్షణం ఇది.. నాకు బతకాలని లేదు..’ అంటూ లేఖ రాసి ఓ విద్యార్థి డార్మెటరీలో కట్‌చేసిన రగ్గు పీలికతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానిక గురుకుల పాఠశాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు మండలం లగిజేపల్లి పంచాయతీ గురుపల్లికి చెందిన పూజారి హరికృష్ణరాజు, సరస్వతి కుమారుడు సౌజిత్‌రాజు (15) స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఐదేళ్లుగా ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాలలో సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన సమావేశంలో రాజు పాల్గొన్నాడు. అతని తల్లిదండ్రులు హాజరుకాలేదు. పండగ సెలవులు ఇవ్వడంతో మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులందరూ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. స్వగ్రామాలకు వెళ్తున్నట్టు అందరితో పాటు సౌజిత్‌రాజు కూడా రిజిస్టర్‌లో సంతకం చేశాడు. మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తాడని స్నేహితులతో చెప్పి అక్కడే ఉండిపోయాడు. సాయంత్రం ఆరుగంటలకు ఒకసారి, ఎనిమిది గంటలకు మరోసారి పాఠశాల వాచ్‌మన్ కోటి డార్మెటరీలో గదులన్నీ చెక్ చేశాడు. విద్యార్థులెవరూ కనిపించలేదు. చదవండి: ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..!
మంగళవారం ఉదయం లైట్లు ఆర్పేందుకు వెళ్లిన కోటికి సౌజిత్‌రాజు విగతజీవిగా కనిపించాడు. వెంటనే ప్రిన్సిపాల్ శ్రీనివాసరావుకు సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ నాగేంద్రలు పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ జరుపుతామని సీఐ,ఎస్‌ఐలు తెలిపారు. అందరితో పాటు పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన రాజు అర్ధరాత్రి సమయంలో డార్మెటరీకి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకుని రాజు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్నేహితులు, పాఠశాల సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఇలా జరిగిందని రాజు బంధువులు, తల్లిదండ్రులు కొద్ది సేపు వాచ్‌మన్ కోటితో వాగ్వాదం చేశారు. చదవండి: ‘చోర్ సింగర్’.. సిటీలోనూ వాంటెడ్ !!
లేఖను చదువుతున్న తండ్రి హరికృష్ణరాజు తదితరులు
రాజు కోసం వడ్డాది వెళ్లాం..
శుక్ర, శనివారాల్లో పాఠశాలకు రెండు సార్లు ఫోన్ చేస్తే సోమవారం అమ్మఒడి సమావేశం అయిన తరువాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. దీంతో రాజు వస్తాడని సోమవారం రాత్రి వడ్డాది వెళ్లాం. అక్కడ చాలా సేపు వేచి ఉన్నామని రాజు తండ్రి హరికృష్ణరాజు విలపిస్తూ విలేకరులకు తెలిపాడు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తరువాత వడ్డాది నుంచి పాడేరు వచ్చేందుకు ఎలాంటి వాహనాలు ఉండవు. దీంతో తమ బిడ్డ వడ్డాదిలో ఉండిపోయి ఉంటాడని భావించి అక్కడ వెతికామని చెప్పారు. ఎక్కడా కనిపించకపోవడంతో మంగళవారం వస్తాడన్న ఆశతో వెళ్లిపోయామన్నారు. ఉదయం లేవగానే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చిందని వాపోయాడు.
ఆరు పేజీల లేఖ
ఆత్మహత్య చేసుకునే ముందు సౌజిత్ రాజు ఆరు పేజీల లేఖ రాశాడు. ఇంగ్లిష్ మీడియం కావడంతో తెలుగులో తప్పులు వస్తాయని పేర్కొన్నాడు. చిన్ననాటి విషయాలు, స్నేహితులతో ఆడుకున్న పాత జ్ఞాపకాలు ప్రస్తావించాడు. నాకు ఒత్తిడి పెరిగిపోతోంది. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని తెలిపాడు. తల్లిదండ్రులు మందలించారని పేర్కొన్నాడు. సొంత గ్రామానికి వెళ్లాలని లేదని తెలిపాడు. పరీక్షల అట్ట, కొన్ని నోట్‌పుస్తకాలపై పబ్జీతోపాటు ప్రీఫైర్ ఆటల బొమ్మలు వేసి ఉన్నాయి. అయితే ఈ ఆటలంటే నాటు ఇష్టం లేదంటూ ఆ లేఖలో తెలిపాడు. నా చావుకు ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment