
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలన్న ధ్యేయంతో చిన్నప్పట్నుంచీ ప్రతి క్లాస్‌లోనూ ఫస్ట్ వచ్చింది ఆంచల్ గంగ్‌వాల్. క్లాస్‌లోనే కాదు, క్లాస్ బయట ఆటల్లోనూ ఫైటింగ్ స్పిరిట్ చూపించింది. కలలకు రెక్కలు కట్టుకుని చదివి, ఫ్లయింగ్ బ్రాంచ్‌లో సీటు సాధించింది!
వేటూరి గారు అన్నట్లు ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు’. అంతేనా! ఆంచల్ గంగ్‌వాల్ కూడా అవుతారు! తమ మీద తమకు అచంచలమైన నమ్మకం ఉండి కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని నిరూపించింది ఆంచల్. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఈ అమ్మాయి ఇటీవలే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్వీస్‌కు ఎంపికైంది. ఆరు లక్షల మంది రాసిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో 22 మంది ఎంపికయ్యారు. వారిలో అమ్మాయిలు ఐదుగురు. ఆ ఐదుగురిలో ఫ్లయింగ్ బ్రాంచికి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఒకే ఒక అమ్మాయి ఆంచల్. అందుకే ఆంచల్ సాధించిన విజయం పట్ల ఆమె అమ్మానాన్నలతో పాటు రాష్ట్రం కూడా గర్వపడుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్‌లో ఆంచల్‌కు అభినందనలు తెలియచేశారు. ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి అర్చనా చిట్నీస్ అయితే స్వయంగా ఆంచల్ ఇంటికి వచ్చి మరీ అభినందించారు. ‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ని అంచల్ బుగ్గలు పుణికారామె.
పెద్దింటమ్మాయి కాదు!
ముఖ్యమంత్రి అభినందనలు, మంత్రి ప్రశంసలు అందుకున్న ఆంచల్.. ఆర్థికంగా ఒక సాధారణ దిగువ తరగతి ఇంటి అమ్మాయి. నీముచ్ జిల్లా కేంద్రంలో బస్‌స్టాండ్‌లో టీ దుకాణం నడుపుతాడు ఆంచల్ తండ్రి సురేశ్. అయితే ఇప్పుడు పట్టణంలో అందరికీ ఆంచల్ వల్లనే ‘నామ్‌దేవ్ టీ స్టాల్’ గురించి తెలిసింది. ‘‘నా టీ స్టాల్‌ని వెతుక్కుంటూ వచ్చి ఆంచల్ తండ్రి మీరేనా అని అడిగి మరీ నన్ను అభినందిస్తున్నారు, నా కూతురు పైలటయినా అంత ఆనందం కలిగిందో లేదో కానీ తండ్రిగా నా గుండె ఉప్పొంగిపోతోంది’ అంటున్నాడు సురేశ్.
ఇది ఆరో ప్రయత్నం
రక్షణ రంగంలో చేరాలనే ఆలోచన బాల్యంలోనే మొలకెత్తింది ఆంచల్‌లో. నీముచ్‌లోని మెట్రో హెచ్‌ఎస్ స్కూల్‌లో క్లాస్ టాపర్ అయ్యింది. దాంతో స్కూల్ కెప్టెన్ అయింది. తర్వాత ఉజ్జయిన్‌లో విక్రమ్ యూనివర్సిటీలోనూ ప్రతిభ కనబరిచి స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది. బాస్కెట్‌బాల్, 400 మీటర్ల పరుగులో కాలేజ్‌కు ప్రాతినిధ్యం వహించింది. డిఫెన్స్‌లో చేరాలంటే అన్ని రకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి కాబట్టి ఇన్నింటిలో చురుగ్గా ఉండేదాన్నని చెబుతుంది ఆంచల్. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులు కోవడానికి కారణమూ డిఫెన్స్ పట్ల ఇష్టమేనంటోంది. సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరితే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ప్రిపరేషన్‌కి వెసులుబాటు ఉండదని వదిలేసిందామె. ఆ తరువాత వచ్చిన లేబర్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరేటప్పుడు కూడా ప్రిపరేషన్‌కి అవకాశం ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతనే చేరింది. ఒక పక్క ఇతర ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే తను కలగన్న డిఫెన్స్ ఉద్యోగానికి పరీక్షలు రాస్తూ వచ్చింది. ఐదు ప్రయత్నాలు సఫలం కాకపోయినా సంకల్పాన్ని వదలకపోవడమే ఆంచల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆరవ ప్రయత్నంలో ఆమె ఎయిర్‌ఫోర్స్ రంగంలో సెలెక్ట్ అయింది. ఆ ఫలితాలు ఈ నెల ఏడవ తేదీన వెలువడ్డాయి. అప్పటి నుంచి ఆమె ఇంటి ఫోన్ రింగవుతూనే ఉంది. ‘ఆంచల్! నేల మీద నుంచి నింగి దాకా ఎదిగావు’ అంటూ అభినందనల వాన కురుస్తూనే ఉంది.
– మంజీర
ఆ వరదలే కారణం!
నేను పన్నెండవ తరగతిలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తాయి. అప్పుడు బాధితులను రక్షించడానికి ఆర్మీ జవాన్లు బృందాలుగా వచ్చారు. తమకు ఏమవుతుందోననే భయం వారిలో ఏ కోశానా కనిపించేది కాదు. ప్రమాదకరమైన ప్రదేశాల్లో చొరవగా దూసుకెళ్లిపోయి బాధితులను కాపాడడం చూసినప్పుడు నాకు ఒళ్లు పులకరించినట్లయింది. ఇలాంటి సర్వీసుల్లో చేరాలని నాకప్పుడే అనిపించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పట్లో చేరలేకపోయాను. ఆ కల ఇప్పటికి తీరింది. నా కోచింగ్ కోసం నాన్న లోన్ తీసుకున్నాడు. ఉద్యోగంలో చేరగానే లోన్ తీరుస్తాను. ఆ లోన్ తీర్చినప్పుడే నాన్న కళ్లలోకి ధైర్యంగా చూడగలుగుతాను.
– ఆంచల్, ఐఎఎఫ్