
దేవుడిచ్చిన అన్న!
ఉత్తర భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో తరచుగా ఒక వ్యక్తి తారసపడుతుంటాడు. చూడ్డానికి మనిషి సన్నగా, పీలగా ఉంటాడు కానీ, మాట్లాడితే నిప్పులు కురుస్తాయి. ఆవేశంతో అతడు చెప్పే విషయాలు సూటిగా మనసుల్లోకి దూసుకుపోతాయి. బలంగా నాటుకుపోతాయి. ఎందుకంటే అతడి భావాలు అంత దృఢమైనవి. అతడి ఆలోచనలు అంత ఉన్నతమైనవి. అతడే షఫీక్ ఉర్ రెహమాన్ ఖాన్. అతడి గురించి పూర్తిగా తెలుసు సుకోవాలంటే ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్ హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ఆడపిల్లలను అడగండి...
అతడిని అందరూ దేవుడిచ్చిన అన్న అంటారు ఆప్యాయంగా! కానీ, తెగిన గాలిపటం అన్న పదం తనకు అచ్చంగా సరిపోతుంది అంటారు షఫీక్ తన గురించి చెప్పమంటే...
అతడి కథలో మలుపులెన్నో...
గయ (బీహార్)లోని ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు షఫీక్. రెక్కలు ముక్కలు చేసుకుని అయినా అతడిని గొప్పస్థాయికి చేర్చాలని ఆశించేవారు అమ్మానాన్నలు. కానీ షఫీక్‌కి మొదట్నుంచీ చదువు మీద పెద్ద ఆసక్తి లేదు. ఇతర అంశాల మీద మాత్రం బాగా శ్రద్ధ పెట్టేవాడు. తను ఏడో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ల బడికి ఎదురుగా ఓ స్వచ్ఛంద సంస్థవారు లైబ్రరీని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి షఫీక్ అక్కడే కాలం గడిపేవాడు. కనిపించిన పుస్తకాలన్నీ చదివేసేవాడు. అప్పుడే అతడిలో సమాజం పట్ల చింతన మొదలైంది. తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలని అనుకునేవాడు. ఆ సమయంలోనే మార్క్సిస్టు భావజాలానికి ఆకర్షితుడై ఆ పార్టీలో చేరాడు. అంతే... ఆ దెబ్బతో చదువు అటకెక్కింది. దానికి తోడు మావోయిస్టులతో సంబంధాలు ఏర్పరచుకుని వారితో చేరిపోయాడు. కానీ వారి భావజాలాలను ఒంటబట్టించుకోలేక పోయాడు. దాంతో బయటకు వచ్చేశాడు. తన స్నేహితులతో కలిసి ‘ఎంపవర్ పీపుల్’ అనే సంస్థను స్థాపించాడు. ఇదే గాలిపటం లాంటి తన జీవితాన్ని ఓ గాటన కట్టేసిందంటాడు షఫీక్. అంతవరకూ ఏం చేయాలా ఆలోచించిన అతడికి, ఏం చేయాలో స్పష్టత ఏర్పడింది. అంతే... ఆ తర్వాత అతడు ‘నా’ అన్నమాటను మర్చిపోయాడు. అందరి కోసం బతకాలన్న నిర్ణయానికి వచ్చాడు.
ఉద్యమ కెరటం ఎగసిందలా...
‘ఎంపవర్ పీపుల్’ ద్వారా పేద పిల్లలకు చదువు చెప్పడంతో మొదలు పెట్టి... ఆహారం, దుస్తుల పంపిణీ, ఆరోగ్యం పట్ల అవగాహన వంటి పలు విషయాల్లో కృషి చేయసాగాడు షఫీక్. అయితే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భ్రూణహత్యలను వ్యతిరేకించడం గురించి! పేదరికంతో అల్లాడే గ్రామాల్లో ఆడపిల్లను భారమనుకుని కడుపులోనే చంపేయడం చూసి తట్టుకోలేకపోయాడు షఫీక్. ఆడపిల్ల మగపిల్లాడితో సమానమే, తననీ బతకనివ్వండి అంటూ ప్రచారం మొదలుపెట్టాడు. అందులో భాగంతో ఒక చోటికి వెళ్లినప్పుడు ఓ మహిళ తారసపడింది. తమ ఊరిలో కూడా అలాంటివి జరుగుతున్నాయని, అక్కడివారిని కూడా మార్చమని అడిగింది. అలాగే వస్తానని ఆమెకు మాటిచ్చాడు షఫీక్. తీరా అతడు ఆ గ్రామానికి వెళ్లేసరికి ఆమె అక్కడ లేదు. గ్రామస్థులను అడిగితే పెళ్లయిపోయిందని చెప్పారు. ఎక్కడుందో చెప్పమంటే ఎవరికీ తెలియదన్నారు. ఆరా తీస్తే తెలిసింది... ఆ ఊరిలోని పలువురు అమ్మాయిలను పెళ్లి పేరుతో షేకులకు, సంపన్నులకు అమ్మేస్తున్నారని! షేకులకు భార్యలుగా వెళ్లిన ఆడపిల్లలు కడకు వేశ్యా వాటికలోనో, వల్లకాటిలోనే తేలుతున్నారని!
చాలా బాధపడ్డాడు షఫీక్. ఆడపిల్లలుగా పుట్టినంత మాత్రాన అంత దారుణంగా వారి జీవితాలను కాలరాయడాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పట్నుంచీ ‘మ్యారేజ్ ట్రాఫికింగ్’కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశాడు. దాదాపు పది రాష్ట్రాల్లో తన ఉద్యమజ్వాలల్ని రగిలించాడు. ఎంతోమంది అమ్మాయిల్ని అక్రమ రవాణా నుంచి కాపాడాడు. పోలీసుల్ని అప్రమత్తం చేశాడు. అధికారుల్ని మేల్కొలిపాడు. ఆడపిల్లల హక్కుల్ని కాపాడటమే ధ్యేయంగా, వారి సంరక్షణే కర్తవ్యంగా పోరాడు తున్నాడు. ఆడపిల్లల జీవితాలు ఇలా కావడానికి పేదరికం, లింగ వివక్ష, చట్టాల్లో లోపం, బాల్యవివాహం, వరకట్నం... ఇలా చాలా కారణాలు చెబుతాడు. వీటన్నిటినీ కూకటివేళ్లతో సహా పెకలించినప్పుడే మన దేశ ఆడపడుచుల బతుకుల్లోకి ఆనందం వస్తుందంటాడు ఆవేశంగా.
ఆ ఆవేశమే అతడి బలం. ఆ ఆవేశమే ఆడపిల్లలకు వరం. కానీ షఫీక్ ఒక్కడే ఇలా ఆలోచిస్తే సరిపోతుందా? లేదు. అందరూ అతనిలా ఆలోచించాలి. ఇంకెందరో షఫీక్‌లు రావాలి. అప్పుడు ఆడపిల్లలందరి జీవితాలూ నిజంగానే మారిపోతాయి. వారి కళ్లు కన్నీళ్లనేవి ఉంటాయన్న విషయాన్నే మర్చిపోతాయి!
చిన్నగానే మొదలు పెట్టిన షఫీక్ ఉద్యమం చాలా తీవ్రతరం అయ్యింది. మొదట్లో ఏదో చెబుతున్నాడులే అనుకున్నవాళ్లంతా అతడు రక్షించిన ఆడపిల్లలను చూసిన తర్వాత మనసు మార్చుకున్నారు. అతడి గొప్పదనాన్ని ఒప్పుకుంటున్నారు.