
దేవుడికి సమర్పించినదే... నైవేద్యం
ఆత్మీయం
పండగరోజుల్లోనో, పూజలు చేసేటప్పుడో దేవుడికి నైవేద్యం పెట్టడం అలవాటు. నైవేద్యం పెట్టేటప్పుడు ఏ మంత్రాలు చదవాలో, ఏం చేయాలో తెలియకపోయినా... ఒక ఆకులో లేదా పళ్లెంలో వండిన పదార్థాలన్నింటినీ ఉంచి, దేవుడికి చూపించిన తర్వాతే భోజనం చేస్తారు. నైవేద్యం ఎందుకంటారు? మనం ఆహారం తినేటప్పుడు ‘ఇది నేను సంపాదించినది లేదా మా నాన్న సంపాదించినది లేదా నా భర్త సంపాదించినది’ అనే భావం తొంగి చూస్తుంటుంది. అదే ఆహారాన్ని భగవంతునికి సమర్పించడం వల్ల అహంకారం స్థానంలో వినమ్రత కలుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తుంది.
‘నేను ఈ రోజున అన్నం తింటున్నానంటే, అది నీ కృప వల్లే తప్ప నా గొప్పతనం కాదు’ అనే సమర్పణ భావన, కృతజ్ఞతాభావం ఉంటాయి. భగవంతునికి సమర్పించిన దానిని వృథా చేయరాదన్న ఆలోచన కలుగుతుంది. మనం పుస్తకంలో లేదా పేపర్‌లో అక్షరాలు చదువుతాం... ఆ అక్షరాలు అక్షరాలుగా పేపర్‌లో లేదా పుస్తకంలో ఉంటాయి కానీ, అవి జ్ఞానంగా, జ్ఞాపకంగా మారి మన మెదడులో ప్రవేశిస్తాయి... అదేవిధంగా దేవుడు మనం పెట్టిన నైవేద్యాన్ని సూక్ష్మస్థితితో స్వీకరిస్తాడు... కానీ పదార్థాలు పదార్థాలుగా అలాగే ఉండిపోతాయన్నమాట. దానినే మనం పవిత్రమైన ప్రసాదంగా స్వీకరిస్తాం.