జైన సంప్రదాయంలో ప్రధానమైన దేవతలను తీర్థంకరులు అంటారు. వారు ఇరవైనాలుగుమంది. వీరిలో మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. ఇతడే జైనమత స్థాపకుడు. ఇతనికి ఇద్దరు కుమారులు. వారు భరతుడు, బాహుబలి. చక్రవర్తి అయిన ఋషభనాథుడు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడైన భరతునికిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. అప్పటికే బాహుబలి పోదనపురానికి రాజుగా ఉన్నాడు.భరతుని బహురాజ్యకాంక్షతో అన్ని రాజ్యాలనూ జయిస్తూ వచ్చాడు. కానీ బాహుబలి అతనికి లొంగకుండా యుద్ధం చేశాడు. యుద్ధంలో బాహుబలి విజయం సాధించాడు కానీ, విరక్తుడై భరతుడికి తన రాజ్యాన్ని ఇచ్చివేసి తాను నిలుచునేంత స్థలాన్ని దానంగా పొంది కాయోత్సర్గవిధిలో తపస్సు చేస్తూ నిలుచున్నాడు.(నిటారుగా నిలుచుని రెండు చేతులనూ రెండు వైపులా సమానంగా కిందకు చాపి కదలిక లేకుండా నిలుచోవడమే కాయోత్సర్గం.) ఆ తర్వాత ఈయనకు గోమఠేశ్వరుడు అనే పేరు వచ్చింది.
కర్ణాటకలో హాసన్ జిల్లాలో ఉన్న శ్రావణబెళగొళలో గోమఠేశ్వరుడి అరవై అడుగుల అద్భుతమైన విగ్రహం చెక్కబడి ఉంది. ఈ విగ్రహాన్ని క్రీస్తుశకం 974 – 984 మధ్యలో గంగరాచమల్లుని దండనాయకుడైన చావుండరాయుడు చెక్కించాడు. ఈ విగ్రహాన్ని మలచిన విధానంలో ఒక విశేషం ఏమిటంటే ఇంద్రగిరి కొండనే విగ్రహంగా మలిచారు. కొండ పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చారు.మరో విశేషమేమిటంటే విగ్రహం పాదపీఠం దగ్గర ఒక కొలబద్దను చెక్కారు. అది మూడు అడుగుల నాలుగు అంగుళాల కొలతను చూపిస్తోంది. దీనికి పద్దెనిమిది రెట్లు అంటే అరవై అడుగుల విగ్రహం ఉంది. దిగంబరంగా ఉన్న విగ్రహంలో గోమఠుడి శరీరానికి తీగలు అల్లుకుని ఉంటాయి. ఈ మూర్తికి జరిగే మహామస్తకాభిషేకం జగద్విఖ్యాతి కలిగింది. ఏటా జైనులు ఈ గోమఠేశ్వరుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో శ్రావణ బెళగొళను సందర్శిస్తారు.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి
Comments
Please login to add a commentAdd a comment